TDP : పాపం కృష్ణా, గుంటూరు జిల్లా కమ్మ నేతలకు ఇక ఛాన్స్ లేదా?
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుంది. అయితే ప్రస్తుత మంత్రి వర్గంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్నారు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుంది. అయితే ప్రస్తుత మంత్రి వర్గంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కొందరు నేతలు విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. సీనియర్ నేతలతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాకు చెందిన కమ్మ సామాజికవర్గం నేతలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ రెండు జిల్లాలకు చెందిన కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలకు కేబినెట్ లో ఐదేళ్లు అవకాశం దక్కే ఛాన్స్ లేదంటున్నారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు కావడమే మంత్రి వపదవి దక్కకపోవడానికి ప్రధాన కారణంగా చెప్పాలి.
ఐదుగురు ఉండటంతో...
ఇప్పటికే చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఐదు గురు కమ్మ సామజికవర్గం నేతలు ఉండటమే అందుకు కారణం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మంత్రులుగా నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్ లు కేబినెట్ లో ఉన్నారు. ఇందులో నలుగురు టీడీపీకి చెందిన వారు కాగా, ఒక్కరు జనసేనకు చెందిన వారు.ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ జరిగినా చంద్రబాబును తప్పిస్తే మిగిలిన నలుగురిని కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలు లేవనే చెప్పాలి. ఎందుకంటే వీరు యాక్టివ్ గా ఉండటంతో పాటు ప్రాంతాల వారీగా పట్టున్న నేతలు. రాయలసీమలో పయ్యావుల కేశవ్, గుంటూరు జిల్లాలో నాదెండ్ల మనోహర్, నారా లోకేశ్, ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్ లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
నలుగురిని తప్పించే...
ఈ నలుగురిని తప్పించే అవకాశం లేకపోవడంతో గుంటూరు జిల్లా కమ్మ సామాజికవర్గం ఎమ్మెల్యేలు ఇక మంత్రి పదవిపై ఆశ వదులకోవాల్సిందే. గుంటూరు జిల్లాలో సీనియర్ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్లున్నారు. గుంటూరు జిల్లాలో ఇప్పటికే నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్ ఉండటంతో మరొకరికి మంత్రి పదవి దక్కే అవకాశం లేదు. అందుకే వీరిలో కొందరికి మాత్రం ఏదో ఒక కేబినెట్ ర్యాంక్ పదవి దక్కే అవకాశాలున్నాయంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన కమ్మ సామాజికవర్గం ఎమ్మెల్యేలు మాత్రం ఈ దఫా కేబినెట్ లో చోటు దక్కడం కష్టంగానే ఉంది.
సీనియర్లు లేకపోవడంతో...
ఇక కృష్ణా జిల్లాలో కమ్మ సామాజికవర్గం నేతలున్నప్పటికీ వారిలో పెద్దగా సీనియర్లు లేకపోవడం కొంత కలసి వచ్చే అంశమే. గుడివాడ, గన్నవరం ఎమ్మెల్యేలు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారే. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఒకరకంగా సీనియర్ అనే చెప్పుకోవాలి. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక బీజేపీ నుంచి కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి కూడా ఆ సామాజికవర్గమే అయినా బీజేపీ కేంద్ర నాయకత్వం విస్తరణలో వీరిద్దరికీ చోటు కల్పిస్తుందని చెప్పలేని పరిస్థితి. ఇందులో కామినేని సీనియర్. సుజనా చౌదరి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. కృష్ణా జిల్లాలో బీసీ వర్గానికి చెందిన కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారధి కూడా ఉండటంతో కూటమిలోని కమ్మ సామాజికవర్గం నేతలకు కేబినెట్ లో చోటు దక్కే ఛాన్స్ లేదు.