ఫ్యాక్ట్ చెక్: దొంగతనానికి వెళ్లి దొరికిపోయాడంటూ మహా సేన రాజేష్ ఫోటోను డిజిటల్ గా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు

యూట్యూబర్, మహాసేన రాజేష్ దొంగతనానికి వెళ్లి

Update: 2025-01-24 06:38 GMT

మహాసేన రాజేష్ యూట్యూబర్ గా తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీని సంపాదించుకున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ-జన సేన కూటమి 2024, ఫిబ్రవరి 24న అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసినప్పుడు, అందులో టీడీపీ అభ్యర్థిగా యూట్యూబర్ రాజేష్ సరిపల్లె పేరు కూడా కనిపించింది. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం (ఎస్‌సి రిజర్వ్‌డ్) నియోజకవర్గం నుండి పోటీ చేయాలని రాజేష్ భావించారు. టీడీపీ నుండి టిక్కెట్ కూడా దక్కించుకున్నారు.


ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల కారణంగా మహాసేన రాజేష్ ఎన్నికల్లో పోటీకి దూరమయ్యాడు. కూటమిలో మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS), వివిధ బ్రాహ్మణ కుల సంఘాల నుండి రాజేష్ సరిపల్లెకు టికెట్ ఇవ్వడంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రాజేష్ దళితుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా మహాసేన మీడియా అనే యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నాడు. లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న ఆ ఛానెల్‌లో ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై కూడిన వీడియోలను పోస్ట్ చేస్తుంటారు.

అయితే రాజేష్ మహాసేన ఫోటో ఉన్న పేపర్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

"దొంగతనానికెళ్లి.. చేపలపులుసు తిని నిద్రపోయాడు" అనే టైటిల్ తో కథనం ఉంది. అందులో రాజేష్ మహాసేన ఎరుపు రంగు షర్ట్ వేసుకుని నిలబడుకుని ఉన్న ఫోటో అందులో ఉంది. "జూన్ 15 (ఆంధ్ర జ్యోతి): అర్థరాత్రి ఓ ఇంట్లోకి చొరబడిన దొంగకు నగలు, నగదు లభించలేదు. నిరా శగా తిరిగి వెళుతున్న ఆ దొంగకు వంటగదిలో నుంచి చేపల పులుసు వాసన గుప్పున తగిలింది. అసలే ఆకలితో నకనకలాడిపోతున్న ఆ దొంగ వంటగదిలోకి దూరి చేపలు పులుసు వేసుకుని పుల్లుగా తిన్నాడు. భుక్తాయాసం ఎక్కువై.. డాబాపైకెళ్లి కాసేపు పడుకుని తెల్లవారుజామునే పారిపోదామనుకున్నాడు. కానీ.. తెల్లవారినా లేవలేకపోయాడు. డాబాపై నిద్రపోతున్న దొంగను గమనించిన స్థానికులు పట్టుకుని పోలీసు లకు అప్పగించారు. కన్నియాకుమారి జిల్లా పరైకోడు గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. అయితే ఈ దొంగను ఆంధ్రప్రదేశ్ కు చెందిన సరిపెళ్ళ రాజేష్ గా గుర్తించారు" అని ఆ క్లిప్పింగ్ లో ఉంది.

Full View




వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 


ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. వేరే వార్తా కథనానికి మహాసేన రాజేష్ ఫోటోను ఉంచి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

వైరల్ అవుతున్న కథనాన్ని తీసుకుని మేము కీవర్డ్ సెర్చ్ చేశాం. ఇది ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ కథనం అవ్వడంతో మేము సదరు సంస్థ వెబ్సైట్ లో కథనాన్ని గుర్తించాం.

"దొంగతనానికెళ్లి... చేపల పులుసు తిని... తన్నులు తిని" అనే టైటిల్ తో 2020 సంవత్సరం జూన్ 16న కథనాన్ని ప్రచురించారు. 

"తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుందని అందులో తెలిపారు. సతీష్ అనే యువకుడు దొంగతనం చేసేందుకు ఓ ఇంట్లోకి దూరాడు. అయితే... నగలు, నగదు వంటి విలువైన వస్తువులేవీ లభించకపోవడంతో నిరాశ చెందాడు. ఇక తిరిగి వెళ్లిపోదామనుకునేసరికి... వంటగదిలోని చేపల కూర తిని నిద్రపోయాడు. ఇంట్లో చిందరవందరగా ఉన్న వస్తువులు చూసి దొంగతనం జరిగినట్లు తెలుసుకున్నారని ఆ తర్వాత మేడ మీద.. నిద్రపోతున్న దొంగను చూసి షాకయ్యారు.. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు." ఈ కథనం ద్వారా చేపల పులుసు తిని నిద్రపోయిన వ్యక్తి పేరు రాజేష్ కాదని సతీష్ అని స్పష్టంగా తెలుస్తోంది.


కీ వర్డ్ సెర్చ్ చేయగా అప్పట్లో పలు మీడియా సంస్థలు ఈ కథనాన్ని ప్రచురించాయి. కొన్ని మీడియా సంస్థలు దొంగ సతీష్ కు సంబంధించిన ఫోటోలను పోస్టు చేశాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. 

దొంగకు సంబంధించిన ఫోటోను మీరు ఇక్కడ చూడొచ్చు



 

ఇక వైరల్ ఫోటోను గమనించగా.. వార్తా కథనంలో కింద ఉన్న 'రాజేష్' టెక్స్ట్ ఫాంట్ కు పైన ఉన్న కథనంలోని టెక్స్ట్ ఫాంట్ కు తేడా ఉందని కూడా మేము గుర్తించాం.



 

ఇక మహాసేన రాజేష్ దొంగతనం చేశారంటూ వైరల్ అవుతున్న వాదనల్లో నిజం లేదంటూ గతంలో కూడా నిజ నిర్ధారణ చేశారు. అందుకు సంబంధించిన లింక్ లను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

కాబట్టి, యూట్యూబర్, మహాసేన రాజేష్ దొంగతనానికి వెళ్లి చేపల పులుసు తిని నిద్రపోయాడనే వాదనలో ఎలాంటి నిజం లేదు.


Claim :  యూట్యూబర్, మహాసేన రాజేష్ దొంగతనానికి వెళ్లి చేపల పులుసు తిని నిద్రపోయాడు
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News