'Dubai Prince' investment scam: 'దుబాయ్ ప్రిన్స్' మోసం, మహిళకు రూ.12.57 లక్షలు ఎగనామం
ఆన్‌లైన్‌లో పరిచయం.. నమ్మకంతో డబ్బులు బదిలీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు
హైదరాబాద్: గచ్చిబౌలికి చెందిన రిటైర్డ్ పోస్టల్ అసిస్టెంట్ ఒకరిని దుబాయ్ ప్రిన్స్‌గా నటించిన సైబర్ మోసగాడు రూ.12.57 లక్షలు మోసం చేశాడు. పెట్టుబడుల పేరుతో లాభాలు వస్తాయని నమ్మబలికాడు. బాధితురాలి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం, కే.శ్రావంతి(38) అనే బ్యాంకు ఉద్యోగి తన తల్లి కే.పద్మావతిపేరిట ఫిర్యాదు చేసింది. పద్మావతి చెవిటి మూగవైకల్యం కలిగిన మహిళ. ఆమె ఫోన్ చెక్ చేసినప్పుడు యూకే నంబర్ల (+44 7594 802213, +44 7748 406848) నుంచి వచ్చిన అనుమానాస్పద చాట్స్ గమనించిందని తెలిపారు.
దుబాయ్ ప్రిన్స్‌గా నటించి నమ్మబలికాడు
‘హమాజ్’ పేరుతో పరిచయమైన ఆన్‌లైన్ మోసగాడు తాను దుబాయ్ ప్రిన్స్ అని, భారత్‌లో విమానాశ్రయంలో చిక్కుకుపోయానని చెప్పాడు. తినడానికి, కస్టమ్స్ క్లియరెన్స్ కోసం డబ్బులు అవసరమని కోరాడు. నమ్మిన పద్మావతి వివిధ బ్యాంకు ఖాతాలకు, ఫోన్‌పే నంబర్లకు డబ్బులు పంపించింది.
దాదాపు రెండు నెలలలో పద్మావతి మొత్తం రూ.12,75,527 బదిలీ చేసింది. అందులో కేవలం రూ.17,782 మాత్రమే తిరిగొచ్చాయి. కుమార్తె హెచ్చరించినా, మోసగాడు ‘మునుపటి డబ్బులు రికవరీ అవుతాయి’ అంటూ మరోసారి చెల్లింపులు చేయమని ఒత్తిడి చేశాడు.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మోసం, సైబర్ నేరాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఉపయోగించిన బ్యాంకు ఖాతాలు, ఫోన్ నంబర్లను ట్రేస్ చేస్తున్నారు. పెద్దవారు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా వచ్చే ఇలాంటి మోసాలకు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.