Online Trading Scam: రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్‌కు ₹20.32 లక్షలు మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు
వాట్సాప్ గ్రూప్ నుంచి నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ వరకు దారితీసిన మోసగాళ్లు ఐపీఓ పేరుతో అదనపు చెల్లింపులు కోరడంతో బయటపడిన మోసం
హైదరాబాద్: ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసంతో రూ.20.32 లక్షలు కోల్పోయిన ఘటన మెడ్చల్–మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలో చోటుచేసుకుంది. 61 ఏళ్ల రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ శైలేంద్ర రావు జోషి ఈ మోసం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ వెబ్‌సైట్, వాట్సాప్ గ్రూప్ల ద్వారా మోసం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో ఐపీఓ చెల్లింపుతో సహా మొత్తం ₹20.32 లక్షలు బదిలీ చేసినట్లు తెలిపారు.
వాట్సాప్ గ్రూప్ నుంచి మోసం మొదలు
జనవరి 16, 2024న “6 NSE Road to Wealth” అనే వాట్సాప్ గ్రూప్‌లో జోషిని చేర్చారు. ట్రేడింగ్ నైపుణ్యాలు పెంపొందించడమే ఆ గ్రూప్ ఉద్దేశమని ప్రవీణ్ పటేల్ అనే వ్యక్తి తెలిపారు. పటేల్ ఆ గ్రూప్ని నడిపేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం క్రిస్ హార్పర్ అనే మరో వ్యక్తి తనను ఫైనాన్షియల్ మేనేజర్‌గా పరిచయం చేసుకొని, భారతీయ, అమెరికా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు సహకరిస్తానని చెప్పాడు. హార్పర్ https://m.tencorepartners.net అనే ట్రేడింగ్ వెబ్‌సైట్‌లో ఖాతా తెరవమని చెప్పి, ఫోన్ నంబర్‌తో యూజర్ ఐడీ సృష్టించాడు.
వరుసగా నిధుల బదిలీ
హార్పర్ సూచన మేరకు అక్టోబర్ 29, 2025న జోషి ₹2.5 లక్షలు నిజామాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో ఉన్న ఉమైర్ ఎగ్ ట్రేడర్స్ ఖాతాకు పంపారు. తదుపరి రోజు అదే ఖాతాకు ₹15 లక్షలు, అక్టోబర్ 31న వసాయిలోని యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఏజీ ట్రేడర్స్ ఖాతాకు ₹2.82 లక్షలు బదిలీ చేశారు. “బ్లాక్ ట్రేడ్స్, అప్‌పర్ సర్క్యూట్ స్టాక్స్ ద్వారా లాభాలు వస్తున్నాయి, సులభంగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు” అంటూ హార్పర్ నకిలీ లాభాలు చూపించాడు. తరువాత “జయేష్ లాజిస్టిక్స్” ఐపీఓలో 2,000 షేర్లకు ₹2.5 లక్షలు పెట్టుబడి పెట్టమని చెప్పాడు.
అనుమానం కలిగిన బాధితుడు
కొద్దిరోజుల్లోనే అదనపు చెల్లింపులు చేయాలని హార్పర్ ఒత్తిడి చేయడంతో జోషికి అనుమానం వచ్చింది. నవంబర్ 1న ఐపీఓ బకాయిలు క్లియర్ చేయకపోతే ట్రేడింగ్ నిలుస్తుందని చెప్పి, సంజయ్ ఎంటర్‌ప్రైజెస్ (బ్యాంక్ ఆఫ్ బరోడా, ప్యూరే పాండే బ్రాంచ్) ఖాతాకు మరింత మొత్తాన్ని పంపాలని కోరాడు. జోషి అనుమానం తో పరిశీలించగా, వెబ్‌సైట్ నకిలీదని, లాభాలు అన్నీ కృత్రిమమని తెలిసింది. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసి, వెబ్‌సైట్ నిర్వాహకులు, డొమైన్ యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదులో గ్రీన్‌ఏంజెల్స్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్, దివ్యా కన్‌స్ట్రక్షన్ కంపెనీలపై కూడా అనుమానం వ్యక్తం చేశారు. అక్టోబర్ 1, 2025న సైబర్‌క్రైమ్ పోర్టల్‌లో (అభ్యర్థన నంబర్ 33711250051732) ఫిర్యాదు నమోదు చేశారు.
ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు భా.న్యా.స. 318(4), 319(2), 336(3), 338, 340(2) సెక్షన్లతోపాటు న్యాయసంహిత 3(5) సెక్షన్, ఐటీ చట్టం 66(D) ప్రకారం కేసు నమోదు చేశారు.