Sajjala : మళ్లీ సజ్జల జగన్ పక్కన చేరారుగా.. యాక్టివ్ ఎందుకయ్యారో తెలుసా?
కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది కావస్తుండటంతో వైసీపీ నేతలు ఒక్కొక్కరు యాక్టివ్ అవుతున్నారు. మళ్లీ పార్టీలో కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి యాక్టివ్ అయ్యారు
కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది కావస్తుండటంతో వైసీపీ నేతలు ఒక్కొక్కరు యాక్టివ్ అవుతున్నారు. మళ్లీ పార్టీలో కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి యాక్టివ్ అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఏడాది నుంచి కొంత కామ్ గానే ఉన్నారు. ఆయనపై కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందన్న వార్తల నేపథ్యంలో ఆయన బయటకు రావడం కూడా తగ్గించారు. సకల శాఖ మంత్రిగా టీడీపీ నేతలు విమర్శించే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ చెప్పే ఆదేశాలను అమలుపర్చి నాడు టీడీపీ, జనసేనలకు టార్గెట్ అయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డిపైన కూడా అనేక కేసులు నమోదయ్యాయి. అయితే వాటిలో ముందస్తుబెయిల్ తెచ్చుకున్న సజ్జల ప్రస్తుతం బిందాస్ గా ఉన్నారు.
అనేక కేసులు నమోదవుతున్నా...
ఇక మరోవైపు వైసీపీ నేతలపై వరస కేసులు నమోదవుతున్నాయి. అనేక మంది జైలుకు వెళుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలోనూ ఆయన అటవీ భూములను ఆక్రమించారన్న ఆరోపణలపై కేసు నమోదుతో పాటు భూమిని కూడా స్వాధీనం చేసుకుంది. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, నందిగం సురేష్, కాకాణి గోవర్థన్ రెడ్డిలు అరెస్టయ్యారు. ఇందులో పోసాని ఒక్కరే బెయిల్ పై బయటకు వచ్చారు. ఇక ఏపీలో లిక్కర్ స్కామ్ కేసులో కూడా ఏడుగురు జగన్ కోటరీలో ఉన్న నాటి ముఖ్య అధికారులు అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా వదలిపెట్టే అవకాశం లేదని, గత ప్రభుత్వ హయాంలో హోంశాఖను ఆయన పరోక్షంగా నిర్వహించి తమ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారన్నఆగ్రహం కూటమి పార్టీల్లో ఉంది.
పది నెలల నుంచి మౌనంగానే...
అయినా సరే పది నెలల నుంచి మౌనంగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. సజ్జల యాక్టివ్ అవ్వడంతో ఇక నేతలు కూడా రోడ్డు మీదకు వస్తారని చెబుతున్నారు. జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం వాల్ పోస్టర్ ను కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఇక తాజాగాకాకాణితో జైలులో ములాఖత్ అయ్యారు. కాకాణి కుటుంబసభ్యులను పరామర్శించారు. అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్‌లో ఉన్న కాకాణి గోవర్థన్ రెడ్డిని పరామర్శించి ఆయనకు ధైర్యం చెప్పారు. అయితే ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతుందని, అయితే ఎవరూ దీనికి భయపడబోరని సజ్జల అనడం తో ఇక పార్టీలో మళ్లీ యాక్టివ్ అవుతారని అంటున్నారు.
ఎవరో ఒకరు అవసరం కావడంతో...
జగన్ కూడా బెంగళూరు నుంచి విజయవాడకు టూర్ వేస్తుండటంతో రాష్ట్రంలో పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకుంటారని, పార్టీ ఇచ్చే కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా సజ్జల దగ్గరుండి పర్యవేక్షిస్తారని అంటున్నారు. ఎంత మంది ఎన్ని విమర్శలు చేసినా జగన్ మాత్రం సజ్జలను దూరం చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఎవరో ఒకరు నమ్మకమైన వారు తనకు అందుబాటులో ఉండాలి. తన ఆదేశాలను అమలు చేయించే శక్తి గల వ్యక్తి జగన్ కు అవసరం. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డికి తిరిగి జగన్ తన పక్కన పెట్టుకుంటున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అయితే గతంలో మాదిరిగా పూర్తి స్థాయి కాకుండా కేవలం పార్టీ కార్యక్రమాలను అమలు చేసే బాధ్యతలను మాత్రమే జగన్ అప్పగించే అవకాశాలున్నాయంటున్నారు.