ఫ్యాక్ట్ చెక్: ట్రైన్ లో గోల్డ్ చైన్ దొంగతనానికి సంబంధించిన విజువల్స్ నిజమైనవి కాదు. నటీనటులతో సృష్టించిన వీడియో ఇది
ట్రైన్ లో గోల్డ్ చైన్ దొంగతనానికి సంబంధించిన విజువల్స్ నిజమైనవి కాదు
భారతీయ రైల్వే ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతిరోజూ 10,000కు పైగా రైళ్లను నడుపుతుంది. రైళ్లలోనూ, రైల్వే స్టేషన్స్ లోనూ భద్రతను పెంచడానికి అనేక చర్యలు తీసుకుంది, ముఖ్యంగా రైలులో భద్రతా సిబ్బందిని నియమించడం, స్టేషన్లలో నిఘాను పటిష్టం చేయడం వంటివి ఉన్నాయి. రైలు ప్రయాణంలో లగేజీ దొంగిలించబడినా లేదా పోగొట్టుకున్నా వెంటనే అధికారులను సంప్రదించడం మంచిది.
ప్రభుత్వం పంచుకున్న సమాచారం ప్రకారం, గత ఐదేళ్లలో భారతీయ రైల్వే తన భద్రతా వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేసింది. ఇందులో భాగంగా 52,000కు పైగా అరెస్టులు జరగ్గా, 50,000 మందికి పైగా నేరస్తులను కోర్టులలో హాజరు పరిచారు. లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, 2021 నుండి 2025 మధ్య కాలంలో, రైల్వే ఆస్తి (అక్రమ స్వాధీనం) చట్టం, 1966 కింద మొత్తం 52,494 మందిని అరెస్టు చేశారని తెలిపారు. వీరిలో, 50,432 మంది నేరస్థులపై ప్రత్యేక రైల్వే మేజిస్ట్రేట్ కోర్టులు, ప్రత్యేక కోర్టులు అందుబాటులో లేని చోట జిల్లా కోర్టులతో సహా సమర్థ న్యాయస్థానాలలో ఫిర్యాదులు దాఖలు చేసినట్లు తెలిపారు.
అయితే ఓ జంట రైలులో కూర్చుని ఉండగా ఓ వ్యక్తి వచ్చి ట్రైన్ కు సంబంధించిన వివరాలను అడిగిన తర్వాత, చైన్ లాక్కుని వెళ్లిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. లక్షల విలువ చేసే చైన్ ను దొంగతనం చేశారంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. అందుకు సంబంధించిన లింక్స్ ను ఇక్కడ చూడొచ్చు.
https://www.youtube.com/watch?
ఆర్కైవ్ లింక్ ఇక్కడ ఉంది.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోను నటీనటులతో చిత్రీకరించారు.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని గూగుల్ లెన్స్ లో చూశాం.
'Official_Rajthakur' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అదే వీడియోను ఓ యూజర్ మార్చి 20, 2026న అప్లోడ్ చేసినట్లు గుర్తించాం. స్క్రిప్టెడ్ కంటెంట్‌ను పోస్ట్ చేయడంలో ఈ ఖాతా ప్రసిద్ధి చెందింది, ఈ వీడియో స్క్రిప్ట్ ప్రకారం రూపొందించినట్లుగా ఆ పోస్టుల్లో తెలిపారు.
"ఈ వీడియో పూర్తిగా స్క్రిప్ట్ ప్రకారం రూపొందించారు, నిజం కాదు. ఈ కంటెంట్ అంతా కేవలం వినోదం, అవగాహన కోసమే" అని ఆ పోస్ట్ క్యాప్షన్‌లో ఉంది.
వైరల్ వీడియోలో ఉన్న నటీనటులు పలు వీడియోలలో ఉన్నారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
అలాగే అప్లోడ్ చేసిన పలు స్క్రిప్ట్స్ ఇదే తరహాలోనే ఉన్నాయి.
కేవలం వినోదం, అవగాహన కోసమే ఇలాంటి వీడియోలను సృష్టించినట్లుగా స్పష్టం చేశారు.
ఆ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ షేర్ చేసిన ఇతర పోస్టులను కూడా నిశితంగా పరిశీలించాం. వైరల్ వీడియోలో కనిపించిన వ్యక్తులతో, అదే నేపథ్యంతో, వేర్వేరు సంఘటనలను చిత్రీకరిస్తూ ప్రచురించిన అనేక ఇతర వీడియోలు ఆ అకౌంట్‌లో అందుబాటులో ఉన్నాయని కనుగొన్నాం.
రైలు కిటికీ పక్కన కూర్చున్న ఒక ప్రయాణికుడి మెడలో ఉన్న నెక్లెస్‌ను దొంగ లాక్కుని వెళ్ళిపోయిన వైరల్ వీడియో నిజమైనది కాదు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి నిజమైన సంఘటనగా ఆన్‌లైన్‌లో తప్పుగా షేర్ చేస్తున్నారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : ట్రైన్ లో గోల్డ్ చైన్ దొంగతనానికి సంబంధించిన నిజమైన వీడియో
Claimed By : Social Media Users
Fact Check : Unknown