Telangana : తెలంగాణకు మరో దిగ్గజ కంపెనీ.. నిరుద్యోగులకు తీపికబురు

తెలంగాణ లో అమెరికాకు చెందిన సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ప్రపంచంలో పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎల్ లిల్లీ కంపెనీ పెట్టుబడులు పెట్టనుంది

Update: 2025-10-07 02:07 GMT

తెలంగాణ లో అమెరికాకు చెందిన సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ప్రపంచంలో పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎల్ లిల్లీ కంపెనీ దేశంలోనే మొదటి సారిగా తమ మాన్యుఫాక్షరింగ్ యూనిట్ ను హైదరాబాద్ లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఈ యూనిట్ ఏర్పాటుకు ఒక బిలియన్‌ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు కంపెనీ ముందుకొచ్చింది. దీంతో ఎల్ లిల్లీ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా తమ ఔషధాల సరఫరా సామర్థ్యాన్ని విస్తరించనుంది. ఎల్ లిల్లీ కంపెనీ తమ విస్తరణ ప్రణాళికలు, తెలంగాణలో భారీ పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. వేల సంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా లభించనున్నాయి.

అధునాతన తయారీ యూనిట్...
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో దేశంలో అధునాతన తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ లో ఏర్పాటు చేసే మాన్యుఫాక్షరింగ్, క్వాలిటీ హబ్ తమకు అత్యంత కీలకమైందని కంపెనీ ప్రకటించింది. ఇక్కడి నుంచే దేశంలో ఉన్న ఎల్ లిల్లీ కాంట్రాక్ మాన్యుఫాక్షరింగ్ నెట్ వర్క్, సాంకేతిక పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణ, అధునాతన సాంకేతిక సామర్థ్యాలను అందించనుంది. కొత్త హబ్ ఏర్పాటుతో మన రాష్ట్రంతో పాటు దేశంలో ఫార్మా రంగంలో పని చేస్తున్న వేలాది మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వీలైనంత తొందరలోనే కెమిస్టులు, అనలిటికల్ సైంటిస్టులు, క్వాలిటీ కంట్రోల్, మేనేజ్మెంట్ నిపుణులు, ఇంజనీర్ల నియామకాలు చేపట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఔషధాల తయారీలో...
అమెరికాకు చెందిన ఎల్ లిల్లీ కంపెనీకి 150 ఏళ్లుగా ప్రపంచ వ్యాపంగా ఔషధాల తయారీ రంగంలో విశేషమైన వైద్య సేవలను అందిస్తుంది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ అధునాతన యూనిట్ తెలంగాణను అత్యాధునిక ఆరోగ్య పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెట్టనుంది. ప్రధానంగా డయాబెటిస్‌, ఓబెసిటీ, ఆల్జీమర్‌, క్యాన్సర్‌, ఇమ్యూన్ వ్యాధులకు సంబంధించిన ఔషధాలు, కొత్త ఆవిష్కరణలపై ఈ కంపెనీ పని చేస్తుంది. ఇండియాలో ఇప్పటికే గురుగ్రామ్, బెంగుళూరులో ఎల్ లిల్లీ కంపెనీ కార్యకలాపాలున్నాయి. హైదరాబాద్ లో ఈ ఏడాది ఆగస్టు లోనే గ్లోబల్ కెపాబులిటీ సెంటర్ ను ప్రారంభించింది.


Tags:    

Similar News