ఫ్యాక్ట్ చెక్: అయోధ్య రామమందిరానికి తాళం వేస్తామని చెప్పగానే అఖిలేష్ యాదవ్ పై చెప్పులు విసిరారనే ప్రచారం నిజం కాదు.
అయోధ్య లోని రామమందిరానికి తాళం వేస్తామని చెప్పగానే అఖిలేష్ యాదవ్ పై ప్రజలు చెప్పులు విసిరారు
అయోధ్యలోని రామమందిర ట్రస్ట్ కుంభమేళా తర్వాత రామమందిరంలో దర్శన సమయాలను మార్చారు. కుంభమేళా సమయంలో రామమందిరంను దర్శించే వారి కోసం దర్శన సమయాలను రోజుకు 19 గంటలకు పొడిగించారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఉండేది. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా సమయంలో భారీ సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పించడానికి ఈ పని జరిగింది. అయితే, కుంభమేళా ముగియడంతో ఆలయం దర్శన షెడ్యూల్ మార్చారు. ఇప్పుడు ఉదయం 6 నుండి రాత్రి 10:15 వరకూ భక్తులకు దర్శనం లభించనుంది.
సమయాలలో వచ్చిన మార్పు కారణంగా అంతరాయం లేకుండా ఆచారాలని పాటించవచ్చు. అయోధ్య ఒక ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతూ ఉంది.
ఇంతలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అయోధ్య లోని రామమందిరానికి తాళం వేస్తామని చెప్పడంతో సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ పై ప్రజలు చెప్పులు విసిరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వీడియోను సోషల్ మీడియా వినియోగదారులు చాలా మంది షేర్ చేశారు. రోడ్‌షో సందర్భంగా ప్రజలు ఆయనపై బూట్లు, చెప్పులు విసిరినట్లు అందులో ఉంది.
"UP లోని Soran లోని మీటింగ్ లో అఖిలేష్ యాదవ్ తమ కూటమికి కేంద్రం లో అధి కారం లోకి వస్తే అయోద్య లోని రామమందిరానికి తాళం వేస్తాము అనగానే అక్కడి ప్రజలు అఖి లేష్ పైన చెప్పుల వర్షం కురిపించారు." అంటూ వాట్సాప్ లో పోస్టులు పెడుతున్నారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు:
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియో ఇటీవలిది కాదు. అఖిలేష్ యాదవ్ పై చెప్పులు విసిరారంటూ జరుగుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేయగా అధికారంలోకి వస్తే అయోధ్య రామాలయానికి తాళాలు వేస్తామని అఖిలేష్ యాదవ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలుసుకున్నాం.
అఖిలేష్ యాదవ్ ఏప్రిల్ 27, 2024న ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లోని రసులాబాద్‌లో రోడ్‌షో చేశారు. గూగుల్‌లో సంబంధిత కీవర్డ్ శోధనను నిర్వహించాము. ఏప్రిల్ 27న కన్నౌజ్‌లో అఖిలేష్యాదవ్ చేసిన రోడ్‌షో గురించి అనేక వీడియో నివేదికలను కనుగొన్నాము. లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎస్పీ నాయకుడి రోడ్‌షో సందర్భంగా ఆయనపై బూట్లు, చెప్పులు విసిరినట్లు ఏ నివేదికలోనూ పేర్కొనలేదు.
“Akhilesh Yadav Holds Mega Roadshow In Kannauj” అంటూ 27 ఏప్రిల్ 2024న NDTV పోస్టు చేసిన వీడియోను మేము కనుగొన్నాం.
వీడియో జాగ్రత్తగా పరిశీలించగా, జనం అఖిలేష్ యాదవ్ వైపు బూట్లు, చెప్పులు కాకుండా పూలు, దండలు విసిరినట్లు తేలింది.
వైరల్ వీడియోలో ఉన్న యాంగిల్ లో వీడియోను పోస్టు చేసిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను కూడా మేము కనుగొన్నాం. మే 2, 2024న అప్లోడ్ చేసిన వీడియోలో అఖిలేష్ యాదవ్ మీద ఎలాంటి చెప్పులు విసరలేదని మేము ధృవీకరించాం.
సమాజ్ వాదీ పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో మేము వీడియోను గుర్తించాం. ఇందులో కూడా అఖిలేష్ మీద పూల దండలు వేసినట్లుగానే ఉంది.
ఒకవేళ అఖిలేష్ యాదవ్ మీద చెప్పులు విసిరి ఉంటే తప్పకుండా వార్తల్లో నిలిచి ఉండేది.కానీ అలాంటిది ఏదీ చోటు చేసుకోలేదు. అయోధ్య ఆలయానికి వ్యతిరేకంగా కూడా అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు చేసినట్లుగా ఎలాంటి ప్రకటనలు మాకు లభించలేదు.
ఇక గతంలో కూడా పలు భాషల్లో ఇదే వాదనతో వీడియోను వైరల్ చేశారు. పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు వైరల్ పోస్టుల్లో నిజం లేదని తేల్చాయి. సదరు సంస్థలు సమాజ్ వాదీ పార్టీ నేతలను కూడా సంప్రదించాయి. ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ ఆ పార్టీ నేతలు ఖండించారు. అయోధ్య ఆలయానికి అఖిలేష్ యాదవ్ కూడా వెళ్ళొచ్చారని, ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారనే ప్రచారంలో నిజం లేదని వివరించారు.
Claim : అయోధ్య లోని రామమందిరానికి తాళం వేస్తామని చెప్పగానే అఖిలేష్ యాదవ్ పై ప్రజలు చెప్పులు విసిరారు
Claimed By : Social Media Users
Fact Check : Unknown