Andhra Pradesh : లడ్డూ టీడీపీకి మాత్రమే తీపిగా ఉందా? మిగిలిన వారికి చేదు ఎందుకయ్యింది?

తిరుమల లడ్డూ విషయంలో బీజేపీ, జనసేన ఒకింత వెనకడుగు వేస్తున్నట్లే కనిపిస్తుంది

Update: 2026-02-28 07:00 GMT

తిరుమల లడ్డూ విషయంలో బీజేపీ, జనసేన ఒకింత వెనకడుగు వేస్తున్నట్లే కనిపిస్తుంది. టీడీపీలో ఉన్న కసి వారిలో లేదనిపిస్తుంది. బీజేపీ, జనసేనలు తిరుమల లడ్డూ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాయన్నది టీడీపీ నేతలకు అర్థమయింది. బీజేపీ నేతలు ఎప్పటి నుంచో తిరుమల లడ్డూ వివాదానికి దూరంగా ఉంటున్నారు. వారు అసలు దానిపై మాట్లాడేందుకు కూడా ఇష్టపడటం లేదు. ఒకరిద్దరు దిగువ స్థాయి నేతలు మినహా అగ్రనేతలు ఎవరూ లడ్డూ విషయంలో నోరు మెదపడం లేదు. ఆ మధ్య కూటమి పార్టీలోని ముఖ్య నేతలందరూ సమావేశమై మీడియా ముందుకు వచ్చినప్పటికీ బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ పెద్దగా మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారింది.

పవన్ వ్యాఖ్యలతో...
ఇక ఇటీవల శాసనసభలో తిరుమల లడ్డూ వివాదంపై చర్చ జరిగినప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కొంత కంట్రోల్ గానే మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై నింద మోయకుండా ఎక్కువ పాలక వర్గాన్నే తప్పుపడుతూ ఆయన చేసిన ప్రసంగం వింటే టీడీపీ కూడా కొంత డైలామాలో పడినట్లు కనిపించింది. నాడు తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న మాట చెబుతూనే పవన్ కల్యాణ్ అందులో తాను వైసీపీ ముఖ్య నేత ప్రమేయాన్ని మాత్రం తాను ఎన్నడూ ప్రశ్నించలేదని కూడా చెప్పారు. ఆయనకు తెలియకుండానే జరిగి ఉండవచ్చని చెప్పుకొచ్చారు. దీంతో వైసీపీ సోషల్ మీడియాలో పవన్ చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తూ లడ్డూ వివాదాన్ని టీడీపీ మెడకు చుట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది.
బయటకు తెచ్చి ...
అసలు తిరుమల లడ్డూ వివాదాన్ని బయటకుతెచ్చి రాజకీయంగా ఇబ్బందుల్లో పడ్డామా? అన్న భావన తెలుగుదేశం పార్టీలోనూ నెలకొంది. కూటమిలోని మిత్ర పక్షాలు కూడా మద్దతు లేకపోవడంతో తాము చెప్పేవాటిని జనం ఎంత మాత్రం నమ్ముతారన్న అభిప్రాయం టీడీపీ ముఖ్యనేతల్లో వ్యక్తమవుతుంది. దారిన పోయే దాన్ని మెడకు తగిలించుకునట్లు తయారైందన్న భావన సీనియర్ నేతల్లోనూ వ్యక్తమవుతుంది. ప్రతి విషయంలో సీనియర్ నేతల అభిప్రాయాలను తెలుసుకుని ముందుకు వెళ్లే చంద్రబాబు లడ్డూ విషయంలో తొందరపడ్డారంటూ సొంత పార్టీ నుంచే కామెంట్స్ వినపడుతున్నాయి. మొత్తం మీద తిరుమల లడ్డూ వివాదం కూటమి పార్టీకి ఇటు మిత్రపక్షంగానూ, అటు జనంలోనూ కలసి రాలేదన్న లెక్కలో నేతలున్నారు.


Tags:    

Similar News