ఫ్యాక్ట్ చెక్: పుట్టపర్తిలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆపరేషన్ సింధూర్ గురించి ప్రశ్నించలేదు
ఈవెంట్ కు సంబంధించి ఐశ్వర్య రాయ్ పూర్తి ప్రసంగం కోసం మేము Googleలో వెతికాం
ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రజల మద్య ఐక్యతకు పిలుపునిస్తూ శక్తివంతమైన ప్రసంగం చేశారు. దేవునికి సేవ చేయడంలోనే కాదు.. మానవాళికి సేవ చేయడంలో నిజమైన నాయకత్వం ఉందని బాబా ఎల్లప్పుడూ చెప్పేవారని ఐశ్వర్యా రాయ్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులకు అందించే ఉచిత విద్య శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో అందించబడే అధిక-నాణ్యత, ఉచిత వైద్య సేవలను సూచిస్తూ, శ్రీ సత్యసాయి సంస్థల ద్వారా జరుగుతున్న విస్తృతమైన దాతృత్వ పనిని ఐశ్వర్య ప్రశంసించారు. సత్య సాయి బాబా జన్మించిన ఒక శతాబ్దం తర్వాత కూడా, ఆయన కరుణ, సేవ, ప్రేమ సూత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయని అన్నారు.
ఐశ్వర్య రాయ్ తన ప్రసంగంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. ఆమె జాతీయ భద్రతను ఉద్దేశించి మాట్లాడినట్లుగా అందులో ఉంది. "పాకిస్తాన్ చేతిలో మనం ఆరు జెట్లను ఎందుకు కోల్పోయాము, నాలుగు రాఫెల్ విమానాలు, రెండు S-400 వ్యవస్థలు, 300 మంది సైనికులను ఎందుకు కోల్పోయాము అని నేను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అడగాలనుకుంటున్నాను" అని వైరల్ క్లిప్ లో ఉంది. వైరల్ క్లెయిమ్ కు సంబంధించిన స్క్రీన్‌షాట్ ఇక్కడ ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ క్లిప్‌లోని ఆడియోను ఎడిట్ చేశారు.
ఈవెంట్ కు సంబంధించి ఐశ్వర్య రాయ్ పూర్తి ప్రసంగం కోసం మేము Googleలో వెతికాం. ANI ప్రచురించిన 8 నిమిషాల వీడియోను మేము కనుగొన్నాము. శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం అధికారిక YouTube ఛానెల్ కూడా పూర్తి ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసింది. అందులో కూడా ఎక్కడా ఐశ్వర్య రాయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లుగా మాకు కనిపించలేదు.
తన ప్రసంగం ప్రారంభంలో, సాయిబాబా సూత్రాలు, బోధనలు, కరుణ ఎలా ప్రతిధ్వనిస్తున్నాయో తెలిపారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరైనందుకు ఆమె కృతజ్ఞతలు కూడా తెలిపారు, ఆయన హాజరవ్వడం ఈ కార్యక్రమానికి పవిత్రత, ప్రేరణను తెచ్చిపెట్టిందని అన్నారు.
నటి తన ఆధ్యాత్మిక మూలాల గురించి కూడా మాట్లాడారు. మాజీ బాల్ వికాస్ విద్యార్థిగా, తాను క్రమశిక్షణ, అంకితభావం, భక్తి, సంకల్పం గురించి నేర్చుకున్నానని తెలిపారు. ఒకే ఒక్క జాతి ఉంది, అది మానవతా జాతి. ఒకే ఒక్క మతం ఉంది, అది ప్రేమ మతం. ఒకే ఒక్క భాష ఉంది, అది హృదయ భాష. ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఆయన సర్వవ్యాప్తుడు అని బాబా ఎప్పుడూ చెబుతుండేవారు అని ఐశ్వర్య సత్యసాయి బోధనలను గుర్తు చేసుకున్నారు. సత్యసాయి జన్మించి వందేళ్లు గడిచినా, బాబా లక్షలాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని ఐశ్వర్య రాయ్ అన్నారు.
ఆమె ప్రసంగంలో ఎక్కడా సైన్యం, రాఫెల్ జెట్‌లు, ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్ లేదా ఏదైనా భద్రతా సంబంధిత సమస్యను ఆమె ప్రస్తావించలేదు.
ఆమె ప్రసంగాన్ని కవర్ చేసే బహుళ మీడియా నివేదికలను కూడా మేము కనుగొన్నాము. వాటిలో ఏవీ వైరల్ క్లెయిమ్ లాంటిది ప్రస్తావించలేదు.
ఈ కార్యక్రమంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాదాలకు నమస్కరించిన ఆశీర్వాదం తీసుకున్నారు.
వైరల్ వీడియోలో AI ప్రమేయం ఉందో లేదో తనిఖీ చేయడానికి మేము నిశితంగా విశ్లేషించాము. చాలా చోట్ల, ఆమె పెదవి కదలికలు ఆడియోతో సరిపోలడం లేదు. మేము వీడియోను రిసెంబుల్ AI, డీప్‌ఫేక్ డిటెక్టర్ ద్వారా రన్ చేసాము, ఈ క్లిప్‌లోని వాయిస్ AI ద్వారా సృష్టించారని నిర్ధారించింది. ఇది డీప్‌ఫేక్ అని స్పష్టంగా సూచిస్తుంది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఐశ్వర్య రాయ్ బహిరంగ కార్యక్రమంలో ఆపరేషన్ సిందూర్ గురించి ప్రధానమంత్రిని విమర్శించినట్లు చెప్పే వీడియో పూర్తిగా నకిలీది.
Claim : డీప్ ఫేక్ వీడియోను నిజమైనదిగా ప్రచారం చేస్తున్నారు.
Claimed By : Social Media Users
Fact Check : Unknown