ఫ్యాక్ట్ చెక్: ఏపీ రాజధాని అమరావతి నీటిలో మునిగిపోయిందంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు
ఏపీ రాజధాని అమరావతి భారీ వర్షాలకు నీటిలో
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. రానున్న రెండు రోజుల పాటు సముద్రంలో చేపల వేటకు వెళ్ల రాదని అధికారులు హెచ్చరించారు.
ఏపీ ప్రభుత్వం అమరావతి రైతులకు కౌలు డబ్బులు విడుదల చేసింది. అమరావతి రైతుల బ్యాంక్ ఖాతాల్లో మొత్తం రూ. 163.67 కోట్లు జమ చేసింది. అమరావతి రైతులకు కౌలు డబ్బులు విడుదల చేసినట్లు సీఆర్డీఏ వెల్లడించింది. మిగతా రైతులకు టెక్నికల్ కారణాలతో కౌలు డబ్బులు విడుదల కాలేదని, సంబంధిత బ్యాంకులకు వివరాలు అందజేయాలని కోరింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం అప్పట్లో రైతుల నుంచి భూములు సేకరించారు. భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లతో పాటుగా, రాజధాని పూర్తి అయ్యే వరకూ కౌలు చెల్లిస్తామని అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే అమరావతి నీటిలో మునిగిపోయిందంటూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
"అందమైన ఇటలీ, వెనీస్ లో బోట్ షికారు ఎలాగూ చెయ్యలేను... వెనిస్ ను తలపించే మన రాజధాని అమరావతి అయిన వెళ్ళి నా ముచ్చట తీర్చుకుంట... Satish Murala తమ్ముడు వస్తావా నాతో" అంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
https://www.facebook.com/reel/
https://www.instagram.com/
వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. ఇటీవలి కాలంలో అమరావతి ప్రాంతంలో భారీ వరద రాలేదని మేము గుర్తించాం. అంతేకాకుండా అమరావతి నీటిలో మునిగిపోయిందనే కథనాలు కూడా మాకు లభించలేదు.
వైరల్ పోస్టుల్లోని స్క్రీన్ షాట్ ను తీసుకుని గూగుల్ రివర్స్ సెర్చ్ చేశాం. మాకు బుడమేరు వరదకు సంబంధించిన విజువల్స్ లభించాయి.
2024 సెప్టెంబర్ లో బుడమేరు భారీగా పొంగి పొర్లింది. విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాలను వరదలు ముంచెత్తాయి. వరదలు విస్తృత విధ్వంసానికి కారణమయ్యాయి.పలు ప్రాంతాల్లో కట్టలు తెగిపోవడంతో అజిత్ సింగ్ నగర్, రాజరాజేశ్వరీపేట, పైపుల్ రోడ్, రాజీవ్ నగర్, కండ్రిక, జక్కంపూడి కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. అకస్మాత్తుగా వచ్చిన వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతకంతకు వరద పెరుగుతుండటంతో ఇళ్లను, వాహనాలను వదిలేసి కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వచ్చింది. అకస్మాత్తుగా ముంచెత్తిన వరదతో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గర్భిణీలను అంబులెన్సులలో ఆసుపత్రులకు తరలించారు. బుడమేరు వరద ఉద్ధృతికి సింగ్ నగర్ రైల్వే అండర్ పాస్ పూర్తిగా నీటమునిగింది. రాజరాజేశ్వరీపేట, జక్కంపూడి కాలనీలను పూర్తిగా వరద ముంచెత్తింది. దీంతో డాబాలపై నుంచే సాయం కోసం ప్రజలు ఎదురుచూశారు. బుడమేరుకు సంబంధించిన కథనాలు ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
2024 సెప్టెంబర్ లో బుడమేరు వరదలకు సంబంధించిన విజువల్స్ ను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఇక వైరల్ అవుతున్న పోస్టులపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది.
"గతంలో విజయవాడలోని బుడమేరుకు సంభవించిన వరదల చిత్రాలను, వీడియోలను చూపిస్తూ... ప్రస్తుతం రాజధాని అమరావతిలో వరదల పరిస్థితి అంటూ... కొందరు కుట్రపన్ని కావాలని చేస్తున్న ఇటువంటి ప్రచారాలను నమ్మకండి. ఇటువంటి ఫేక్ ప్రచారాలను చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి." అంటూ పోస్టు పెట్టారు.
ఎన్టీఆర్ జిల్లాలో కురిసే భారీ వర్షాలకు బుడమేరు పొంగుతుందని, జిల్లాలోని గంపలగూడెం, ఏ.కొండూరు, రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు ఈ నాలుగు మండలాల పరిధిలో అత్యంత భారీ వర్షాలు కురిస్తే బుడమేరు ఉప్పొంగుతుందని నిపుణులు చెబుతూ ఉంటారు. ఈ మండలాల పరిధిలో గతేడాది సెప్టెంబరులో ఒక్క రోజులో 30 సెంటీమీటర్ల మేర వర్షం కురవటం వల్ల బుడమేరు ఉగ్రరూపం దాల్చింది. బుడమేరు ప్రవాహం అనేది అనేక వాగులు, వంకలు, చెరువుల సమాహారం. కొండవాగులు, రిజర్వు ఫారెస్ట్ నుంచి వచ్చే వాగులు, ఇతర వాగులన్నీ కలిస్తే బుడమేరు మహోగ్రరూపం దాల్చుతుంది. తెలంగాణ ప్రాంతంలోని భారీ వర్షాలు, వాగుల ఉధృతిని చూసి విజయవాడ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలను నమ్మకూడదని సూచిస్తున్నారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.
Claim : ఏపీ రాజధాని అమరావతి భారీ వర్షాలకు నీటిలో మునిగిపోయింది
Claimed By : Social Media Users
Fact Check : Unknown