WhatsApp stock trading scam: స్టాక్ ట్రేడింగ్ పేరుతో టెకీకి భారీ మోసం
ఎల్‌బీనగర్‌కు చెందిన 42 ఏళ్ల టెకీకి WhatsApp స్టాక్ ట్రేడింగ్ గ్రూప్ పేరుతో రూ.3.37 కోట్లు పోయాయి
ఐపీఓ–ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడింగ్ అంటూ నమ్మబలికారు
ఎల్‌బీనగర్‌కు చెందిన 42 ఏళ్ల టెకీకి WhatsApp స్టాక్ ట్రేడింగ్ గ్రూప్ పేరుతో రూ.3.37 కోట్లు పోయాయి. ఈ మేరకు ఆయన ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
గ్రూప్‌లోకి చేరదీసి ‘HNI అకౌంట్’ పేరుతో డబ్బులు తీసుకున్నారు
ఖర్మన్ఘాట్, మాధవ నగర్ ప్రాంతంలో ఉండే కిరణ్‌కుమార్‌ను ఆరోహి అనే మహిళ 305 Stock Market News అనే WhatsApp గ్రూప్‌లో ఆగస్టు 20న చేర్చింది. అందులో ఇన్‌స్టిట్యూషనల్ స్టాక్, ఐపీఓ ట్రేడింగ్‌తో అధిక లాభాలు వస్తాయంటూ వరుస పోస్టులు వచ్చాయి. దాదాపు 20 రోజులు గ్రూప్ ని గమనించిన కిరణ్, సెప్టెంబర్ 22న ఆరోహిని సంప్రదించాడని ఫిర్యాదులో తెలిపారు.
తరువాత ఆరోహి, శివ్ సహగల్ కలిసి ఒక లింక్ ద్వారా Nuvama అనే యాప్ డౌన్‌లోడ్ చేయించి, గూగుల్ ఫారమ్‌లో వివరాలు నమోదు చేయాలని చెప్పారు. ఇన్‌స్టిట్యూషనల్ స్టాక్‌లు, ఓటీసీ ట్రేడ్స్, ఐపీఓ కొనుగోళ్ల కోసం HNI అకౌంట్ సృష్టిస్తున్నామని ఆరోహి నమ్మబలికారన్నారు. ఐదు నెలల ఫేజ్‌లో 850% లాభం వస్తుంది, లాభంపై 20% సర్వీస్ ఫీ చెల్లించాల్సి ఉంటుందని ఆరోహి చెప్పిందని తెలిపారు.
50 రోజుల్లో రూ.3.49 కోట్లు బదిలీ
సెప్టెంబర్ 23న మొదటగా రూ.50 వేల్ని NEFT ద్వారా పంపగా, వెంటనే లాభం చూపించిందని కిరణ్ తెలిపారు. అనంతరం “ఓటీసీ ట్రేడ్స్‌కు పెద్ద మూలధనం అవసరం” అని ఒత్తిడి చేయడంతో 50 రోజుల్లో కలిపి రూ.3,49,20,004ను పలు కంపెనీలు, ట్రస్టుల ఖాతాలకు బదిలీ చేశాడు. డ్యాష్‌బోర్డ్‌లో రూ.28.52 కోట్లు లాభం చూపించడంతో ప్లాట్‌ఫాం నిజమేనని అనుకున్నాడు. మధ్యలో ఓ సారి రూ.12 లక్షలు విత్‌డ్రా కూడా చేశాడు.
విత్‌డ్రా అడ్డుకుని ‘సర్వీస్ ఫీ’ పేరుతో మరో డిమాండ్
నవంబర్ 10న మరోసారి విత్‌డ్రా చేయగా 20% సర్వీస్ ఫీ అడిగారని, మాట్లాడి 10%కి ఒప్పించుకుని రూ.30 లక్షలు పంపాడని తెలిపారు. తరువాత “లోన్ అడ్జస్ట్మెంట్” వంటి పేర్లతో మరిన్ని డిమాండ్లు చేస్తూ విత్‌డ్రాను ఆపేశారు. అప్పుడే అనుమానం వచ్చిందని ఆయన చెప్పారు.
NCRPలో ఫిర్యాదు; కేసు నమోదు
నవంబర్ 14న నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. మొత్తం రూ.3,37,20,004 నష్టం జరిగిందని కిరణ్ పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసి, ట్రాన్సాక్షన్ ట్రయిల్స్, లబ్ధిదారుల ఖాతాలు, WhatsApp గ్రూప్‌కు సంబంధించిన డిజిటల్ లింకులను పరిశీలిస్తోంది.