ఫ్యాక్ట్ చెక్: చంచల్‌గూడ జైలు ములాఖత్ నుంచి ఉగ్రకుట్ర అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్న పోలీసు శాఖ
చంచల్‌గూడ జైలు ములాఖత్ నుంచి ఉగ్రకుట్ర అంటూ జరుగుతున్న ప్రచారంలో
హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలు నుండి ఉగ్రకుట్ర జరిగిందంటూ పలు మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి. కొన్ని మెసేజీలు వాట్సాప్ లో కూడా వైరల్ అయ్యాయి.
"హైదరాబాద్‌లో భద్రతా వ్యవస్థను అప్రమత్తం చేసే విధంగా సంచలన సమాచారం వెలుగులోకి వచ్చింది. చంచల్‌గూడ కేంద్ర కారాగారం నుంచే ఉగ్రకుట్రకు రూపురేఖలు వేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూలకత్‌కు వచ్చిన వ్యక్తుల ద్వారా నగరంలో విధ్వంసానికి సంబంధించిన ప్రణాళికలు సాగినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. వరుస పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో బయటపడిన వివరాల ఆధారంగా మూసారాంబాగ్, సైదాబాద్, మలక్‌పేట్ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అనుమానితుల కదలికలపై సీసీ కెమెరాలు, సాంకేతిక నిఘా ద్వారా పోలీసులు నిశితంగా గమనిస్తున్నారు. ఈ కుట్ర వెనుక పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ Lashkar-e-Taiba కు చెందిన ఒక ఖైదీ పాత్ర ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. జైలులో ఉన్నప్పటికీ అతడు మూలకత్‌కు వచ్చిన వారితో ఉగ్రదాడులపై చర్చలు జరిపినట్లు సమాచారం. ముఖ్యంగా అతడిని కలిసేందుకు వచ్చిన భార్య ద్వారా కీలక సమాచారం బయటకు చేరిందని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. " అంటూ కొన్ని పోస్టులు పెట్టారు.
"దేశంలో ఉగ్రకుట్ర వ్యవహారంలో సంచలన విషయాలు వెలగులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోనూ విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తంచేశాయి.పేలుళ్లకు చంచల్ గూడ జైలు నుంచే టెర్రరిస్టు స్కెచ్చేసినట్లు గుర్తించాయి. ములాఖత్ లో భాగంగా తనను కలవడానికి వచ్చిన వారితో ఉగ్రదాడులపై సంభాషణలు చేసినట్లు సమాచారం. దీంతో నగరంలోని ముసారాంబాగ్, సైదాబాద్, మలక్పేట్ ప్రాంతాలపై పోలీసులు నిఘా పెట్టారు." అంటూ కథనాలు కూడా మీడియాలో వచ్చాయి.
కొన్ని మీడియా సంస్థలు కూడా కథనాలను ప్రచురించాయి.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని తెలంగాణ పోలీసు శాఖ తెలిపింది.
తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ సంబంధిత కథనాలపై తెలంగాణ పోలీసు శాఖను సంప్రదించింది. పోలీసు అధికారులు ఇవన్నీ కేవలం వదంతులే అని కొట్టేశారు.
చంచల్ గూడ జైలులో ఉగ్ర కుట్ర జరిగిందంటూ వస్తోన్న వార్తలపై జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాస్ స్పందించారు. ‘ అలాంటి కుట్రలు జైలులో ఏం జరగలేదు.. అవన్నీ వదంతులు మాత్రమే. నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ కాబట్టి వార్తలు ప్రసారం ముందు అధికారులను వెరిఫై చేసుకోవాలి' అని సూచించారు. పుకార్లు వ్యాప్తి చేయడం వల్ల జనాలు భయాందోళనకు లోనయ్యే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. చంచల్ గూడ జైలులో లష్కరే తోయిబాకు చెందిన జాయిద్ అనే ఉగ్రవాది మాత్రమే ఉన్నాడు. అతని భార్య తప్ప అతన్ని కలవడానికి ఎవరూ రాలేదని స్పష్టం చేశారు. సర్వే లైన్స్‌లో వారి ములాఖాత్ జరుగుతుందని, వారానికి రెండు ములాఖాత్‌లు అందరితో పాటు కాకుండా వాళ్ళకు వేరే సమయం ఉంటుందని డీఐజీ శ్రీనివాస్ వివరణ ఇచ్చారు.
ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన కథనాలను పలు మీడియా సంస్థలు ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఆయన ప్రెస్ మీట్ కు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడొచ్చు.
పోలీసుల అధికారిక ప్రకటనను ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.