నిజ నిర్ధరణ: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలు లోగోలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోను తీసివేసిందనే ప్రచారం పాక్షిక సత్యం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అది నడుపుతున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లోని వ్యక్తులు మాజీ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభావం నుంచి దూరం జరుగుతున్నారని సోషల్ మీడియాలోని కొంతమంది కొంతకాలంగా అప్పుడప్పుడూ వాదిస్తున్నారు.

Update: 2022-06-26 04:05 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అది నడుపుతున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లోని వ్యక్తులు మాజీ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభావం నుంచి దూరం జరుగుతున్నారని సోషల్ మీడియాలోని కొంతమంది కొంతకాలంగా అప్పుడప్పుడూ వాదిస్తున్నారు. అందుకు ఆధారంగా నవరత్నాలు లోగోలో మొదటగా కేవలం రాజశేఖర రెడ్డి మాత్రమే ఉండేదని, తర్వాత రాజశేఖర రెడ్డి, అతని కుమారుడు జగన్ మోహన్ రెడ్డి ఫోటో ఉందని, ఇప్పుడు తండ్రి లేకుండా కేవలం ముఖ్యమంత్రి ఫోటో మాత్రమే మిగిలిందని అంటున్నారు. ఈ అంశంపై నిజ నిర్ధరణ చేయగా.. వారి వాదన పాక్షికంగానే సత్యమని తేలుతోంది.


(https://www.facebook.com/reel/772770923892193)

ఆంధ్ర ప్రదేశ్ లో నివసించే ఎవరైనా నవరత్నాలు అనగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, దాని అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన సంక్షేమ పథకాలు కూడా అని, వాటిలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల బాంకు ఎకౌంటులకే నేరుగా డబ్బు జమచేస్తారని తెలుసు. ఆ నవరత్నాల లోగో కూడా వారికి పరిచితమే.



అయితే, కొందరు సోషల్ మీడియా వినియోగదారులు.. కేవలం సెంటిమెంటు ఉపయోగించి ఓటర్లను ఆకర్షించేందుకే రాజశేఖర రెడ్డి ఫోటోను నవరత్నాలు లోగోలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాడిందని, ఆ తర్వాత మరిన్ని ఓట్లను పొందటం కోసం తండ్రి కొడుకుల ఫోటోను ఉపయోగించిందని, ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో వైఎస్సార్ సిపి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాజశేఖర రెడ్డి ఫోటోని పూర్తిగా తొలగించి ముఖ్యమంత్రి ఫోటో మాత్రం ఉంచిందని.. అవసరం తీరాక తగిన గౌరవం ఇవ్వలేదని వాదిస్తున్నారు.

Fact Check:

Navaratnalu logo అని గూగుల్ ద్వారా ఇంటర్ నెట్ లో వెదికినప్పుడు కొన్ని రకాల లోగోలను చూస్తాం. వాటిలో.. రాజశేఖర రెడ్డి ఫోటో ఒక్కటే నవరత్నాల బొమ్మల మధ్యలో ఉన్నదీ, తండ్రీకొడుకులిద్దరూ కలిసి ఉన్నదీ, కేవలం జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే ఉన్న మరికొన్ని లోగోలు గమనిస్తాం.


అయితే, సోషల్ మీడియా వినియోగదారుల ఆరోపణలో నిజానిజాలను గమనించేందుకు వీలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్ సైట్, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విభాగాల వెబ్ సైట్లను పరిశీలించాలని నిర్ణయించాం.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్ సైట్ https://www.ysrcongress.com/లో నవరత్నాలు పధకాల చిహ్నాల మధ్యలో రాజశేఖర రెడ్డి ఉన్న ఫోటోను విరివిగా, తమ పార్టీ జెండాపై కూడా వినియోగిస్తున్నారు. తమ పార్టీ జెండాను అలా డిజైన్ చేయటంలో ఉద్దేశాన్ని ఇంతకు ముందే ఇచ్చిన వివరణను ఆ వెబ్ సైట్ ఆర్కైవ్ లింక్ ద్వారా చూడవచ్చు.

https://web.archive.org/web/20140110164934/http://www.ysrcongress.com/en/articles/The_Flag.html

మరోవైపు, తండ్రికొడుకుల ఫోటోలు ఉన్న నవరత్నాలు లోగోని, కేవలం జగన్ మోహన్ రెడ్డి ఫోటో ఉన్న లోగోలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ వెబ్ సైట్ లో ఎక్కువగానే ఉపయోగిస్తోంది. అందుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ఇక్కడ: https://web.archive.org/web/20201021081812/https://www.ysrcongress.com/navaratnalu-logo-66230

అదే వెబ్ సైట్ లో నవరత్నాలు పేజ్ లో ఒక్కో స్కీమ్ గురించి వివరిస్తూ యూట్యూబ్ లో ఫిబ్రవరి 2019 లో అప్ లోడ్ చేసిన వీడియోల లింక్ లను కూడా ఇచ్చారు. ఆ పేజీ ఆర్కైవ్ లింక్:

https://web.archive.org/web/20190330110525/https://www.ysrcongress.com/video/navarathnalu

