హైదరాబాద్‌లో టెకీకి ₹1.26 కోట్లు మోసం

చందానగర్‌ ఇంజనీర్‌ ఫిర్యాదు AI ట్రేడింగ్ పేరుతో మోసగాళ్ల వల

Update: 2025-11-20 13:01 GMT

చందానగర్‌ ఇంజనీర్‌ ఫిర్యాదు

AI ట్రేడింగ్ పేరుతో మోసగాళ్ల వల

టెలిగ్రామ్‌ ద్వారా ఆహ్వానం

చందానగర్‌కు చెందిన 51 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రాజేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా AI స్మార్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో అకౌంట్‌ ఓపెన్‌ చేయాలని గత సెప్టెంబర్‌ 16న టెలిగ్రామ్‌ ద్వారా వచ్చిన ఆహ్వానం నమ్మి గ్రూప్లో చేరినట్లు తెలిపారు. ఆహ్వానం పంపిన మహిళ తనను భగ్యశ్రీగా పరిచయం చేసుకుందని, ఆమె టెలిగ్రామ్‌ ID, మొబైల్‌ నంబర్లు కూడా ఇచ్చినట్లు వివరించారు.

భగ్యశ్రీ తనను గోకుల్‌ లారోయా సహాయకురాలని చెప్పిందని, ఆయనను “CEO ఆఫ్‌ ఏషియా, కో-హెడ్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఈక్విటీస్‌” అని పరిచయం చేసినట్లు రాజేశ్‌ తెలిపారు.

వాట్సాప్‌ గ్రూపుల్లో ‘ట్రేడింగ్’

భగ్యశ్రీ సూచనల మేరకు 99-02-విజ్డమ్‌ ఫైనాన్స్, 99-01-విజ్డమ్‌ ఫైనాన్స్ పేరున్న వాట్సాప్‌ గ్రూపుల్లో చేరారని చెప్పారు. వారికి ఇచ్చిన వివరాలతో m.mostan-n.com పోర్టల్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేశారని తెలిపారు. ప్రతి డిపాజిట్‌ కోసం “మోర్గాన్‌ స్టాన్లీ కస్టమర్‌ సర్వీస్‌”ను సంప్రదించాలని చెప్పి, వారు ఇచ్చిన బ్యాంక్‌ ఖాతాలకు IMPS, NEFT, RTGS మార్గాల ద్వారా డబ్బులు పంపించారని ఫిర్యాదు పేర్కొంది.

వేర్వేరు ఖాతాలకు ₹1.26 కోట్లు బదిలీ

కస్టమర్‌ సర్వీస్‌ పేరుతో ఇచ్చిన వివిధ ఖాతాలకు మొత్తం ₹1.26 కోట్లు పంపినట్లు రాజేశ్‌ తెలిపారు. ఎక్కువగా IMPS, NEFT చేశారని, రెండు RTGS‌లుగా ₹30 లక్షలు చొప్పున పంపారన్నారు. ₹7 కోట్లు విత్‌డ్రా చేయడానికి ఇది తప్పనిసరి అని వారు చెప్పినట్లు తెలిపారు.

రోజూ గ్రూపుల్లో స్టాక్‌ ఎంట్రీలు, సైజులు వంటి “ఇన్‌స్ట్రక్షన్లు” ఇస్తారని, పోర్టల్‌లో అన్ని ట్రేడ్లు లాభాలుగా చూపించేవారని అన్నారు.

‘డిస్కౌంటెడ్‌ IPOలు’ – నకిలీ లాభాలు

తరువాత టాటా క్యాపిటల్‌, కనరా HSBC లాంటి “డిస్కౌంటెడ్‌ IPOలు”లో పెట్టుబడి పెట్టమని చెప్పారని FIRలో ఉంది. దీంతో అకౌంట్‌ బ్యాలెన్స్‌ ₹8.9 కోట్లుగా కనిపించేదని పేర్కొన్నారు. అదనపు మొత్తం విత్‌డ్రా చేయాలని సూచించడంతో ఆయనను VIP కోర్‌ గ్రూప్‌లో చేర్చారని తెలిపారు.

₹99.44 లక్షల ‘అడ్వాన్స్‌ ట్యాక్స్‌’ డిమాండ్‌

విత్‌డ్రా కోరినప్పుడు SEBI, IT డిపార్ట్‌మెంట్‌కి నెలసరి రిపోర్టింగ్‌ కోసం అడ్వాన్స్‌ ట్యాక్స్‌ ₹99,44,970 చెల్లించాలంటూ కస్టమర్‌ సర్వీస్‌ డిమాండ్‌ చేసినట్లు రాజేశ్‌ తెలిపారు. ట్యాక్స్‌ ఫైలింగ్‌ సమయంలో చెల్లించాలి అని అభ్యంతరం తెలిపినా ఒప్పుకోలేదన్నారు.

తన వద్ద అంత మొత్తం లేకపోవడంతో భగ్యశ్రీ 5% ఫీజుతో ₹40 లక్షలు ఏర్పాటు చేస్తానని చెప్పి, ఆయనను మరో ₹60 లక్షలు రెండు బ్యాంక్‌ RTGS ద్వారా (నవంబర్‌ 10 – ఆక్సిస్‌, నవంబర్‌ 11 – హెచ్‌డీఎఫ్‌సీ) పంపించుకున్నట్లు పేరుకున్నారు .

పేమెంట్‌ రాకపోవడంతో అనుమానం

నవంబర్‌ 13 మధ్యాహ్నం 3.30లోపే క్రెడిట్‌ అవుతుందని చెప్పినా డబ్బు రాకపోవడంతో రాజేశ్‌ పలుమార్లు సంప్రదించగా టెక్నికల్‌ సమస్య, లిమిట్లు, ఖాతా లోపాలు అంటూ తప్పించుకున్నారని తెలిపారు. బ్యాంక్‌ను సంప్రదిస్తే అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని తెలిసిందని చెప్పారు.

తర్వాత మోసగాళ్లు కొత్త ఛానెల్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయాలి అంటూ మరో ₹10 లక్షలు కూడా అడిగారని ఫిర్యాదులో తెలిపారు.

నకిలీ పోర్టల్‌ – మోసం తెలిసిన తర్వాత ఫిర్యాదు

ఇవన్నీ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆయన స్వతంత్రంగా పరిశీలించగా, పోర్టల్‌ పూర్తిగా నకిలీదని, ₹9.13 కోట్లు వర్చువల్‌ బ్యాలెన్స్‌ గా చూపించినా ఒక్క లావాదేవీ నిజం కాదని తెలుసుకున్నట్లు. తన డబ్బు తిరిగి రాలేదని తెలిపారు.

ఈ మోసం చేసిన డొమైన్‌, వాట్సాప్‌, టెలిగ్రామ్‌ ఐడీలపై, డబ్బు వెళ్లిన బ్యాంక్‌ ఖాతాదారులపై చర్యలు తీసుకోవాలని రాజేశ్‌ పోలీసులను కోరారు.

Tags:    

Similar News