ఫ్యాక్ట్ చెక్: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టినరోజు నాడు బుర్జ్ ఖలీఫాపై ఆయన చిత్రాన్ని డిస్ప్లే చేయలేదు
పాత వీడియో. 2021 అక్టోబర్ నెలలో చిత్రీకరించిన వీడియో
ఏపీ విభజన తర్వాత 2014లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికయ్యారు. తర్వాత కూడా రెండో సారి సీఎంగా ఎన్నికయ్యారు. బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ పుట్టినరోజు ఫిబ్రవరి 17న ఘనంగా జరిగింది. రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎర్రవల్లి ఫాంహౌస్‌కు పోటెత్తారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో అభిమానులు భారీ కేక్‌ను కట్ చేసి తమ నాయకుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
కేసీఆర్ 72వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో అట్టహాసంగా జరిగాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు ముఖ్య నేతలు హాజరై 72 కేజీల భారీ కేక్‌ను కట్ చేశారు.
దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాపై కేసీఆర్ పుట్టినరోజున ఆయన ఫోటోను ప్రదర్శించారని పేర్కొంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆయన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఇలా జరిగింది అంటూ వైరల్ పోస్ట్ లో ఉంది.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. కేసీఆర్ 72వ జన్మదినం సందర్భంగా అలాంటిది ఏదీ బుర్జ్ ఖలీఫా మీద డిస్ప్లే చేయలేదు.
కేసీఆర్ 72వ పుట్టినరోజు సందర్భంగా బుర్జ్ ఖలీఫాలో అలాంటి ప్రదర్శన ఏదైనా చేశారా అని తనిఖీ చేయడానికి మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. ఇటీవల అలాంటిది జరిగిందని సూచించే విశ్వసనీయ నివేదికలు, అధికారిక ప్రకటనలు లేదా మీడియా కవరేజ్ మాకు లభించలేదు.
బుర్జ్ ఖలీఫా మీద డిస్ప్లే చేసే ఈవెంట్లను ఎప్పటికప్పుడు నివేదించే అధికారిక సోషల్ మీడియా ఖాతాను కూడా మేము వెరిఫై చేశాం. అందులో కూడా ఎలాంటి సాక్షాలు లభించలేదు.
https://www.instagram.com/
ఇక వైరల్ వీడియోలోని స్క్రీన్ షాట్ ను తీసుకుని మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాం.
అక్టోబర్ 2021లో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, యూట్యూబ్ ఛానెల్‌లలో అప్‌లోడ్ చేయబడిన అదే విజువల్స్ మాకు కనిపించాయి బతుకమ్మకు సంబంధించి ప్రదర్శన సందర్భంగా కేసీఆర్ ఫోటోను కూడా డిస్ప్లే చేశారు. పలు మీడియా సంస్థలు కూడా ఈ కథనాన్ని అప్పట్లో నివేదించాయి.
23 అక్టోబర్ 2021న, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టారు. కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి చొరవలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చిత్రాలతో పాటు “జై హింద్,” “జై తెలంగాణ,” “జై కేసీఆర్” వంటి నినాదాలు ప్రదర్శనలో ఉంచారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించారు.
https://indianexpress.com/
https://www.news18.com/news/
దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ కనువిందు చేసింది. బుర్జ్ ఖలీఫాపై మెరిసిన బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది వీక్షించారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో రూపొందించిన పాటతో పాటు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ బుర్జ్ ఖలీఫాపై కనిపించింది. మహిళలతో కలిసి కవిత బుర్జ్ ఖలీఫా వద్ద బతుకమ్మ ఆడారు. బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం ఒక్క తెలంగాణకే కాదని, మొత్తం దేశానికే గర్వకారణమని కవిత అన్నారు. బతుకమ్మ ప్రదర్శనకు సహకరించిన యూఏఈ ప్రభుత్వానికి, బుర్జ్ ఖలీఫా నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
పాత వీడియోను ఇటీవల కె. చంద్రశేఖర్ రావు 72వ పుట్టినరోజు కోసం ఏర్పాటు చేసిన ప్రదర్శన అంటూ ప్రచారం చేస్తున్నారు.
Claim : పాత వీడియో. 2021 అక్టోబర్ నెలలో చిత్రీకరించిన వీడియో
Claimed By : Social Media Users
Fact Check : Unknown