ఫ్యాక్ట్ చెక్: తెలుగు యాంకర్ శివ జ్యోతి ఆధార్ కార్డును టీటీడీ యాజమాన్యం బ్లాక్ చేయలేదు
తెలుగు యాంకర్ శివ జ్యోతి ఆధార్ కార్డును టీటీడీ యాజమాన్యం బ్లాక్ చేసింది
తిరుమల శ్రీవారిని నిత్యం వేలల్లో భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. తిరుపతిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ప్రముఖులు చిత్రీకరించిన వీడియోల కారణంగా గతంలో పలు వివాదాలు చెలరేగాయి. తమిళనాడుకు చెందిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ వెంకటేశ్వర స్వామి దర్శన క్యూలో చిత్రీకరించిన ప్రాంక్ వీడియో విమర్శలకు కారణమైంది. తిరుమల మాడ వీధుల్లో దివ్వెల మాధురి చేసిన ఫోటోషూట్ పై విమర్శలు రాగా, నటి ప్రియాంక జైన్ తిరుమల మెట్లు ఎక్కేటప్పుడు జంతువుల శబ్దాలను అనుకరించే వీడియోతో వివాదానికి కారణమైంది. ఇక సోషల్ మీడియా యుగంలో పవిత్ర స్థలాల పవిత్రతను కాపాడటం గురించి ఎంతో మంది ఆందోళనను వ్యక్తం చేశారు. భక్తులు, అధికారులు కఠినమైన నిబంధనల కోసం పిలుపునిచ్చారు.
ఇక ఇటీవల టీవీ యాంకర్, తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 పోటీదారు అయిన శివ జ్యోతి తిరుమలలో అన్నప్రసాదం గురించి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన భర్త, స్నేహితులతో కలిసి ఆమె ఆలయాన్ని సందర్శించిన సమయంలో చిత్రీకరించిన వీడియో అగౌరవకరమైన కంటెంట్ అంటూ ఆందోళనలకు కారణమైంది. తిరుమల క్యూలైన్లో అన్న ప్రసాదం తీసుకుంటుండగా... యాంకర్ శివజ్యోతి... 'సోను కాస్ట్‌లీ ప్రసాదంపై అడుక్కుంటున్నాడు ఫ్రెండ్స్. రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం' అంటూ నవ్వుతూ కామెంట్స్ చేసింది. ఈ వీడియో వైరల్ కాగా శ్రీవారి భక్తులతో పాటు నెటిజన్లు సైతం ఆమె తీరును తప్పుబట్టారు. శ్రీవారి అన్న ప్రసాదాన్ని అపహాస్యం చేశారంటూ మండిపడ్డారు.
అయితే ఈ వివాదంపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించిందని, శివ జ్యోతి ఇకపై తిరుమలలో అడుగుపెట్టకూడదంటూ ఆమెపై టీటీడీ ఆంక్షలు విధించిందని కథనాలను మీడియా వర్గాలు ప్రసారం చేశాయి.
"యాంకర్ శివ జ్యోతి ఆధార్ కార్డు బ్లాక్ చేసిన టిటిడి,
భవిష్యత్తులో శ్రీవారి దర్శనం చేసుకోకుండా నిర్ణయం తీసుకున్న టిటిడి ...
ఇదే ఒరవడిని కంటిన్యూ చేస్తూ క్యూ లైన్ లో మొబైల్ తీసుకువెళ్ళేవాళ్ళని కొండమీద రీల్స్ చేసేవారిని వారిని కూడా దర్శననానికి అనుమతించకూడదు." అంటూ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక పలు మీడియా సంస్థలు కూడా కథనాలను ప్రచురించాయి.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా శివ జ్యోతి తిరుమలలో జరిగిన ఘటనపై క్షమాపణలు చెబుతూ వీడియోను పోస్టు చేశారు.
'నా వైపు నుంచి తప్పు జరిగింది. క్యూలైన్లో నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఉద్దేశ్యం అది కాదు. 10 వేల L1 క్యూలైన్లో మేము నిలబడ్డప్పుడు కాస్ట్‌లీ లైన్లో నిలబడ్డామనే ఉద్దేశంతే అలా మాట్లాడాను. తప్పు నా తరఫున, నా తమ్ముడు సోను తరఫున జరిగింది కాబట్టి అందరికీ క్షమాపణలు చెబుతున్నాం. వెంకటేశ్వర స్వామి నా జీవితాన్నే మార్చారు. ఈ రోజు నేను అనుభవించే ఏదీ ఆయన దయ లేకుండా రాదు. తెలిసో తెలియకో పొరపాటున ఆ కామెంట్స్ నా నోటి నుంచి వచ్చాయ్. అందుకు సారీ అడుగుతున్నా. ఇంకోసారి ఇలా జరగదు.' అంటూ శివ జ్యోతి క్షమాపణలు చెప్పారు.
ఇక మేము టీటీడీ అధికారిక వెబ్ సైట్, సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించాం. ఎక్కడా కూడా శివ జ్యోతి ఆధార్ కార్డును బ్లాక్ చేసినట్లుగా ప్రకటన రాలేదు.
సంబంధిత వివాదం గురించి టీటీడీ యాజమాన్యానికి ఫోన్ చేసి సంప్రదించాం. టీటీడీ అలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. టీటీడీ చరిత్రలో ఏ ఒక్క భక్తుడిని లేదా భక్తురాలిని ఏడుకొండల వెంకన్న స్వామి దర్శనానికి రావొద్దని టీటీడీ ఎప్పుడూ చెప్పలేదని, ఈ ప్రచారం కేవలం నిరాధారమైనదని సంబంధిత వర్గాలు తెలిపాయి
టీటీడీ శివ జ్యోతి ఆధార్ కార్డును బ్లాక్ చేసినట్లుగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పలు మీడియా సంస్థల కథనాలు కూడా మాకు లభించాయి. అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు. టీటీడీ శివ జ్యోతి ఆధార్ కార్డును బ్లాక్ చేసినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు.
Claim : వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. టీటీడీ నుండి అధికారికంగా ప్రకటన రాలేదు
Claimed By : Social Media Users, Media
Fact Check : Unknown