Tirumala : నేడు తిరుమలకు వెళ్లే భక్తులకు హై అలెర్ట్
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది.
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. సంక్రాంతి సెలవులు ముగిసినప్పటికీ భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. దర్శనానికి గంటల సేపు సమయం పడుతుంది. క్యూలైన్ బయట వరకూ విస్తరించకపోయినా ఎక్కువ సంఖ్యలో కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. అదే సమయంలో భక్తులు ఇబ్బందులు పడకుండా వీలయినంత త్వరగా స్వామి వారిని దర్శించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్నారు. తిరుమలలో వసతి గృహాలు దొరకడం కూడా కొంత ఆలస్యమవుతుందని భక్తులు తెలిపారు.
ఆన్ లైన్ లో ఏప్రిల్ నెలకు...
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నేడు ఆన్ లైన్ లో ఏప్రిల్ నెల దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లు విడుదల అవుతాయి. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల చేయనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే ఆన్ లైన్ లో టిక్కెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. కొన్ని నకిలీ వెబ్ సైట్లు, దళారుల బారిన పడకుండా టీటీడీ అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే టిక్కెట్లను కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
పదిహేడు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదిహేడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 74,056 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,౫౧౭ మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.98 కోట్ల రూపాయల వచ్చిందని అధికారులు విడుదల చేశారు.