Ys Jagan : మడి కట్టుకుని కూర్చుంటే లాభం లేదు భయ్యా.. చెప్పేయాలంటున్న లీడర్లు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు బెంగళూరు నుంచి బయలుదేరి తాడేపల్లికి రానున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు బెంగళూరు నుంచి బయలుదేరి తాడేపల్లికి రానున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు వైసీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యులతో పాటు మరికొందరు కీలక నేతలు కూడా హాజరు కానున్నారు. ఇటీవల పీఏసీ కన్వీనర్ గా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు 33 మందిని సభ్యులుగా నియమించారు. సీనియర్ నేతలతో పాటు కొందరు యువనేతలకు కూడా ఇందులో చోటు కల్పించారు. వీరితో సమావేశమై పార్టీ భవిష్యత్ పై చర్చించనున్నారు. అయితే కేవలం వన్ సైడ్ మాత్రమే కాకుండా వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అర్థమయ్యే అవకాశముంటుందని అంటున్నారు.
మెప్పు కోసం కాకుండా...
పీఏసీ సభ్యులు కూడా జగన్ మెప్పు కోసం ప్రయత్నించకుండా ఉన్నది ఉన్నట్లు ఆయనకు చెప్పాల్సి ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి ఇప్పటికీబాగా లేదు. ఇంకా ఓటమి నుంచి కోలుకోలేదు. అదే సమయంలో జగన్ పార్టీ పైన అభిమానం కూడా తగ్గలేదన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. ప్రజలు ఎక్కువ మంది కూటమి ప్రభుత్వానికి ఓటేయాడానికి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలేనని అందరికీ తెలుసు. అందుకే జగన్ కూడా ఈసారి మడి కట్టుకుని కూర్చుంటే మాత్రం కుదరదని కొందరు నేతలు ఇప్పటికే అభిప్రాయపడుతున్నారు. తాను ఇంత వరకే ఇస్తానంటే కుదరదని, ఎక్కువ మొత్తం ఇస్తామంటేనే జనం ఆదరిస్తారన్న విషయాన్ని జగన్ అర్థం చేసుకోవాలంటున్నారు.
సత్యసంథుడిలా పోజులిచ్చి...
జగన్ తాను ఏదో సత్య సంధుడిలా పోజులిచ్చి తాను నాలుగువేల పింఛను నెలకు ఇంత పెంచుకుంటూ పోతామన్నా ఎవరూ పెద్దగా అట్రాక్ట్ కారు. అదే సమయంలో ఐదువేల రూపాయలు ఇస్తామని చెబితే తప్ప ఫ్యాన్ పార్టీ వైపు చూడరంటున్నారు. హామీల విషయంలో జగన్ తాను ఇంతేనని కూర్చుంటే మళ్లీ బెంగళూరు టు తాడేపల్లి తిరగక తప్పదని కూడా అంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయవచ్చని, 2014, 2024 ఎన్నికల్లో జగన్ కు హామీల దెబ్బ తగిలినా ఇంకా మారకపోతే ఎలా అని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. అధికారం కావాలంటే అన్నీ విడిచిపెట్టేయాలని, వాస్తవ పరిస్థితులకంటే ఊరించే వ్యాఖ్యలే జనాన్ని దరి చేరుస్తాయంటున్నారు.
రెండుసార్లు దెబ్బతిన్నా...
2014లోనే వైసీపీ అధికారంలో రావాల్సి ఉండగా నాడు రైతు రుణమాఫీ ప్రకటన చేయమని అంటే చేయలేదని, అదే నాడు కొంపముంచిందని, 2024లోనూ పింఛను మూడు వేలంటూ పెంచుతూ పోతానని చెప్పడం, ఇతర పథకాల విషయంలో కూడా నిక్కచ్చిగా ఉండటం కూడా వైసీపీ ఓటమికి ప్రధాన కారణమని అంటున్నారు. ఈసారి జగన్ తన తీరు మార్చుకోవాలని, మ్యానిఫేస్టోను ప్రజలను ఆకట్టుకునేలా రూపొందించాలని, ఇందుకోసం ఒక కమిటీని రూపొందింది ఆకమిటీ చెప్పినట్లు ప్రజలకు వెల్లడించాలన్న డిమాండ్ వైసీపీలో ఎక్కువగా వినిపిస్తుంది. అయితే జగన్ తో వీరు నేరుగా ఈ మాటలు చెబుతారా? లేక ఎప్పటిలాగానే ఆల్ ఈజ్ వెల్ అంటూ వచ్చేస్తారా? అన్నది చూడాల్సి ఉంది. ముందు నేతలు మాటలను వింటే జగన్ కు వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయంటున్నారు.