ఫ్యాక్ట్ చెక్: మణిపూర్ లో భారీగా ఆయుధాలు లభించాయంటూ వైరల్ అవుతున్న వీడియో మయన్మార్ కు చెందినది
మయన్మార్ కు చెందిన వీడియోను మణిపూర్ కు చెందినదిగా
Myanmar video viral as Manipur
మణిపూర్ లో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొంది. రాజ్ భవన్‌లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లాతో సమావేశం తర్వాత, మణిపూర్‌లో 44 మంది ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ శాసనసభ్యుడు తోక్‌చోమ్ రాధేశ్యామ్ సింగ్ తెలిపారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ సంసిద్ధతను గవర్నర్‌కు తెలియజేసినట్లు సింగ్ వివరించారు. "44 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని మేము గవర్నర్‌కు తెలియజేసాము. రాష్ట్రంలో కొనసాగుతున్న సమస్యలకు సాధ్యమైన పరిష్కారాలను కూడా చర్చించాము" అని ఆయన అన్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎటువంటి వ్యతిరేకత లేదని ఆయన అన్నారు.
మైతీలు- కుకి వర్గాల మధ్య హింస చెలరేగడంతో విమర్శలు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత ఫిబ్రవరి నుండి మణిపూర్ లో రాష్ట్రపతి పాలన ఉంది. మే 2023లో చెలరేగిన ఈ వివాదంలో 250 మందికి పైగా మరణించారు. అల్లర్లు, గొడవల కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రంలో శాంతి ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది, ఇటీవలి రోజుల్లో మణిపూర్‌లో కొత్తగా నిరసనలు చెలరేగుతున్నాయి. కేంద్రం ఇందులో ఎదురయ్యే అవాంతరాలు, సున్నితమైన సరిహద్దు సమస్యల పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్రపతి పాలన తర్వాత గత మూడు నెలలుగా, దోచుకున్న ఆయుధాలను అప్పగించాలని వివిధ గ్రూపులకు పిలుపు ఇచ్చింది కేంద్రం.
ఇంతలో మణిపూర్ లో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
"बिग ब्रेकिंग
मणिपुर में उग्रवादियों से भारतीय सेना ने हथियारों का एक बहुत बड़ा जखीरा और नकदी बरामद की है देखिए
सेक्युलर लिब्राडू गुलाम लाचार चमचे रात-दिन मणिपुर मणिपुर का राग अलापते है अब देखो वहा के विधर्मी क्या कर रहे हैअब बोलो इनपर कारवाई करना सही है या नही..
😡🔥" అంటూ పోస్టులు పెట్టారు.
"మణిపూర్‌లో ఉగ్రవాదుల నుంచి భారత సైన్యం భారీగా ఆయుధాలు, నగదును స్వాధీనం చేసుకుంది." అన్నది ఈ పోస్టుల సారాంశం.
వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో భారతదేశానికి సంబంధించింది కాదు.
వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసి, వాటిని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఏప్రిల్ 2025 నుండి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
బర్మీస్ క్యాప్షన్‌లతో ఎక్కువ నిడివి ఉన్న వీడియోలను చూపించే పలు పోస్ట్‌లు మాకు కనిపించాయి.
"စခန်း သိမ်းပြီ လက်နက်နဲ့ ငွေသားသိန်းပေါင်းသုံးထောင်ကျော်ရရှိ #myanmar #chinland #reels #revolution" అనే టైటిల్ తో 15 ఏప్రిల్ 2025న Nway Oo Lin అనే పేజీలో ఈ వీడియోను అప్లోడ్ చేశారు.
ఆయుధాలు, మూడు బిలియన్లకు పైగా బాట్ నగదును స్వాధీనం చేసుకున్నారని ఆ పోస్టులో ఉంది. అందులో మయన్మార్, చిన్లాండ్‌లకు సంబంధించిన హ్యాష్‌ట్యాగ్‌లు కూడా ఉన్నాయి.
వీడియోను నిశితంగా పరిశీలిస్తే వీడియోలో కనిపిస్తున్న కరెన్సీ భారతీయ కరెన్సీ కాదని కూడా తేలింది. సాయుధ వ్యక్తుల యూనిఫామ్‌లపై BNRA అని రాసి ఉంది. BNRA- బర్మా నేషనల్ రివల్యూషనరీ ఆర్మీ, మయన్మార్‌లోని ఒక తిరుగుబాటు సంస్థ.
మా తదుపరి పరిశోధనలో మయన్మార్‌లోని రెడ్ న్యూస్ ఏజెన్సీ ఫేస్‌బుక్ పేజీలో ఇదే వీడియోను పోస్టు చేసినట్లు గుర్తించాం.
ఏప్రిల్ 14న షేర్ చేసిన అదే వీడియోను మేము కనుగొన్నాము. ఫలాం యుద్ధంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు దాని శీర్షిక పేర్కొంది.
మేము సంబంధిత కీవర్డ్ శోధనను నిర్వహించాము. మయన్మార్‌లోని ఫలాం నగరంలో ఆయుధాల రికవరీల గురించి వార్తల నివేదికలను కనుగొన్నాము. ఏప్రిల్ 10, 2025న డెమోక్రటిక్ వాయిస్ ఆఫ్ బర్మా (DVB) ఇంగ్లీష్ ప్రచురించిన నివేదిక లభించింది. చిన్ రెసిస్టెన్స్ దళాలు అనేక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయని పలు మీడియా కథనాల్లో తేలింది.
వైరల్ అవుతున్న వీడియో భారత్ లోని మణిపూర్ కు చెందినది కాదని తేలింది.
కాబట్టి, పెద్ద ఎత్తున ఆయుధాలు, డబ్బు మణిపూర్ లో భారత సైన్యం స్వాధీనం చేసుకుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.
Claim : మయన్మార్ కు చెందిన వీడియోను మణిపూర్ కు చెందినదిగా
Claimed By : Social Media Users
Fact Check : Unknown