ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోలో ఉన్నది నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఆయన భార్య కాదు
ఈ వీడియోలో ఉన్నది వినయ్ నర్వాల్, ఆయన భార్య కాదు
జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా కసూరిని ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు, ప్రాణాలతో బయటపడిన వారి సాక్ష్యాల ప్రకారం, సైనికులు ఉపయోగించే ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలను తీవ్రవాదులు ఉపయోగించారు. ఉగ్రవాదులు బాడీ కెమెరాలు ధరించి హత్యలను రికార్డ్ చేశారు. హెల్మెట్-మౌంటెడ్ కెమెరాలను ధరించారని కూడా దర్యాప్తులో తేలింది.
చనిపోయిన వారిలో హనీమూన్ కోసం వెళ్లిన జంటలు కూడా ఉన్నాయి. నేవీ అధికారి, లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మరణించిన వార్త తెలిసి దేశం మొత్తం నిర్ఘాంతపోయింది. కర్నాల్ కు చెందిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, గుర్గావ్ కు చెందిన అమ్మాయి హిమాన్షి ఏప్రిల్ 16న ముస్సోరీలో వివాహం చేసుకున్నారు. ఆరు రోజుల తర్వాత పహల్గామ్ లోని పైన్ చెట్లతో కప్పబడిన పచ్చని గడ్డి మైదానంలో తన భర్త మృతదేహం పక్కన హిమాన్షి ఏడుస్తూ కనిపించింది. నర్వాల్, హిమాన్షి ముందు అక్కడకు వెళ్లాలని అనుకోలేదు. వారిద్దరు స్విస్ ఆల్ప్స్‌లో యూరోపియన్ హనీమూన్ ప్లాన్ చేశారు. కానీ వీసాలు సమయానికి రాకపోవడంతో కశ్మీర్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు."నేను నా భర్తతో కలిసి భేల్ పూరీ తింటుండగా, అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చాడు. నా భర్తను కాల్చాడు" అని హిమాన్షి షాక్ లో చెబుతున్న వీడియో వైరల్ అయింది. మే 1న తన 27వ పుట్టినరోజును నర్వాల్ జరుపుకోవాల్సి ఉంది. అందుకోసం ఒక కార్యక్రమాన్ని కూడా కుటుంబ సభ్యులు, బంధువులు ప్లాన్ చేశారు. ఆ తర్వాత, హిమాన్షితో కలిసి కొచ్చికి ప్రయాణించాల్సి ఉంది. ఇంతలోనే ఊహించని దారుణం చోటు చేసుకుంది.
ఓ జంట పచ్చని మైదానంలో హిందీ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి షారుఖ్ ఖాన్ లాగా ఫోజులు ఇవ్వడం కూడా మనం చూడొచ్చు.
ఆ వ్యక్తి వినయ్ నర్వాల్ అంటూ ప్రచారం చేస్తున్నారు. "నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మరణానికి ముందు చివరి వీడియో" అంటూ పలు మీడియా సంస్థలు, సోషల్ మీడియా అకౌంట్లు ఆ వీడియోను షేర్ చేశాయి.
"#Pahalgam ఉగ్రదాడిలో చనిపోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ కు APR 16న అతనికి వివాహం కాగా, హనీమూన్ కోసం పహల్గామ్ వెళ్లారు. కొత్త జంట అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఓ పాటకు డాన్స్ చేస్తూ సరదాగా గడిపిన వీడియో వైరల్ అవుతుంది." అంటూ పోస్టు పెట్టారు.
పలు సోషల్ మీడియా ఖాతాలలో ఇదే వాదనతో పోస్టులు వైరల్ అయ్యాయి
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు:
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది వినయ్ నర్వాల్, ఆయన భార్య కాదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేయగా.. జర్నలిస్ట్ సచిన్ గుప్తా ఓ జంటకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. వీడియోలోని మహిళ మాట్లాడుతూ "మేము బతికే ఉన్నాము. వీడియోలో ఉన్న వ్యక్తి వినయ్ నర్వాల్ అని, నేను ఆయన భార్య హిమాన్షి అని మీడియా సంస్థలు మా వీడియోలను ఎందుకు వ్యాప్తి చేస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. వారికి ఈ వీడియో ఎక్కడి నుండి వచ్చిందో, భారతదేశంలో ప్రెస్ ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు." అని చెప్పుకొచ్చింది.
ఈ ఉదయం నుండి మేము చాలా భయపడుతూ ఉన్నామని, మాకు ఎన్నో కాల్స్ వస్తున్నాయని తెలిపింది. మా మృతికి సంతాపం చెబుతున్నారు, మేము బతికే ఉన్నామనే విషయం తెలుసుకోండి. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికీ చెప్పండని వీడియోలోని మహిళ తెలిపారు.
వైరల్ వీడియోలో ఉన్న జంటకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ కూడా మాకు లభించింది. ఆ జంట పలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వైరల్ వీడియోలోని జంటకు సంబంధించిన ఫోటోలు ఇక్కడ చూడొచ్చు
వైరల్ అయిన క్లిప్ లేదా ఆ వీడియోలో ఉన్నది తామేనంటూ ఓ జంట పోస్టు చేసిన వీడియోను మేము స్వతంత్రంగా ధృవీకరించలేదు. వైరల్ వీడియోలో షారుఖ్ ఖాన్ ఐకానిక్ పోజును క్రియేట్ చేసిన వ్యక్తి వినయ్ నర్వాల్ లాగా లేరు.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది వినయ్ నర్వాల్, ఆయన భార్య కాదని, తామేనంటూ ఓ జంట చెబుతోంది.
Claim : ఈ వీడియోలో ఉన్నది వినయ్ నర్వాల్, ఆయన భార్య కాదు
Claimed By : Social Media Users, Media Channels
Fact Check : Unknown