జనరల్ ఉపేంద్ర ద్వివేది, PVSM AVSM (జననం 1 జూలై 1964) భారత సైన్యంలో ఫోర్-స్టార్ జనరల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆయన ప్రస్తుత, 30వ ఆర్మీ స్టాఫ్ చీఫ్. జనరల్ మనోజ్ పాండే స్థానంలో ఆయన 30వ COASగా జూన్ 30, 2024న బాధ్యతలు స్వీకరించారు. ఆయన 46వ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ద్రాస్‌లో జరిగిన విజయ్ దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ తో పాకిస్థాన్‌కు సందేశం ఇచ్చామని, అలాగే పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్య అని ఆయన అన్నారు. పెహల్గామ్ ఉగ్రదాడి భారత్‌కు తీవ్ర గాయాన్ని ఏర్పర్చిందని, అయితే ఈసారి ఇండియా బాధపడడమే కాదు, ఆ చర్యకు ప్రతీకార చర్యను కూడా చూపించిందన్నారు. 1999 నాటి కార్గిల్ యుద్ధ గాధలు వినేందుకు క్యూఆర్ కోడ్ ఆడియో గేట్‌వేను కూడా ఆయన ప్రారంభించారు. ఇండస్ వ్యూవ్ పాయింట్ అనే ప్రాజెక్టును కూడా లాంచ్ చేశారు. దీని వల్ల విజిటర్స్ ఎల్వోసీ వద్దకు వెళ్లవచ్చు. బటాలిక్ సెక్టార్‌లోని ఎల్వోసీ ప్రాంతాన్ని ఇండస్ వ్యూవ్‌పాయింట్‌తో చూడవచ్చు. కార్గిల్ యుద్ధ సమయంలో బటాలిక్ ప్రాంతం కీలకంగా నిలిచింది. ఇది సుమారు పది వేల అడుగుల ఎత్తులో ఉంది. భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది, ద్రాస్‌లోని కార్గిల్ విజయ్ దివాస్ స్మారకోత్సవాల సందర్భంగా సైన్యం ఆధునీకరణ కార్యక్రమాన్ని కూడా ప్రకటించారు. రాబోయే దశాబ్దాలలో భారత సైన్యం మరింత గొప్పగా మారుతుందని స్పష్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో 250 మందికి పైగా భారతీయ సైనికులు తప్పిపోయారని, పాకిస్తాన్ చైనా ఉపగ్రహాలను ఉపయోగించి భారత సైన్యం కదలికలను ట్రాక్ చేసిందని జనరల్ ఉపేంద్ర ద్వివేది చెప్పినట్లుగా వీడియో వైరల్ అవుతూ ఉంది. “Breaking. Indian Army Chief Upendra Dwivedi admits to losing more than 250 soldiers in war against Pakistan. Pakistan was aware of our every single movement due to Chinese satellites.” అనే క్యాప్షన్ తో వీడియోను పోస్టు చేస్తున్నారు.
వైరల్ వీడియోలో, భారత ఆర్మీ జనరల్ కార్గిల్ విజయం గురించి మాట్లాడటం ప్రారంభించి, ఆపై ఆపరేషన్ సిందూర్ గురించి, భారతదేశం 250 మంది భారతీయ సైనికులను ఎలా కోల్పోయిందో, పాకిస్తాన్ భారత సైన్యం కదలికలను నవీకరించడానికి చైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించారో చెప్పినట్లుగా ఉంది.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. వైరల్ వీడియోను డిజిటల్‌గా ఎడిట్ చేశారు.
మొదట వీడియోలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లోగోను మేము గమనించాము. కీవర్డ్స్ ‘General Upendra Dwivedi + Indian Express’ ను ఉపయోగించి సెర్చ్ చేశాం. ““New Normal, No Mercy”: Indian Army Chief Warns Pakistan After Op Sindoor | Kargil Vijay Diwas |” అనే టైటిల్ తో జూలై 26, 2025న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ యూట్యూబ్ ఛానెల్ ప్రచురించిన వీడియోను మేము కనుగొన్నాము. వీడియో వివరణలో “కార్గిల్ విజయ్ దివస్ 2025 నాడు, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్‌కు బలమైన సందేశాన్ని ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సర్జికల్ స్ట్రైక్స్ చేశామని, ఉగ్రవాదం దాని మద్దతుదారులను విడిచిపెట్టబోమని స్పష్టమైన హెచ్చరిక పంపామన్నారు. ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద మాట్లాడుతూ, జనరల్ ద్వివేది ఈ దాడులను పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రత్యక్ష ప్రతిస్పందనగా తెలిపారు. భారతదేశం సంతాపం నుండి నిర్ణయాత్మక ప్రతీకారం తీర్చుకునే దిశగా అడుగులు వేసిందని ఆయన చెప్పారు.
ఈ వీడియోలోని 1.12 నిమిషాలలో, ఆపరేషన్ విజయ్ కింద కార్గిల్ యుద్ధం గురించి జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతుండటం మనం చూడవచ్చు, భారత సైన్యం పాకిస్తాన్ సైనికులను సరిహద్దు నుండి ఎలా పారద్రోలిందో వివరించారు. అదే విధంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో, భారత సైన్యం పాకిస్తాన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడిలో చేసి విజయం సాధించిందన్నారు. పహల్గామ్‌లో జరిగిన పిరికి ఉగ్రవాద దాడి మొత్తం దేశానికి గాయం లాంటిదని, భారతదేశం ఈసారి బాధపడటమే కాకుండా గట్టిగా స్పందించాలని నిర్ణయించుకుందని తెలిపారు. వీడియోలో ఎక్కడా, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైన్యంలో జరిగిన ప్రాణనష్టం గురించి ఆయన ప్రస్తావించలేదు.
జూలై 26, 2025న ‘ది ప్రింట్’ ప్రచురించిన మరో యూట్యూబ్ వీడియో జనరల్ ప్రసంగాన్ని చూపిస్తుంది. వైరల్ భాగం 2.55 నిమిషాల నుండి ప్రారంభమవుతుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో సైనికుల మరణాల గురించి వీడియోలో ఎక్కడా ఆయన మాట్లాడలేదు.
వైరల్ వీడియోను తోసిపుచ్చే 29 జూలై 2025 నాటి PIB ఫ్యాక్ట్ చెక్ పోస్ట్‌ను కూడా మేము కనుగొన్నాము. పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో 250 మందికి పైగా సైనికులను కోల్పోయినట్లు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అంగీకరించినట్లు ఎడిట్ చేసిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోందని ఆ పోస్ట్ పేర్కొంది. ఇది AI ద్వారా రూపొందించబడిన డీప్‌ఫేక్ వీడియో అని, జనరల్ ద్వివేది అలాంటి ప్రకటన ఏదీ చేయలేదని PIB స్పష్టం చేసింది.
కనుక, వైరల్ వీడియో డిజిటల్‌గా ఎడిట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో 250 మంది భారతీయ సైనికులు మరణించారని భారత ఆర్మీ జనరల్ పేర్కొన్నారనే వాదన నిజం కాదు.