ఫ్యాక్ట్ చెక్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాలు విరగ్గొట్టిన భార్య అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాలు విరగ్గొట్టిన భార్య
తెలంగాణలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సత్తా చాటారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 108 గ్రామపంచాయతీలుండగా మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుందని పలు నివేదికలు తెలిపాయి. బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. బీఆర్ఎస్ 39, కాంగ్రెస్ 29, బీజేపీ 25, స్వతంత్ర 15 స్థానాలను సాధించాయి.
అయితే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాలును ఆయన భార్య విరగ్గొట్టిందంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"» ఓ యూట్యూబ్ యాంకర్ ఉన్న అక్రమ సంబంధం పాడి కౌశిక్ రెడ్డి ప్రాణాల మీదకు వచ్చింది
>> యాంకర్తో ఉన్న అక్రమ సంబంధాన్ని మానుకోవాలని కొన్ని నెలల నుండి హెచ్చరిస్తున్న భార్య షాలిని
» వారంలో నాలుగు రోజులు యాంకర్ ఇంట్లో గడుపుతూ ఉండడంతో తారస్థాయికి చేరిన గొడవలు
» సోమవారం రాత్రి ఇంట్లో జరిగిన గొడవలో పాడి కౌశిక్ రెడ్డి కాళ్ళపై రోకలి బండ ఎత్తేసిన భార్య షాలిని
» తీవ్ర గాయలపాలైన కౌశిక్ రెడ్డిని హుటాహుటిన యశోద ఆసుపత్రిలో చేర్చిన సెక్యూరిటీ సిబ్బంది
» కుడికాలు విరగడంతో ఐదు గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్స చేసిన యశోద వైద్య బృందం
» వారం రోజుల వరకు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని కౌశిక్ రెడ్డి కుటుంబసభ్యులకు సూచించిన డాక్టర్లు
>> ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఫోన్లో పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్
» పార్టీ నాయకత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని కౌశిక్ రెడ్డికి భరోసానిచ్చిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
» ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి జరిగినట్టు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపిన పోలీసులు" అంటూ ఓ పేపర్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇక్కడ ఉంది
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
వైరల్ పోస్టుల్లో ఉన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తెలంగాణ స్క్రైబ్ కు చెందినదిగా ఉంది. తెలంగాణ స్క్రైబ్ అంటూ న్యూస్ పేపర్ అందుబాటులో లేదు. కొందరు పనిగట్టుకుని తెలంగాణ స్క్రైబ్ ఈ పేపర్ ను వాడుకుంటూ తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నట్లుగా గతంలో తేలింది. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి.
ఇక సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా పాడి కౌశిక్ రెడ్డిపై ఆయన భార్య దాడి చేసినట్లుగా ఎలాంటి మీడియా కథనాలు మాకు లభించలేదు.
వైరల్ పోస్టుల్లో పాడి కౌశిక్ వీల్ చైర్ మీద కూర్చుని ఉన్నారు. ఆ ఫోటోను మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా పాడి కౌశిక్ సోషల్ మీడియా ఖాతాలో ఆ విజువల్స్ మాకు లభించాయి.
"అందరికీ నమస్కారం.
ఇటీవల నాకు **లెగ్ లిగమెంట్ టియర్** కావడంతో వైద్యుల సూచనల మేరకు వారం రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
ఈ కారణంగా ముందుగా నిర్ణయించిన పలు కార్యక్రమాలను తాత్కాలికంగా రద్దు చేయాల్సి వచ్చింది. అలాగే ఈ వారం రోజుల వ్యవధిలో ఎవరినీ ప్రత్యక్షంగా కలిసే అవకాశం ఉండదని తెలియజేస్తున్నాను.
కావున ఈ విషయాన్ని అభిమానులు, కార్యకర్తలు, నాయకులు మరియు పార్టీ శ్రేణులు గమనించి సహకరించాలని మనవి చేస్తున్నాను.
-పాడి కౌశిక్ రెడ్డి శాసనసభ్యులు" అంటూ డిసెంబర్ 23న పోస్టు పెట్టారు.
లెగ్ లిగమెంట్ టియర్ కావడంతో వైద్యుల సూచనల మేరకు వారం రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఈ కారణంగా ముందుగా నిర్ణయించిన పలు కార్యక్రమాలను తాత్కాలికంగా రద్దు చేసుకున్నారు, వారం రోజుల వ్యవధిలో ఎవరినీ ప్రత్యక్షంగా కలిసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.
అందుకు సంబంధించిన మీడియా కథనాలను ఇక్కడ చూడొచ్చు
ఇక వైరల్ అవుతున్న పోస్టులను స్వయంగా పాడి కౌశిక్, ఆయన భార్య ఖండించారు. తమ సోషల్ మీడియాలో అందుకు సంబంధించి ఓ వీడియోను కూడా విడుదల చేశారు.
"రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాననే కారణంతో
నా మీద తప్పుడు వార్తలు రాయిస్తూ, రాక్షస ఆనందం పొందుతున్నారు.
ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత వేధింపులు చేసినా
ప్రజల తరఫున నిన్ను, నీ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటా రేవంత్ రెడ్డి!
-పాడి కౌశిక్ రెడ్డి శాసనసభ్యులు" అంటూ వీడియోను విడుదల చేశారు.
కాబట్టి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాలును ఆయన భార్య విరగ్గొట్టిందనే వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాలును ఆయన భార్య విరగ్గొట్టింది
Claimed By : Social Media Users
Fact Check : Unknown