Cyber Crime : సైబర్ క్రైమ్ గ్యాంగ్ అరెస్ట్.. డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరించి దోచుకుని?
సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్న గ్యాంగ్ ను సైబర్ క్రైమ్ పోలీసులు కేరళలో అరెస్ట్ చేశారు
సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్న గ్యాంగ్ ను సైబర్ క్రైమ్ పోలీసులు కేరళలో అరెస్ట్ చేశారు. డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెట్టి డెబ్భయి లక్షల రూపాయలు కాజేసిన ముఠాను పట్టుకున్నారు. వాట్సాప్ కాల్‌తో బెదిరించి పదవి విరమణ చేసిన వ్యక్తి నుంచి 70 లక్షలు దోచుకున్న డిజిటల్ అరెస్ట్ గ్యాంగ్‌ను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిర్యాదు ప్రకారం, బాధితుడికి ఓ వ్యక్తి తనను ఢిల్లీ పోలీస్ అధికారి అని చెప్పుకుంటూ వాట్సాప్‌లో కాల్ చేశాడు. ఆయన పేరు ఓ ఆర్థిక నేరంలో ఉన్నట్లు చెబుతూ భయపెట్టాడు. వెంటనే మరో వ్యక్తికి వీడియో కాల్‌లో మారుస్తూ, తాను సైబర్‌క్రైమ్ అధికారి నంటూ పరిచయం చేసుకున్నాడు.
డిజిటల్ అరెస్ట్ అంటూ...
వీరిరువురు విషయం సీబీఐ దర్యాప్తులో ఉందని, సహకరించకపోతే తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు.బ్యాంక్ అధికారులకు గానీ కుటుంబ సభ్యులకు గానీ చెప్పొద్దని చెబుతూనే, కాల్ లాగ్స్, మెసేజ్‌లు డిలీట్ చేయమని సూచించారని పోలీసులు తెలిపారు. ఒత్తిడితో బాధితుడు తన డిపాజిట్లు మోసగాళ్లకు పంపించాడు. ఆర్టీజీఎస్ ద్వారా మొత్తం 70 లక్షల రూపాయలను ‘ఆర్‌బీఐ వెరిఫికేషన్’ పేరుతో జమ చేయాలంటూ మోసగాళ్లు ఒత్తిడి చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత కాల్స్ ఎత్తకపోవటంతో మోసపోయిన విషయాన్ని గ్రహించిన పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు.దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సైబర్ గ్యాంగ్ ఎక్కువ మంది వృద్ధులు, రిటైర్ అయిన ఉద్యోగులను మాత్రమే ఎంచుకుంటున్నారు.
కేరళలో నలుగురు అరెస్ట్...
ఈ కేసుకు సంబంధించి సాంకేతికంగా విచారణ జరిపిన అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులు కేరళలో ఉన్న నలుగురిని అరెస్ట్ చేశారు. వారిని మోయినుద్దీన్ ఏ.కె., విపిందాస్, రియాస్ నూరాన్ మూచీ, మహమ్మద్ జకారయ్య కురుంగాడన్ గా గుర్తించారు. నవంబర్ 19 నుంచి 25 వరకు పోలీసులు గుర్తించిన పది సైబర్ కేసుల్లో ఇదొకటి అని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు తెలిపారు. ఈ వారం మొత్తం 21 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 13 మంది ట్రేడింగ్ ఫ్రాడ్‌కు, ఏడుగురు డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్‌కు సంబంధించినవారని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా 21 మొబైల్ ఫోన్లు, 24 సిమ్ కార్డులు, ఒక ఏటీఎం కార్డు, ఒక చెక్‌బుక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా 49 కేసుల్లో 163 రిఫండ్ ఆర్డర్లు పొందినట్లు, వాటి విలువ రూ.89,77,329గా ఉందని తెలిపారు. వాట్సాప్ కాల్స్ ద్వారా వచ్చిన ఫోన్లను నమ్మవద్దని, డిజిటల్ అరెస్ట్ లేనే లేదని, తెలియని నెంబర్ల నుంచి కాల్ వస్తే ఫోన్లు లిఫ్ట్ చేయవద్దని పోలీసులు కోరుతున్నారు.