ఫ్యాక్ట్ చెక్: పువ్వు మధ్యలో శిలువ వస్తుందంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో ఒక ముఖ్యమైన రోజు. యేసు క్రీస్తుని శిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. క్రైస్తవులు
Blood of Jesus flower
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో ఒక ముఖ్యమైన రోజు. యేసు క్రీస్తుని శిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. క్రైస్తవులు ఆరోజు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. కల్వరి మీద ఆయన మరణాన్ని గుర్తు చేసుకుంటూ క్రైస్తవులు గుడ్ ఫ్రైడేని జరుపుకుంటారు. అందరూ ఆరోజు చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తారు. తమ పాపాల నుంచి విముక్తి కలిగించమని వేడుకుంటారు. బైబిల్ ప్రకారం గుడ్ ఫ్రైడే మానవాళిని పాపాల నుంచి రక్షించడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాలను అర్పించిన రోజు. ఈ ఏడాది ఏప్రిల్ 18, 2025న గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నారు.
న్యూజిలాండ్‌లో అరుదైన పువ్వుకు సంబంధించిన ఫోటో అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. ‘Blood of Jesus on the Cross’ పువ్వు అని పిలుస్తారని ఎరుపు రంగు పువ్వు చిత్రం ప్రచారంలో ఉంది. ఈ పువ్వు పవిత్ర వారంలో మాత్రమే వికసిస్తుందని, పువ్వు మధ్యలో మనం ఒక శిలువను చూడగలమని కూడా సందేశం చెబుతోంది. "ఈ న్యూజిలాండ్ పువ్వు పవిత్ర వారంలో మాత్రమే వికసిస్తుంది. దీనిని క్రీస్తు రక్తం అని పిలుస్తారు. పువ్వు మధ్యలో ఉన్న శిలువను గమనించండి. దీనిని క్రీస్తు వెలుగు అని పిలుస్తారు. మీరు పువ్వును చూసినప్పుడు ఆప్యాయంగా ఇలా చెబుతారు: ప్రభువైన యేసు మీ విలువైన రక్తంతో నా కుటుంబాన్ని ప్రకాశవంతం చేయండి. ఈ పువ్వు (సందేశం) మరొక కుటుంబానికి కూడా వారిని ప్రకాశవంతం చేయడానికి పంపండి. ఆమెన్!” అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఈ వాదన ఇంగ్లీషు, తెలుగులో ఒకే క్యాప్షన్‌తో వాట్సాప్‌లో కూడా వైరల్ అవుతోంది.
ఫ్యాక్ట్ చెక్:
ఈ వాదన నిజం కాదు. చిత్రంలో కనిపిస్తున్న పువ్వు మెట్రోసిడెరోస్ ఎక్సెల్సా అనే చెట్టు నుండి వచ్చింది.
హోలీ వీక్ లో మాత్రమే వికసించే పువ్వు గురించి వెతికినప్పుడు, మొక్కలకు సంబంధించిన డేటాబేస్‌లలో మాకు ఏదీ కనిపించలేదు. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి పువ్వు చిత్రాన్ని వెతికినప్పుడు, ఆ పువ్వు మెట్రోసిడెరోస్ ఎక్సెల్సా అనే చెట్టు నుండి వచ్చిందని మేము కనుగొన్నాము, దీనిని పోహుటుకావా అని కూడా పిలుస్తారు. దక్షిణాఫ్రికా జాతీయ జీవవైవిధ్య సంస్థ (SANBI) "ఈ చెట్టు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాకు చెందినది. జపాన్, స్పెయిన్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికాలో కూడా ఇవి కనిపిస్తాయి" అని వివరిస్తుంది. ఇది ప్రస్తుతం న్యూజిలాండ్‌లోనే కాకుండా అనేక ప్రదేశాలలో కనిపిస్తుంది.
పోహుటుకావా అనబడే ఈ చెట్టు ప్రాథమిక లక్షణాలకు సంబంధించిన వివరాలు మాకు లభించాయి. "దీనిని సాధారణంగా న్యూజిలాండ్ క్రిస్మస్ చెట్టు అని పిలుస్తారు, ఎందుకంటే ఈ చెట్టు పుష్పించే కాలం క్రిస్మస్‌తో సమానంగా ఉంటుంది". కేవలం పవిత్ర వారంలో మాత్రమే పుష్పిస్తుందనేది నిజం కాదని తెలుస్తోంది. ఉత్తర అక్షాంశాలలో పుష్పించే కాలం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అందువల్ల పవిత్ర వారంతో సమానంగా ఉంటుందని తెలిపారు.
న్యూజిలాండ్ ప్లాంట్ కన్జర్వేషన్ నెట్‌వర్క్ కథనం ప్రకారం, ఈ చెట్టు 20 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. 10–50 మీటర్ల పందిరి వ్యాప్తి చెందుతుంది. కొమ్మలు వంపుతిరిగి ఉంటాయి, కొన్నిసార్లు నేలపైకి వంగి ఉంటాయి. వీటి బెరడు దృఢంగా ఉంటుంది. విభిన్న రంగులలో కనిపించే పువ్వులు ఎంతో అందంగా ఉంటాయి.
gardenia.net ప్రకారం, మెట్రోసిడెరోస్ ఎక్సెల్సా సతత హరిత, విస్తృతంగా వ్యాపించే చెట్టు. ఇది ఆకర్షణీయమైన పువ్వుల సమూహాలను కలిగి ఉంటుంది. ఇవసంతకాలం చివరి నుండి వేసవి ప్రారంభంలో ఇవి వికసిస్తాయి.
మేము పోహుటుకావా చెట్లకు చెందిన పువ్వుల చిత్రాలను వెతికినప్పుడు, అన్ని పువ్వులకు మధ్యలో శిలువ ఉండదని నిర్ధారించగలిగాము. అలమి స్టాక్ ఇమేజెస్ లో పొందుపరచిన చిత్రాలను ఇక్కడ చూడొచ్చు. Snopes, Verificat.cat వైరల్ అవుతున్న వాదనలో నిజం లేదని ధృవీకరించాయి
కాబట్టి, వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఆ పువ్వు చిత్రం న్యూజిలాండ్ క్రిస్మస్ ట్రీ అనే చెట్టు నుండి వచ్చినప్పటికీ, అది పవిత్ర వారంలో మాత్రమే వికసించదు. పువ్వులలో శిలువ ఆకారం ఉండదు.
Claim : వైరల్ చిత్రంలో ఉన్నది పవిత్ర వారంలో మాత్రమే వికసించే పువ్వు. ప్రతి పువ్వు మధ్యలో ఒక శిలువ ఉంటుంది
Claimed By : Social media users
Fact Check : Unknown