Ys Jagan : వైసీపీలో వంద మంది నేతలు దూరం... వారందికీ జగన్ వార్నింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండే నేతలను దూరం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి

Update: 2025-09-15 08:51 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండే నేతలను దూరం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో ఓటమి పాలయి పదిహేను నెలలు గడుస్తున్నా ఇంకా చాలా మంది నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. వీరందరి పేర్లను పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి తెప్పించుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ యాక్టివ్ గాఉన్న నేతలు ఎవరు? దూరంగా వ్యవహరిస్తున్న నేతలు ఎవరన్న దానిపై జాబితా జగన్ కు చేరినట్లు తెలిసింది. దాదాపు వంద మందికిపైగానే నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని తెలిసి జగన్ పార్టీ ముఖ్య నేతల ముందు ఇటీవల అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

కటువుగానే హెచ్చరికలు...
వారందరికీ తాను చెప్పినట్లుగా చెప్పాలని, దూరంగా ఉండదలచుకుంటే నిక్షేపంగా పార్టీ నుంచి వెళ్లిపోవచ్చన్న సందేశం పంపాలని నేతలకు చెప్పాలని జగన్ సూచించారట. ఈ బాధ్యతను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించినట్లు పార్టీ లో చర్చ జరుగుతుంది. పార్టీ కష్టకాలంలో దూరంగా ఉండే వారిని తనతో పాటు కార్యకర్తలు కూడా మరోసారి దగ్గరకు తీయరని జగన్ కటువుగానే చెప్పినట్లు తెలిసింది. ఓటమిపాలయ్యామని, గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికే టిక్కెట్ ఇస్తామని భావిస్తే అది భ్రమ అవుతుందని, నేతలను మార్చేందుకు కూడా తాను వెనకాడబోమని, అవసరమైతే మరో టర్మ్ అధికారానికి దూరంగా ఉంటాను కానీ, ఇటువంటి నేతలను స్పేర్ చేయనని సీరియస్ గానే హెచ్చరికలు పంపినట్లు తెలిసింది.
ప్రజా సమస్యలపై....
రాష్ట్రంలో యూరియా కొరత సమస్య ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గాల్లో రైతులతో కలసి ఆందోళనలో పాల్గొనకపోవడం, మెడికల్ కళాశాల ప్రయివేటీకరణపై పెదవి విప్పకపోవడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించిన జగన్ కొందరు నేతలు వారు సీనియర్లయినా పక్కన పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. అందులో నలుగురు సీనియర్ నేతలు కూడా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమ వారసులు ఆ యా నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని వారు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా వారసులను కూడా అనుమతించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పినట్లు పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు అన్నారు. దీంతో రానున్న కాలంలో నేతలందరూ బయటకు వస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.




Tags:    

Similar News