Cyber Crime : ఆదమరిస్తే.. బ్యాంకు ఖాతా ఖాళీ.. సైబర్ నేరగాళ్లు ఏ రూపంలో వస్తున్నారో తెలుసా?

ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఎంతగా అంటే.. అమాయకులను వలలో వేసుకుని నేరగాళ్లు ఏ ఎత్తుగడతో వస్తారో తెలియదు

Update: 2025-11-09 07:23 GMT

ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఎంతగా అంటే.. అమాయకులను వలలో వేసుకుని నేరగాళ్లు ఏ ఎత్తుగడతో వస్తారో తెలియని పరిస్థితి. మన దైనందిన జీవితంలోకి కూడా తొంగి చూస్తూ డబ్బులు కొల్లగొడుతున్నారు. భయపెట్టి కొందరిని.. ఆశచూపి మరికొందరిని ఇలా... అదను చూసి తమ వలలోకి లాక్కుంటున్నారు. మొన్నటి వరకూ డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి వృద్ధుల నుంచి అమాయకుల నుంచి లక్షలు దోచుకున్నారు. ఇక దానిపై ప్రభుత్వం ప్రచారం విపరీతంగా చేసే సరికి.. మరొక దారి వెతుక్కున్నారు. అనేక మార్గాల ద్వారా మన ముంగిటకు వచ్చి బ్యాంకులో ఉన్న నగదును ఎత్తుకెళ్లిపోవడంలో ఆరితేరిపోయారు. సైబర్ నేరాలపై ఎంత అవగాహన ప్రభుత్వాలు కల్పిస్తున్నా ఏదో ఒక మార్గంలో వచ్చి దోచుకుని వెళ్లిపోతున్నారు.

గత నెలలో నమోదయిన...
సోషల్ మీడియాలో పెట్టుబడుల పేరుతో, ఫోన్ కాల్స్, ఫేక్ యాప్‌లు, మెసేజ్ లింక్‌ల ద్వారా ప్రజల బ్యాంక్ వివరాలను సేకరించి డబ్బులు దోచుకుంటున్నారు. రోజు రోజుకు సైబర్ నేరాలు ఎక్కువవడంతో సైబర్ క్రైమ్ పోలీసులు వాటిపై ఫోకస్ పెట్టారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే అక్టోబర్‌ నెలలో సైబర్‌ నేరాలకు సంబంధించి భారీగా కేసులు నమోదు అయ్యాయి. వీటిని ఛాలెంజ్‌గా తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. వివిధ రాష్ట్రాల్లో గాలించి మరీ సైబర్ కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 55 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 107 కోట్ల రూపాయలను రికవరీ చేయగలిగారు. సాంకేతిక పరిజ్ఞానంతో వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
107 కోట్ల రూపాయల రికవరీ...
గత నెలలో సైబర్ నేరాలకు సంబంధించి 196 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా 55 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి నగదు కోల్పోయిన బాధితులకు వారి సొమ్మును తిరిగి అప్పజెప్పారు. దాదాపు 66 లక్షల రూపాయలను బాధితులకు అందజేశారు. అరెస్ట్ అయిన 55 నిందితులపై దేశవ్యాప్తంగా 136 కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఎనిమిది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో ఎక్కువ శాతం ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వారని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి సెల్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రజలు తెలియని ఫోన్లు వస్తే ఎక్కువగా వారితో మాట్లాడవద్దు. అలాగే తెలియని యాప్ ల జోలికి వెళ్లి ఆడుకుంటే వారు బీ బ్యాంకు ఖాతాను లూటీ చేస్తారు. అందుకే కేవలం సైబర్ క్రైమ్ పోలీసుల పనే కాదు.. ప్రజలు కూడా నిరంతరం అప్రమత్తంగా ఉన్నప్పుడే సైబర్ నేరాలకు చెక్ పడుతుందని చెప్పవచ్చు.
ఐదు రాష్ట్రాల్లో...
ఇక తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐదు రాష్ట్రాల్లో ఆపరేషన్ చేపట్టి 81 మందిని అరెస్ట్ చేశారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై దేశ వ్యాప్తంగా 754 కేసులున్నాయి. మొత్తం 95 కోట్ల రూపాయల నగదును లూటీ చేశారు. ఇందులో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి నుంచి కోట్ల రూపాయల నగదుతో పాటు సెల్ ఫోన్లు, సిమ్ కార్డులను కూడా సీజ్ చేశారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న నగదును ప్రయారిటీ పద్ధతిలో బాధితులకు సొమ్ము అప్పగించనుంది. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.


Tags:    

Similar News