Tirumala : అలిపిరి నుంచే నిరీక్షణ.. గంటల కొద్దీ దర్శనానికి సమయం
తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఎక్కువగా ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఎక్కువగా ఉంది. వరస సెలవులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. వరసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతో పాటు రథసప్తమి రోజున స్వామి వారిని దర్శించుకుంటే శుభప్రదమని విశ్వసించిన భక్తులు వేలాది మంది తరలి రావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతుంది. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వారు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.
అలిపిరి టోల్ గేట్ ...
అలిపిరి టోల్ గేట్ నుంచే వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. అలిపిరి టోల్ గేట్ వద్ద కిలోమీటర్ల వరకూ తనిఖీ కోసం వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ఉండటంతో ఘాట్ రోడ్డు నుంచి తిరుమలకు చేరుకోవడం కష్టంగా మారింది. దాదాపు కపిల తీర్థం వరకూ వాహనాలున్నాయని పోలీసులు తెలిపారు. భక్తులు ఒక్కసారిగా తరలి రావడంతో వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలను నిర్వహించి కొండ మీదకు అనుమతిస్తున్నారు. మరొకవైపు తిరుమలలో వసతి గృహాల కొరత కూడా ఏర్పడింది.
శిలాతోరణం వరకూ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయి శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 76,654 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 34,080 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.81 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారుల వెల్లడించారు.