Ys Jagan : ఇంత జరుగుతున్నా జగన్ వినిపించుకోడేందమ్మా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తప్పు చేస్తున్నారన్నది ఆ పార్టీ నేతల మనోగతం

Update: 2026-02-14 09:02 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తప్పు చేస్తున్నారన్నది ఆ పార్టీ నేతల మనోగతం. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి అవమానపడినా అది పార్టీకి లాభమే జరుగుతుందని జగన్ మర్చిపోతున్నారంటున్నారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటూ మంకుపట్టిపట్టి శాసనసభను బహిష్కరించినందున ఎవరికి నష్టం? అన్న ప్రశ్న కు వైసీపీకే అన్న సమాధానం వస్తుంది. ప్రజా సమస్యలను ప్రస్తావించడం, బడ్జెట్ లో లోటు పాట్లను గుర్తించి వాటిని సభలో తెలియజేయడం వంటివి చేస్తే కొంత వరకైనా జనంలోకి వెళ్లే అవకాశముంటుంది. ఆ సందర్భంగా కూటమి సభ్యులు ఎవరైనా నోరు జారినా అది వారికే ఇబ్బంది అవుతుందని, వైసీపీకి సానుభూతి దొరుకుతుందని అంటున్నారు.

వాయిదా తీర్మానాలు ఇచ్చి...
సభలో వాయిదా తీర్మానాలు ఇవ్వడం.. విశాఖ భూముల కేటాయింపులు.. మెడికల్ కళాశాలల ప్రవేటికీరణ, పింఛన్ల పంపిణీలో లోపాలు, అన్నదాత సుఖీభవ పథకాన్ని సకాలంలో అందించకపోవడం, తల్లికి వందనం పథకంలో కోత పెట్టడంతో పాటు అనేక కుటుంబాలను తొలగించడం, 1.40 లక్షల మందికి పింఛన్ల నోటీసులు ఇవ్వడం వంటి అంశాలను వాయిదా తీర్మానాలుగా ఇస్తే స్పీకర్ తిరస్కరించవచ్చు. కానీ దాని వల్ల కూటమి ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకత పెంచుకుంటారని, కానీ తనతో పాటు ఎమ్మెల్యేలను కూడా సభకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటే వచ్చే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అన్న ప్రశ్న పార్టీ సీనియర్ నేతల నుంచి బాగా వినపడుతుంది.
వైసీపీపైనే వ్యతిరేకత...
స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసనను తెలియజేయడం, మార్షల్ చేత గెంటి వేయించుకోవడం, సస్పెన్షన్లు వంటివి ఉంటే కదా? ఏదైనా ప్రయోజనం దక్కేది? అలా కాకుండా బయట కూర్చుని ఉంటే వైసీపీపైనే ఎక్కువ వ్యతిరేకత వస్తుందన్న అభిప్రాయం సొంత పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. కానీ జగన్ మాత్రం పదకొండు మంది ఎమ్మెల్యేలతో శాసనసభకు వెళ్లేందుకు సిద్ధంగా లేరు. గవర్నర్ ప్రసంగం రోజు వెళ్లి వాకౌట్ చేసి రావడం సాధారణంగా మారిపోయింది. దీనివల్ల ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేదంటున్నారు. ప్రజల తరుపున ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం .. ప్రతిపక్ష హోదా కోసం సభకు వెళ్లకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయని చెబుతున్నా జగన్ వినిపించుకోవడం లేదంటున్నారు. దీంతో వైసీపీ నేతలు బయటకు చెప్పలేక.. బాధను దిగమింగలేక.. సన్నిహితుల వద్ద వాపోతున్న మాటలివి.



Tags:    

Similar News