ఫ్యాక్ట్ చెక్: 'ప్రధాన మంత్రి AC యోజన 2025' కింద కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఏసీలను అందించడం లేదు

పాత ఏసీలను తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా కొత్త ఏసీలను

Update: 2025-04-23 09:43 GMT

విపరీతమైన ఎండలు, వాతావరణ మార్పుల కారణంగా ఇళ్లల్లో చాలా మంది ఏసీలను ఉంచడానికి మొగ్గు చూపుతున్నారు. భారతదేశంలో వేసవికాలం ప్రతి ఏడాది మరింత వేడిగా మారుతున్నందున, దేశవ్యాప్తంగా ఏసీలకు డిమాండ్ పెరుగుతోంది. పెరుగుతున్న ఆదాయాలు, పట్టణీకరణతో, ఎయిర్ కండిషనర్ అమ్మకాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వీటి కారణంగా విద్యుత్ వినియోగం కూడా పెరిగిపోతూ ఉంది. 2021–22, 2023–24 మధ్య, వార్షిక AC అమ్మకాలు 8.4 మిలియన్ యూనిట్ల నుండి దాదాపు 11 మిలియన్లకు పెరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ మంది ఏసీలను వాడడం వలన విద్యుత్ గ్రిడ్‌పై ఎక్కువ ఒత్తిడి కలుగుతోంది.


ఇలాంటి పరిస్థితులపై పోరాటం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం 'పీఎం మోడీ ఏసీ యోజన' పథకాన్ని తీసుకుని వచ్చిందంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా ఏసీలను ఉపయోగిస్తున్న వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు అందించే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ పోస్టుల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. విద్యుత్తును ఎక్కువగా ఉపయోగించే పాత ACలను కొత్త, ఐదు నక్షత్రాల రేటెడ్ మోడళ్లతో భర్తీ చేయబోతున్నట్లు ఈ పోస్టుల్లో తెలిపారు. గృహాలకు విద్యుత్ బిల్లులను తగ్గించడం, పీక్ నెలల్లో పవర్ గ్రిడ్‌పై ఒత్తిడిని తగ్గించడం ఈ పథకం లక్ష్యం అంటూ చెప్పారు.

"పీఎం మోడీ ఏసీ యోజన 2025" కింద 1.5 కోట్ల 5-స్టార్ ఎయిర్ కండీషనర్లను ఉచితంగా పంపిణీ చేస్తారని అందులో తెలిపారు. వీలైనంత త్వరగా ఒక ఫారమ్ నింపమని కూడా కోరుతున్నారు. మీరు ఫారమ్ నింపిన 30 రోజుల్లో మీ ఇంట్లో ఏసీని ఉచితంగా పంపుతారని కూడా అందులో ఉంది.







వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు



 

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకాన్ని తీసుకుని వస్తున్నట్లుగా ఎలాంటి ప్రకటన కూడా రాలేదు.

ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర ప్రభుత్వం అధికారిక ఖాతాలను కూడా మేము పరిశీలించాం. ఎక్కడా కూడా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కనిపించలేదు. అనేక అధికారిక ఖాతాలు, వెబ్ సైట్లు తనిఖీ చేసిన తర్వాత, PM AC యోజన 2025 అని పిలవబడే దానికి సంబంధించిన నోటిఫికేషన్ లేదా అధికారిక ప్రకటన మాకు దొరకలేదు.

మా పరిశోధనలో ఎక్స్ లో అధికారిక PIB (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) హ్యాండిల్ నుండి వైరల్ వాదనను స్పష్టంగా తోసిపుచ్చిన పోస్ట్‌ను మేము చూశాము.

'ప్రధాన మంత్రి AC యోజన 2025' అనే కొత్త పథకం కింద, ప్రభుత్వం ఉచితంగా 5-స్టార్ ఎయిర్ కండిషనర్లను అందిస్తుందని, 1.5 కోట్ల ACలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతున్న పోస్ట్ లను నమ్మకండని కోరింది.




ఇక ఇందుకు సంబంధించిన కథనాల కోసం వెతకగా పలు మీడియా సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఉచిత ఎయిర్ కండీషనర్లను ఇవ్వడం లేదని నివేదించాయి.

వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.


'పీఎం మోడీ ఏసీ యోజన 2025' పథకం కింద ఉచిత 5-స్టార్ ఏసీలను మారుస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. సోషల్ మీడియాలో ఇటువంటి తప్పుదారి పట్టించే పోస్ట్‌లకు నమ్మకండి, జాగ్రత్తగా ఉండాలి.

ఇలాంటి నకిలీ పోస్ట్‌లు తరచుగా ప్రజలను తప్పుదారి పట్టించడానికి సృష్టిస్తారు. ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను సేకరించడానికి లేదా ధృవీకరించని పేజీలకు ట్రాఫిక్‌ను మళ్లించడానికి వీటిని ఉపయోగించవచ్చు. తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని లేదా వాస్తవాలను తనిఖీ చేయకుండా అలాంటి సందేశాలను ఫార్వర్డ్ చేయవద్దు.

ధృవీకరించని వెబ్‌సైట్‌లలో మీ వ్యక్తిగత వివరాలను అసలు నమోదు చేయవద్దు. అధికారిక ప్రభుత్వ వెబ్ సైట్లు, సోషల్ మీడియా ఖాతాలలో ఎల్లప్పుడూ అలాంటి క్లెయిమ్‌లను తనిఖీ చేయండి. సోషల్ మీడియాలో అనుమానాస్పద కంటెంట్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.


కాబట్టి, 'ప్రధాన మంత్రి AC యోజన 2025' అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.


Claim :  పాత ఏసీలను తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా కొత్త ఏసీలను
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News