Gold Rates Today : బంగారం ధరలు ఇక తగ్గవట.. కొనుగోలు చేయడం ఇప్పుడే మంచిదట

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది

Update: 2025-07-12 03:04 GMT

బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న మార్కెట్ నిపుణుల హెచ్చరికలు నిజమవుతున్నాయి. లక్ష రూపాయలుకు పది గ్రాముల బంగారం ధర రెండు సార్లు టచ్ చేసి మళ్లీ తగ్గినప్పటికీ వినియోగదారులు ఆశించినంత స్థాయిలో ధరలు తగ్గలేదు. గ్రాముకు రూపాయి చొప్పున అప్పుడప్పుడు తగ్గుతున్నప్పటికీ పెరిగిన ధరలతో పోల్చకుంటే తగ్గిన ధరలు చాలా తక్కువ మాత్రమేనని చెప్పాలి. ఈ ఏడాది బంగారం పెరిగినంతగా గతంలో ఎన్నడూ ధరలు పెరగలేదని వ్యాపారులే అంగీకరిస్తున్నారు. అందుకే అమ్మకాలు భారీగా తగ్గాయని, గతంతో పోల్చుకుంటే విక్రయాలు డెబ్భయి శాతం వరకూ పడిపోయినట్లు జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం చెబుతుంది.

శ్రావణమాసంలోనూ...
ప్రస్తుతం ఆషాఢమాసం నడుస్తుంది. అయినా సరే ధరలు మాత్రం తగ్గడం లేదు. డిమాండ్ లేకపోయినా, కొనుగోళ్లు సక్రమంగా జరగకపోయినప్పటికీ బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇక శ్రావణ మాసం ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దాదాపు నాలుగు నెలల పాటు మంచి ముహూర్తాలున్నాయి. వరసగా పెళ్లిళ్లు జరుగుతాయి. పెళ్లిళ్లకు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అందుకే ఈ ఏడాది చివరి వరకూ బంగారం ధరలు తగ్గే ప్రసక్తి ఉండదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. డిసెంబరు నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల వరకూ మంచి ముహూర్తాలు లేకపోవడంతో ఇక ధరలు అదుపు చేయడం ఎవరి వల్లా కాదు.
స్వల్పంగా పెరిగినా...
దక్షిణ భారత దేశంలో ఎక్కువగా కొనుగోలు చేసే బంగారం క్రయ విక్రయాలు గత కొద్ది రోజులుగా నిలిచిపోయాయి. కొనుగోలు చేయాలని వస్తున్న వారు కూడా ధరలను చూసి వెనుదిరుగుతున్నారని బంగారు దుకాణాల వ్యాపారులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదయిన ప్రకారం ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,760 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 99,010లుగా నమోదయింది. కిలో వెండి ధర 1,21,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News