Ys Jagan : జగనూ.. కేసీఆర్ తో పోటీ పెట్టుకుంటే ఎలా? ఆయన బలం ఏంటి? నీ బలగం ఎక్కడ?
వైఎస్ జగన్ రాజకీయాలను ఇంకా సీరియస్ గా తీసుకోవడం లేదు. పొరుగు రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆయన పోటీ పడుతున్నారు
వైఎస్ జగన్ రాజకీయాలను ఇంకా సీరియస్ గా తీసుకోవడం లేదు. పొరుగు రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆయన పోటీ పడుతున్నారు. కేసీఆర్ కు కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, అల్లుడు హరీశ్ రావులు ఉన్నారు. కానీ జగన్ కు దగ్గర వాళ్లు ఎవరూ లేరు. ఎవరూ అధికార పార్టీపై విరుచుకుపడే అవకాశం కనిపించడం లేదు. బంధువులందరూ దాదాపుగా దూరమయ్యారు. అదే సమయంలో నేతలు కూడా వరస అరెస్ట్ లతో బయటకు రావడానికి కూడా భయపడిపోతున్నారు. ఈ సమయంలో జగన్ తప్ప మరొకరు ఎవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు అవకాశం లేదు. కానీ జగన్ నెలలో రెండు రోజులు ఏపీలో ఉంటే మిగిలిన రోజులు కర్ణాటకలో కాలం వెళ్లదీస్తున్నారు.
కేసీఆర్ కు అండగా...
కేసీఆర్ కు అంటే బలమైన నేతల మద్దతు ఉంది. ఆయన బయటకు వచ్చినా, ఫాం హౌస్ కు పరిమితమయినా పెద్దగా నష్టం వాటిల్లదు. ఎందుకంటే ప్రతి రోజూకేటీఆర్, హరీశ్ రావు, కవితలతో పాటు నేతలు కూడా బయటకు వచ్చి తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతున్నారు. అందువల్ల కేసీఆర్ ఫాం హౌస్ లో ఉన్నా, లేక బయటకు రాకపోయినా పెద్దగా రాజకీయంగా నష్టమేమీ ఉండదు. వారే పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. కేసీఆర్ కేవలం డైరెక్షన్ ఇస్తే సరిపోతుంది. క్యాడర్ లో భరోసా నింపేందుకు వారు చాలు. అందుకే కేసీఆర్ దాదాపు రెండేళ్ల నుంచి బయటకు రాకుండా బిందాస్ గా ఉన్నప్పటికీ పార్టీని గాడితప్పనివ్వకుండా కంట్రోల్ చేయగలగుతున్నారు.
అందరూ దూరం కావడంతో...
కానీ జగన్ విషయంలో అది పూర్తిగా రివర్స్. తల్లి...చెల్లి దూరమయ్యారు. సతీమణి భారతి రాజకీయాలకు దూరంగా ఉంటారు. ఇక సన్నిహితులైన విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసులు రెడ్డి లాంటి వాళ్లు పార్టీని వీడివెళ్లిపోయారు. ఇక లింగు లింగు మంటూమిగిలింది వైవీ సుబ్బారెడ్డి ఒక్కడే. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లు కూడా బయటకు వచ్చి విమర్శలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. వాళ్లే పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నారు. వారి సమస్యలు వారికి ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ క్యాడర్ కు భరోసా ఇచ్చేందుకు వచ్చే సాహసం ఎవరు చేయలేకపోతున్నారు. ఎక్కడకక్కడ నేతలు బయటకు రావాలన్నా కేసులు భయపెడుతున్నాయి.
క్యాడర్ లో భరోసా నింపాలంటే...?
ఈ నేపథ్యంలో జగన్ మాత్రమే బయటకు రావాల్సి ఉంది. జగన్ బయటకు వచ్చి క్యాడర్ తో మమేకం అయితే తప్ప పరిస్థితుల్లో మార్పు రాదని అంటున్నారు. అంతే తప్ప ఎప్పుడో వచ్చి తాను తిరిగి ఫ్యాన్ ను గిరాగిరా తిప్పేస్తానని భావిస్తుంటే అది అత్యాశే అవుతుంది. ఎందుకంటే అప్పటికే పార్టీ క్యాడర్ కకావికలం అయిపోతుంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో కార్యకర్తలు నిరాసతతో ఉన్నారు. నిరాసక్తతతో తమ పని తాము చేసుకుని వెళుతున్నారు తప్ప పార్టీని గురించి పట్టించుకోవడం లేదు.తమకు కష్టమొచ్చినా ఆదుకుంటామని ధైర్యం చెప్పే నాధుడు లేకపోవడంతోనే క్యాడర్ లో ఒకరకమైన నిస్తేజం ఆవరించింది. మరి జగన్ ఇప్పటికైనా యాక్టివ్ అవుతారా? లేదా? అన్నది చూడాలి.