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రియల్ 11, 2019 న జరిగాయి. ఆ తర్వాత ఏర్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నవరత్నాలు పధకాలను ప్రారంభించేందుకు ప్రచారంలో రాజశేఖర రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్న లోగోను ఎక్కువగా ఉపయోగించింది. పబ్లిసిటీ మెటీరీయల్, డాక్యుమెంట్స్ వంటి వాటితో పాటు అటవీ హక్కుదారుని పాసు పుస్తకం, వార్డు, గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్న వాలంటీర్లకు ఇచ్చిన అవార్డులు, సర్టిఫికెట్లలో కూడా అదే లోగోను వాడింది. కానీ, కృష్ణా జిల్లా అధికారిక వెబ్ సైట్ వంటివి మాత్రం జగన్ మోహన్ రెడ్డి ఫోటో మాత్రమే ఉన్న నవరత్నాలు లోగోను ఉపయోగించాయి. కృష్ణా జిల్లా వెబ్ సైట్ ఆర్కైవ్ లింక్:

https://web.archive.org/web/20200922115813/https://krishna.ap.gov.in/scheme/navaratnalu/. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ లోని నవరత్నాల వివరణ డాక్యుమెంట్ లో మాత్రం కేవలం జగన్ మోహన్ రెడ్డి ఉన్నదే అయినా ఇంకొక లోగో వాడారు. ఆ డాక్యుమెంట్ ఆర్కైవ్ లింక్: https://web.archive.org/web/20191221132432/https://www.ap.gov.in/wp-content/uploads/2019/07/Navaratnalu-English-converted.పిడిఎఫ్


అయితే నవరత్నాలు లోగో వాడాల్సి వచ్చినప్పుడు YSR-YSJ ఫోటో ఉన్న లోగోనే వాడిన ప్రభుత్వ వెబ్ సైట్లు.. దాని స్థానంలో జగన్ మోహన్ రెడ్డి మాత్రమే ఉన్న నవరత్నాలు లోగోకి మార్చటం కొంతకాలం క్రితం మొదలయింది. ఉదాహరణకు స్పందన వెబ్ సైట్ ఆర్కైవ్ పరిశీలించినప్పుడు.. అక్టోబర్ 6, 2021 నాడు YSR-YSJ ఫోటోతో ఉన్న లోగో YSJ (Link: https://web.archive.org/web/20211006114946/https://www.spandana.ap.gov.in/).. నవంబరు 25, 2021 నాటికి కేవలం జగన్ మాత్రమే ఉన్న నవరత్నాలు లోగోకి (Link: https://web.archive.org/web/20211125100906/https://www.spandana.ap.gov.in/) మారిపోయింది.


అలాగే, https://ap.gov.in హోమ్ పేజ్ లో ఇంతకు ముందు నవరత్నాలు లోగో లేదు, కానీ. జగన్ మోహన్ రెడ్డి ఫోటో ఉన్న నవరత్నాలు లోగో కనీసం మే 2022 నుంచి అక్కడ కనిపిస్తోంది. ఈ ప్రభుత్వ వెబ్ సైట్ వర్డ్ ప్రెస్ ఆధారంగా పనిచేస్తుంది. దాని వలన ఏదేని ఫైల్ ఆ వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేసినప్పుడు, ఆ ఫైల్ కి అది అప్ లోడ్ చేయబడిన నెల, సంవత్సరం ఆధారంగా స్పేస్ ఇవ్వబడుతుంది. అదే పద్ధతిలో ఆ ఫైల్ కి URL వస్తుంది. (Link: https://www.ap.gov.in/wp-content/uploads/2022/05/navaratnalu_logo.jpeg)

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ వివరాలన్నీ పరీశీలించాక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, దాని నాయకులు, కార్యకర్తలు ఇప్పటికీ రాజశేఖర రెడ్డి ఫోటో ఉన్న నవరత్నాలు లోగోని పార్టీ జెండాతో సహా ఇతర అవసరాలకు వాడుతున్నారని, అలాగే తండ్రి కొడుకులు ఫోటోలతో ఉన్నదే కాకుండా జగన్ మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్న నవరత్నాలు లోగోలనూ విరివిగా ఉపయోగించుకుంటున్నారని తెలుస్తుంది.


అయితే, కొన్ని ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లలో మాత్రం రాజశేఖర రెడ్డీ, జగన్ మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్న నవరత్నాలు లోగోను కొంతకాలం వాడినప్పటికీ, దానిని కేవలం జగన్ మోహన్ రెడ్డి ఫోటో ఉన్న నవరత్నాలు లోగోతో మార్చుతున్నారు. కాబట్టి, సోషల్ మీడియా వినియోగదార్లు వాదించిన విషయం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రభావం నుంచి దూరమవుతూ, అతని, అతని కుమారుని ఫోటోను నవరత్నాలు లోగోలో తొలగించి, కేవలం జగన్ మోహన్ రెడ్డి ఫోటో మాత్రమే ఉంచారనటం.. పాక్షిక సత్యం.


Claim: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రభావం నుంచి దూరమవుతూ, అతని, అతని కుమారుని ఫోటోను నవరత్నాలు లోగోలో తొలగించి, కేవలం జగన్ మోహన్ రెడ్డి ఫోటో మాత్రమే ఉంచారు

Claimed by: సోషల్ మీడియా వినియోగదార్లు

Fact Check: పాక్షిక సత్యం

Claim :  AP government removed Dr YSR from Navaratnalu logo
Claimed By :  Social Media Users
Fact Check :  True
Tags:    

Similar News