ఫ్యాక్ట్ చెక్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 22000 రూపాయలు పెట్టుబడి పెట్టమని కోరలేదు
వైరల్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాలు నదీ జలాలను సామరస్యంగా పంచుకోవాలని సూచించారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ సమక్షంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో జరిగిన కీలకమైన సమావేశం తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలు సముద్రంలోకి ప్రవహించే గోదావరి నీటిని ఉపయోగించుకుంటే, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో, తెలంగాణలో కరువుని దూరం చేయొచ్చని చంద్రబాబు నాయుడు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని ప్రతిపాదించిన గోదావరి-బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్‌తో సహా నదీ జలాల సమస్యలను పరిష్కరించడానికి అధికారులు, ఇంజనీర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.నీటి సమస్యలపై నిర్మాణాత్మకంగా చర్చించామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. వివాదం అవసరం లేదు—మనం ఇచ్చిపుచ్చుకునే ప్రాతిపదికన పనిచేయాలని ఆయన అన్నారు.
ఇంతలో సీఎం చంద్రబాబు నాయుడు 22000 రూపాయలు పెట్టుబడి పెట్టాలని ప్రజలను కోరుతున్నట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. చంద్రబాబు నాయుడును జర్నలిస్ట్ మూర్తి ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా ఆ వీడియో ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోను డిజిటల్ గా ఎడిట్ చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాంటి ప్రకటన చేసి ఉండి ఉంటే అది తప్పకుండా మీడియా దృష్టిని ఆకర్షించి ఉండేది. సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేయగా ఆయన ప్రకటనకు సంబంధించిన వివరాలు ఏవీ మాకు లభించలేదు. ఇక వైరల్ వీడియో లోని వాయిస్ లో చాలా తేడాలు గమనించాము. అలాగే లిప్ సింక్ లో కూడా ఎన్నో తేడాలను మేము గుర్తించాం.
ఈ వీడియోలో ప్రముఖ తెలుగు జర్నలిస్ట్ మూర్తిని చూడొచ్చు. ఆయన సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా ఆయన వైరల్ వీడియోను ఖండించారు. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా స్పష్టం చేశారు.
వైరల్ వీడియోపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా స్పందించింది. "ఇదొక ఫేక్ వీడియో. కొందరు నేరగాళ్లు మోసపూరితంగా టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ చేసిన వీడియో ఇది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వీడియోను కూడా సృష్టించారు. ఈ వీడియోను సృష్టించిన వారిపైనా ఇతరులకు షేర్ చేసిన వారిపైనా సైబర్ నేర చట్టాల కింద చర్యలు తీసుకోబడతాయి. ఇటువంటి ఫేక్ వీడియోలను నమ్మి మోసపోకండి. ఇటువంటి వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండమని మీ కుటుంబ సభ్యులకు సూచించండి." అంటూ పోస్టు పెట్టింది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి నారా లోకేష్ కూడా వైరల్ పోస్టులను ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ పెట్టుబడి రాబడిని అందిస్తున్న స్కామ్‌ను తప్పుగా ప్రచారం చేస్తున్న నకిలీ, AI- జనరేటెడ్ వీడియోను చూసి షాక్ అయ్యానన్నారు నారా లోకేష్. ఇది పూర్తి మోసమని, ప్రజలను మోసం చేయడానికి డీప్‌ఫేక్ టెక్నాలజీని దుర్వినియోగం చేసే నేరస్థులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అటువంటి సైబర్ నేరస్థులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఇటువంటి మోసాలకు పాల్పడకండి. అప్రమత్తంగా ఉంటూ వెంటనే అధికారులకు నివేదించాలని నారా లోకేష్ కోరారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియోలో ఎలాంటి నిజం లేదు. ఇది పూర్తిగా ఏఐ ద్వారా సృష్టించారు.
Claim : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 22000 రూపాయలు
Claimed By : social media users
Fact Check : Unknown