ఫ్యాక్ట్ చెక్: బైక్ మీద వెళుతున్న వ్యక్తిపై పులి దాడి చేస్తున్న వీడియో నిజమైనది కాదు. ఏఐ ద్వారా సృష్టించారు
బైక్ మీద వెళుతున్న వ్యక్తిపై పులి దాడి చేస్తున్న వీడియో. కొందరు పులి దాడి చేయడం చూడగానే పారిపోతూ కనిపించారు
ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతన వన్యప్రాణుల సర్వే అయిన 2026 ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ (AITE) కోసం భారతదేశం సిద్ధమవుతోంది. ప్రపంచ పులుల జనాభాలో 75% కంటే ఎక్కువ భారతదేశంలోనే ఉండడంతో AITE పులుల గణన కోసం ముందుకు సాగుతోంది. మొత్తం పర్యావరణ వ్యవస్థను అంచనా వేస్తుంది. 3,682 పులులు ఉన్నాయని 2022 సర్వే చెబుతోంది. అంతకు మించి పులులు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే పులుల జనాభా గణనలో సాంప్రదాయ క్షేత్రస్థాయి పనితో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
వన్యప్రాణుల అభయారణ్యాల వెలుపల కూడా పులులను లెక్కించనున్నారు. 2022 లెక్కల ప్రకారం దేశంలో 3,682 పులులు ఉన్నట్లు లెక్కించారు. 2018 నుండి 2022 వరకు వార్షిక వృద్ధి రేటు 6.1 శాతంగా అంచనా వేసినట్లుగా ఒక అధ్యయనం వెల్లడించింది. శివాలిక్ కొండలు, గంగా మైదానాలలో పులుల జనాభా గణనీయంగా పెరిగిందని. జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, పశ్చిమ కనుమల వంటి ప్రాంతాలలో పులుల ఆక్రమణ తగ్గిందని జనాభా లెక్కల ఫలితాలు వెల్లడించాయి.
అయితే పులులకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియా యూజర్లను అయోమయానికి గురి చేస్తున్నాయి. అంతేకాకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బైక్ కింద పడిపోయి ఉండగా ఓ వ్యక్తిని పులి నోట కరుచుకుని పొదల్లోకి వెళ్ళిపోతూ ఉండడం వీడియోలో చూడొచ్చు. వీడియోలో మరికొందరు పారిపోతూ ఉండడం కూడా రికార్డు అయింది. ఈ ఘటన భారతదేశంలో చోటు చేసుకుందంటూ వీడియోను షేర్ చేస్తున్నారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియో అసలైన ఘటనకు సంబంధించింది కాదు. ఏఐ ద్వారా సృష్టించారు.
వైరల్ వీడియోను నిశితంగా పరిశీలించగా వీడియోలో పలు తేడాలు ఉన్నాయి. బైక్ కు సంబంధించిన నంబర్ ప్లేట్ భారతదేశానికి సంబంధించింది కాదు. దానిపై ఉన్న టెక్స్ట్ చదవలేని విధంగా ఉంది.
ముఖ్యంగా పులి ఆ వ్యక్తిని నోట కరుచుకుంటూ వెళ్లిపోతున్నా సమయంలో, బాధిత వ్యక్తికి సంబంధించిన శరీర భాగాలు అదృశ్యమైనట్లు కనిపిస్తాయి. పులి అమాంతం దాడి చేసినా, నోట కరుచుకుని వెళ్లిపోతున్నా కూడా బాధిత వ్యక్తి కనీసం కదలడం కూడా చేయకపోవడం అనుమానాలకు తావిచ్చింది. కనీసం అలాంటి పరిస్థితుల్లో పెనుగులాట అయినా జరుగుతుంది. ఈ అసమానతలు వీడియో నిజమైనది కాదని, డిజిటల్‌గా సృష్టించారనే వాదనకు బలాన్ని ఇస్తోంది.
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా Tiger Suddenly Encounter in Jungle #tiger #encounter #sora #ai #jungle అనే టైటిల్ తో @Thenatureattacks అనే యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియోను అప్లోడ్ చేశారు. ఈ వీడియోకు 28 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
వీడియో క్యాప్షన్ లో #AI #Sora వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ఉన్నాయి, ఇది AI వీడియో-జనరేషన్ టూల్స్ ఉపయోగించి సృష్టించారని సూచిస్తుంది.
ఇక ఇదే పేజీని నిశితంగా పరిశీలించగా ఏఐ ద్వారా సృష్టించిన పలు వీడియోలు మాకు కనిపించాయి. వ్యూస్ కోసం ఇలాంటి వీడియోలను సృష్టించి సోషల్ మీడియాలో పోస్టు చేశారని తెలుస్తోంది.
వైరల్ వీడియోను స్క్రీన్ షాట్ తీసి Hive Moderation టూల్ ద్వారా ఏఐ ద్వారా సృష్టించారా లేదా అని తెలుసుకోడానికి ప్రయత్నించగా ఇది ఏఐ సృష్టి అని స్పష్టంగా తేల్చింది.
కాబట్టి, ఏఐ ద్వారా సృష్టించిన వీడియోను నిజంగా చోటు చేసుకున్న ఘటనగా భావించి నెటిజన్లు షేర్ చేస్తున్నారు.