ఫ్యాక్ట్ చెక్: డబ్బులు ఇవ్వలేదని చిన్నారి మృతదేహాన్ని నడిరోడ్డుపై అంబులెన్స్ డ్రైవర్ వదిలేసాడని జరుగుతున్న ప్రచారం నిజం కాదన్న ఏపీ ప్రభుత్వ అధికారులు
డబ్బులు ఇవ్వలేదని చిన్నారి మృతదేహాన్ని ఏపీలో నడిరోడ్డుపై
విశాఖపట్నం కేజీహెచ్‌లో అనారోగ్యంతో మృతిచెందిన రెండు నెలల పసికందును, ఆ చిన్నారి తల్లిదండ్రులను కేజీహెచ్ అంబులెన్స్ డ్రైవర్ నిర్దాక్షిణ్యంగా నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దిక్కుతోచని, నిస్సహాయ స్థితిలో ఆ తల్లిదండ్రులు రాత్రిపూట ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ ఇంటికెళ్లారని కొన్ని సోషల్ మీడియా ఖాతాలు తెలిపాయి.
ఇదే విషయమై సాక్షిలో కూడా ఓ కథనం వచ్చింది. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీ మడ్రేబు గ్రామానికి చెందిన సేదరి శైలు, అర్జున్ దంపతులకు రెండు నెలల కిందట చిన్నారి జన్మించిందని, పాపకు శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో ఈనెల 8న విశాఖ కేజీహెచ్‌లో చేర్పించారని, చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం పసికందు మృతిచెందిందని సాక్షి నివేదించింది.
పాప మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లడానికి కేజీహెచ్ అంబులెన్స్‌లో బయల్దేరారగా, కొంతదూరం వెళ్లాక కొత్తవలస జంక్షన్‌లో అంబులెన్స్ డ్రైవర్ వీరిని దించేశాడని ఆరోపించారు. ఆటోలో రూ.6 వేలకు సరియా వరకు వెళ్లారని, అక్కడి నుంచి రాత్రి సమయంలో పాప మృతదేహాన్ని మోసుకుంటూ ఇంటికి చేరుకున్నారని సాక్షిలో కథనం వచ్చింది.
"అంబులెన్స్ డ్రైవర్ అమానుషం
చనిపోయిన పసికందును నడిరోడ్డుపై వదిలేసిన కసాయి
విశాఖ కేజీహెచ్ అంబులెన్స్ డ్రైవర్ నిర్వాకం
డబ్బుల్లేవని ప్రాధేయపడ్డా కనికరించలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు
దీంతో 5కి.మీ. మేర మృతదేహంతో నడుచుకుంటూ ఇంటికి..😥
రాత్రిపూట నాలుగు గంటలపాటు ఆ దంపతుల నరకయాతన" అంటూ ఓ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.
వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
మేము సంబంధిత వార్తా కథనాల కోసం వెతికాం. అయితే సాక్షి మీడియా వెబ్ సైట్ లో అంబులెన్స్ డ్రైవర్ నిర్దాక్షిణ్యంగా నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడంటూ కథనాన్ని చూశాం. "విశాఖపట్నం కేజీహెచ్‌లో ఇదో అమానుష ఘటన. టీడీపీ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వాస్పత్రుల పనితీరుకు అద్దంపట్టిన దారుణం. అనారోగ్యంతో మృతిచెందిన రెండు నెలల పసికందును, ఆ చిన్నారి తల్లిదండ్రులను కేజీహెచ్ అంబులెన్స్ డ్రైవర్ నిర్దాక్షిణ్యంగా నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయిన ఘోర ఉదంతమిది." అంటూ అందులో ఉంది.
మా తదుపరి పరిశోధనలో "డబ్బులు ఇవ్వలేదని చిన్నారి మృతదేహాన్ని నడిరోడ్డుపై అంబులెన్స్ డ్రైవర్ వదిలేసాడని చేస్తున్నది పూర్తిగా అసత్య ప్రచారం. తల్లిదండ్రులే తమకు వేరే వాహనం ఉందని, దానిలో తీసుకొని వెళ్తామని డ్రైవర్ ని బ్రతిమాలి, చిన్నారి మృతదేహంతో అక్కడ దిగిపోయారు. ఇటువంటి తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవు.
#FactCheck
#AndhraPradesh" అంటూ ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ లో పెట్టిన పోస్టులను మేము చూశాం.
ఇందులో సాక్షి కథనంలో ఎలాంటి నిజం లేదని ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. ఇందులో ఓ లెటర్ ను కూడా పొందుపరిచారు. ప్రభుత్వ అధికారులు సాక్షి కథనాలను ఖండిస్తూ, ఆ పిల్లాడి తల్లిదండ్రులే అంబులెన్స్ వద్దని చెప్పారని అందులో ఉంది.
తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ బృందం కేజీహెచ్ ఆసుపత్రిని ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకోడానికి ప్రయత్నించింది. వారి స్పందన రాగానే మేము ఈ కథనాన్ని నవీణీకరిస్తాం.
డబ్బులు ఇవ్వలేదని చిన్నారి మృతదేహాన్ని ఏపీలో నడిరోడ్డుపై అంబులెన్స్ డ్రైవర్ వదిలేసాడంటూ వైరల్ అవుతున్న పోస్టులను ప్రభుత్వ అధికారులు ఖండించారు.
Claim : డబ్బులు ఇవ్వలేదని చిన్నారి మృతదేహాన్ని ఏపీలో నడిరోడ్డుపై
Claimed By : Social Media Users
Fact Check : Unknown