ఫ్యాక్ట్ చెకింగ్: విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రిలో నవంబర్ 28 నుండి చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు చేయడం లేదు
విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రిలో నవంబర్ 28 నుండి చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు
తెలుగు నటుడు మహేష్ బాబు ఎంతో మంది పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు తన ఫౌండేషన్ సాయంతో నిర్వహించారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA), 2010 కింద, విదేశీ దేశాల నుండి విరాళాలను స్వీకరించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలుగు నటుడు మహేష్ బాబు NGO, మహేష్ బాబు ఫౌండేషన్‌కు రిజిస్ట్రేషన్ మంజూరు చేసింది. మహేష్ బాబు ఫౌండేషన్ నిధులతో 2025 సంవత్సరం మార్చి నాటికి 4,500 మందికి పునర్జన్మ లభించింది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ప్రాణాలను రక్షించే గుండె శస్త్రచికిత్సలను అందించే ఈ కార్యక్రమానికి మహేష్ బాబు చురుకుగా మద్దతు ఇస్తున్నారు. మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా ఆంధ్రప్రదేశ్‌లో అదనపు ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు. వీటిలో తల్లి పాల బ్యాంకు, బాలికలకు ఉచిత గర్భాశయ క్యాన్సర్ టీకా కార్యక్రమం ఉన్నాయి.
మహేష్ బాబు ఫోటోతో ఉండి ఉచితంగా గుండె సంబంధిత ఆపరేషన్లు అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
విజయవాడ ఆంధ్రా ఆసుపత్రిలో 28-11-25 నుండి 05-12-25 తేది వరకు ఇంగ్లాండ్ నుండి వస్తున్న 8 మంది వైద్యులచే 18 సం. లోపు చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేయబడును అంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇంగ్లాండ్ నుండి వస్తున్న 8 మంది వైద్యులచే 18 సం.లోపు చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేస్తారని 9494606677, 9494254206 ఫోన్ నెంబర్లకు కాల్ చేయాలని పోస్టుల్లో తెలిపారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.
వైరల్ పోస్టుల్లోని మొబైల్ ఫోన్ నెంబర్లకు సంప్రదించగా విజయవాడ ఆంధ్రా ఆసుపత్రిలో 28-11-25 నుండి 05-12-25 తేది వరకు ఎలాంటి ఉచిత ఆపరేషన్లను నిర్వహించడం లేదని తెలిపారు.
అలాగే ఆంధ్రా ఆసుపత్రి యాజమాన్యాన్ని కూడా మేము సంప్రదించగా వైరల్ అవుతున్న వాదనలను ఖండించారు. గతంలో ఉచితంగా సర్జరీలు చేసినట్లు నివేదించారు.
సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేయగా హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్ అండగా నిలిచిందనే మీడియా నివేదికలు మాకు లభించాయి. విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రిలో జులై 28 నుంచి ఆగస్టు 2 వరకు ఈ కార్యక్రమం సాగిందని, హీలింగ్ లిటిల్ హార్ట్స్, యూకే ఛారిటీ సౌజన్యంతో ఈ ఆపరేషన్లు జరిపారని కథనాలు లభించాయి. మెరుగైన చికిత్స చేసి తమ పిల్లల ప్రాణాలను కాపాడటం పట్ల చిన్నారుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ లో పలు విషయాలను పిల్లల తల్లిదండ్రులు, ఆసుపత్రి వైద్యులు ప్రస్తావించారు.
అందుకు సంబంధించిన మీడియా కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు
హార్ట్ అండ్ బ్రెయిన్ ఆంధ్ర హాస్పిటల్స్‌లో 15 మంది పిల్లలకు పీడియాట్రిక్ కార్డియాలజిస్టుల బృందం గుండె శస్త్రచికిత్సలు నిర్వహించిందని కార్డియాక్ సర్జన్ డాక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. ఇది ఏప్రిల్ నెలలో చోటు చేసుకుంది.
సినీ నటుడు మహేష్ బాబుకు చెందిన స్వచ్ఛంద సంస్థ హీలింగ్ లిటిల్ హార్ట్స్ లాంటి పలు సంస్థల సహకారంతో ఆంధ్రా హాస్పిటల్స్ చాలా సంవత్సరాలుగా చిన్న పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు చేస్తోంది. అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
విజయవాడ ఆంధ్రా హాస్పిటల్ ద్వారా మహేశ్‌బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేల మంది చిన్నారులకు ఇప్పటికే వైద్య సాయం అందించారు. తెలంగాణలో ఉండేవారి కోసం ‘ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్’ పేరిట హైదరాబాద్‌లోనూ గుండె ఆపరేషన్లు చేయించడం మొదలుపెట్టారు. మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల కోసం ఏటా సుమారు 30 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని సమాచారం ఉంది. మహేష్ బాబు తన సంపాదనలో సుమారు 30% భాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నారని పలు మీడియా కథనాలు చెబుతున్నాయి.
వైరల్ పోస్టుల్లో మహేష్ బాబు ఉన్న ఫోటో 2022 సంవత్సరం మార్చి 5వ తేదీ నుండి ఆన్ లైన్ లో ఉంది.
పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో బాధపడుతున్న ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు మద్దతు ఇవ్వడానికి మహేష్‌బాబు ఫౌండేషన్ ఇప్పుడు రెయిన్‌బో హాస్పిటల్ ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్‌తో చేతులు కలిపిన కార్యక్రమానికి సంబంధించిన ఫోటోను వైరల్ పోస్టుల్లో వాడుతున్నారు.
విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రిలో నవంబర్ 28 నుండి చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు చేయనున్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదు.
వైరల్ అవుతున్న పోస్టులు నిజం కావు.