ఫ్యాక్ట్ చెక్: భారతదేశం నుండి మణిపూర్ స్వాతంత్రాన్ని ప్రకటించుకుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
భారతదేశం నుండి మణిపూర్ స్వాతంత్రాన్ని ప్రకటించుకుందంటూ
మణిపూర్ ముఖ్యమంత్రి వై.ఖేమ్‌చంద్ సింగ్ ఫిబ్రవరి 22, 2026న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని వివిధ వర్గాల మధ్య అల్లర్లను ఆపడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను చర్చించారని అధికారిక ప్రకటన తెలిపింది.
ఫిబ్రవరి 4న పదవీ బాధ్యతలు స్వీకరించిన సింగ్, న్యూఢిల్లీలోని షా నివాసంలో జరిగిన సమావేశంలో తన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పిఎఫ్)కి చెందిన లోసి దిఖో, బిజెపికి చెందిన నెమ్చా కిప్గెన్‌లతో కలిసి పాల్గొన్నారు. ఈశాన్య రాష్ట్రంలో శాంతి, సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం నుండి సాధ్యమైన అన్ని మద్దతులను అందిస్తామని షా హామీ ఇచ్చారు. ప్రజల పునరావాసంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.
అయితే మణిపూర్ అధికారికంగా భారతదేశం నుండి విముక్తిని ప్రకటించిందంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం తర్వాత భారత ఆక్రమణ నుండి విముక్తిని ప్రకటించిన మణిపూర్ నాయకులు అంటూ పోస్టులను వైరల్ చేస్తున్నారు. వైరల్ పోస్టులకు సంబంధించిన లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
https://www.facebook.com/
https://www.instagram.com/
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వేర్పాటువాదుల సమావేశానికి సంబంధించిన వీడియోను మణిపూర్ అధికారికంగా భారతదేశం నుండి విముక్తిని ప్రకటించిందంటూ ప్రచారం చేస్తున్నారు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా అలాంటి ప్రకటన ఏదీ రాలేదని స్పష్టం తెలుస్తోంది.
అంతేకాకుండా భారత సైన్యానికి చెందిన ప్రతినిధులు మణిపూర్ ముఖ్యమంత్రితో ఫిబ్రవరి 22, 2026న పలు విషయాలపై కూడా చర్చించారు.
మణిపూర్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై అసోం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ (డీజీ) లెఫ్టినెంట్ జనరల్ వికాస్ లఖేరా.. రాష్ట్ర ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫిబ్రవరి 22న న్యూఢిల్లీలోని మణిపూర్ భవన్‌లో జరిగిన ఈ భేటీలో, రాష్ట్రంలో భద్రతా బలగాల పనితీరు, ఆపరేషనల్ సన్నద్ధత, పౌర సహాయక చర్యల గురించి సీఎంకు ఆయన వివరించారు. మణిపూర్‌లో ఇటీవల జరిగిన అల్లర్ల నేపథ్యంలో.. శాంతి, సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడంలో అసోం రైఫిల్స్ చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి అభినందించారు. దేశంలోనే అత్యంత పురాతన పారామిలిటరీ దళమైన అసోం రైఫిల్స్.. ఇండో-మయన్మార్ సరిహద్దు భద్రతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోంది.
కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అక్టోబర్, 2019లో పలు మీడియా సంస్థల నివేదికలు మాకు లభించాయి. లండన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వేర్పాటువాద నాయకులు సొంతంగా ప్రభుత్వాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. ఆ విలేకరుల సమావేశంలో, తనను తాను "మణిపూర్ ముఖ్యమంత్రి"గా అభివర్ణించుకున్నారు యంబెన్ బిరెన్. "విదేశాంగ మరియు రక్షణ మంత్రి"గా నరేంగ్‌బామ్ సమర్జిత్ ప్రకటించుకున్నారు. అయితే ఈ ప్రకటనకు అధికారిక లేదా అంతర్జాతీయ గుర్తింపు లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
పలు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈ వీడియోను గతంలో పోస్టు చేశాయి. 2019 నుండి ఈ వీడియో ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది.
తాము మణిపూర్ మహారాజు లీషెంబా సనజవోబ తరపున మాట్లాడుతున్నామని, బ్రిటన్ తమకు అశ్రయం ఇచ్చిందని వేర్పాటువాదులు ప్రకటించారు. ఐక్యరాజ్యసమితితో సహా ఇతర దేశాలు తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. భారత్ 1949లో మణిపూర్‌ను బలవంతంగా ఆక్రమించుకుందని ఆరోపించారు. అయితే, ఈ ప్రకటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని మణిపూర్ మహారాజు లీషెంబా సనజవోబ స్పష్టం చేశారు. తనతో మోసపూరితంగా కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని ఆయన తెలిపారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వేర్పాటువాదుల సమావేశానికి సంబంధించిన వీడియోను మణిపూర్ భారత్ నుండి స్వాతంత్రాన్ని ప్రకటించుకుందంటూ ప్రచారం చేస్తున్నారు.
Claim : వేర్పాటువాద నేతల ప్రకటనలను ఇలా వైరల్ చేస్తున్నారు
Claimed By : Social Media Users
Fact Check : Unknown