ఫ్యాక్ట్ చెక్: ఇంట్లో పూజ చేసుకుంటున్న వ్యక్తి మీద హైదరాబాద్ లో దాడి చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు

ఈ ఘటన ధర్మవరంలో చోటు చేసుకుంది. ఎలాంటి మతపరమైన కోణం లేదు

Update: 2025-07-30 04:22 GMT

హైదరాబాద్ నగరం ఎన్నో మతాల ప్రజలకు, ఎన్నో వర్గాల ప్రజలకు నెలవు. అలాంటి నగరంలో అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నాలు ఎన్నో ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. గతంలో కూడా అలాంటి అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఎంతో మంది ఈ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా హిందూ-ముస్లింల మధ్య గొడవలు సృష్టించడానికి అటు సోషల్ మీడియాలో కూడా కొన్ని ఖాతాల ద్వారా ప్రయత్నం జరుగుతూ ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.


ఇంతలో ఓ పూజారి ఇంట్లో పూజ చేసుకుంటూ ఉండగా ఆయన మీద దాడి చేశారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
"*తన ఇంట్లో పూజ చేసుకుంటున్న పూజారి ఇంట్లోకి వచ్చి మరీ జిహాదీల దాడి...*
*దీపారాధన గంటల శబ్దం తమకు వినపడకూడదు అని దాడి చేసిన వైనం..ఇది జరిగింది హైదరాబాద్లో..* " అంటూ పోస్టులు పెట్టారు.

Full View



మరికొందరు ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలంటూ పోస్టులు పెట్టారు.
"Dear CM sir. Requesting you to kindly investigate the matter and arrest the culprits.
*తన ఇంట్లో పూజ చేసుకుంటున్న పూజారి ఇంట్లోకి వచ్చి మరీ జిహాదీల దాడి...*
*దీపారాధన గంటల శబ్దం తమకు వినపడకూడదు అని దాడి చేసిన వైనం..ఇది జరిగింది హైదరాబాద్లో..* " అంటూ పోస్టు పెట్టారు. అలాగే తెలంగాణ పోలీసులను, తెలంగాణ సీఎంను కూడా ట్యాగ్ చేశారు.



వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

వైరల్ వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. మాకు పలు మీడియా కథనాలు లభించాయి. వైరల్ వీడియోలో ఉన్నది ధర్మవరంలో చోటు చేసుకున్న ఘటన.

వైరల్ వీడియోలోని స్క్రీన్ షాట్ ను ఈనాడు మీడియా సంస్థ ప్రచురించింది.

ధర్మవరంలో పట్టుచీరల వ్యాపారి రమణ కుటుంబ సభ్యులపై వడ్డీ వ్యాపారి అనుచరులు దాడి చేశారని ఈ కథనాలు చెబుతున్నాయి. రమణ వ్యాపారం నిమిత్తం వడ్డీ వ్యాపారి ఎర్రగుంట రాజా వద్ద రూ.6 లక్షలు వారానికి రూ.10 వడ్డీ చొప్పున అప్పు తీసుకున్నాడు. మూడు నెలలుగా వడ్డీ కట్టడం లేదని రాజా తన అనుచరులను ఈనెల 23న రమణ ఇంటికి పంపాడు. వారు ఇంట్లోకి ప్రవేశించి రమణతోపాటు అతడి భార్య భారతిపై దాడి చేశారు. తల్లిదండ్రులను కొడుతుండటంతో 12 ఏళ్ల కుమారుడు చరణ్‌సాయి అడ్డు వెళ్లగా బాలుడిపైన దాడి చేసి కొట్టారు. రూ.6 లక్షలు అప్పు తీసుకోగా రూ.15 లక్షలు వడ్డీ కట్టామని ఇంకా అసలు, వడ్డీ కట్టాలని ఇంట్లోకి చొరబడి తమపై దాడి చేసి భర్త జేబులో ఉన్న రూ.7 వేలు లాక్కెళ్లారని భారతి ధర్మవరం రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇదే ఘటనను పలు మీడియా సంస్థలు నివేదించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.


ఇక ఈ ఘటనపై ఏపీ పోలీసులు కూడా సీరియస్ అయ్యారు.

ధర్మవరం పట్టణంలో వడ్డీ వ్యాపారస్తులు అప్పు తీసుకున్న కుటుంబం పై దాడి చేసిన వీడియో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో జిల్లా ఎస్పీ రత్న ఐపిఎస్ సీరియస్ గా తీసుకున్నారు. సోమవారం పుట్టపర్తి లో ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ మాట్లాడుతూ దాడికి పాల్పడిన వడ్డీ వ్యాపారస్తులపై ధర్మవరం టూ టౌన్ స్టేషన్లో కేసు నమోదు చేశామని వీరందరిపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ చూడొచ్చు.

కాబట్టి, వైరల్ అవుతున్న ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకున్నది కాదు.


Claim :  ఎలాంటి మతపరమైన కోణం లేదు
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News