Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణమే.. దర్శనం సులువే
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న చంద్రగ్రహణం కావడంతో తిరుమలకు భక్తులు తక్కువ సంఖ్యలో తరలి వచ్చారు.అయితే క్యూ లైన్ లో ఉన్నవారందరికీ దర్శనం కల్పించిన తర్వాత ఆలయ ద్వారాలను మూసివేశారు.ఈరోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగానే ఉంది. గత కొన్ని రోజులుతో పోలిస్తే తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిందనే చెప్పాలి. చంద్ర గ్రహణం సందర్భంగా తిరుమల ఆలయాన్ని ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ మూసివేసిన సంగతి తెలిసిందే.
యధావిధిగా అన్నప్రసాద వితరణ...
అయితే శ్రీవారి ఆలయంలో మంగళవారం రాత్రి 8 గంటల నుంచిభక్తులకు దర్శనం ప్రారంభమైంది. మధ్యాహ్నం 3.26 నుండి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్ర గ్రహణం ఉన్న కారణంగా ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉదయం 9 గంటలకు ఆలయ తలుపులు మూశారు. దాదాపు 10.30 గంటల అనంతరం మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచారు. ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేసిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్సును 7.30 గంటలకు తెరిచారు. వంటశాల శుద్ధి అనంతరం రాత్రి 8.30 గంటల నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది. అదే విధంగా లడ్డు కౌంటర్లు కూడా పునః ప్రారంభమయ్యాయి.
నాలుగు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది నుంచి పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేకదర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 27,300 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 9,985మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.46కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.