BJP : ఏపీ బీజేపీ నేతలు అయోమయంలో ఉన్నారా? రీజన్ అదేనట
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఊగిసలాట కనిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఊగిసలాట కనిపిస్తుంది. కేంద్ర నాయకత్వం ఆలోచనలు తెలియక క్రాస్ రోడ్స్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. కూటమిలో కలసి ఉండటం గ్యారంటీ అన్న సంకేతాలు ఉన్నప్పటికీ హస్తిన వేదికగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం రాష్ట్ర బీజేపీ నేతల్లో ఒక క్లారిటీ రాలేదంటున్నారు. ఇందుకు బలమైన కారణాలున్నాయి. బీజేపీ కేంద్ర నాయకత్వం చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో కూటమిగా ఉన్నప్పటికీ జగన్ తో జగడాన్ని కొని తెచ్చుకోవడానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తుంది. అందుకు ఎప్పటికప్పుడు కేంద్ర నిఘా సంస్థలు అందిస్తున్న నివేదికల మేరకు వారు వైసీపీ అధినేత జగన్ విషయంలో మెతక వైఖరిని అవలంబిస్తున్నారని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.
అదే కారణమా?
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో జగన్ అవసరం కూడా తమకు ఉండవచ్చని వారు భావించడమే అందుకు ప్రధాన కారణం కావచ్చు. మొన్నటి ఎన్నికల్లో అరకొర సీట్లతో ఇతర ఎన్డీఏలోని ఇతర పార్టీలపై ఆధారపడాల్సి వచ్చింది. అది నరేంద్ర మోదీ, అమిత్ షాలకు సుతారమూ ఇష్టం లేదు. ఈసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కేంద్రంలో అధికారంలోకి రావాలంటే దక్షిణాదిన బలహీనంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన కూటమితో కలసి పోటీ చేయాల్సిందే. జగన్ ప్రత్యక్ష పొత్తుకు అంగీకరించరు. అందుకే కాస్త అటు ఇటైనా జగన్ తో వైరం కన్నా స్నేహంగా ఉండటమే మంచిదన్న అభిప్రాయంలో ఉన్నట్లు కనిపిస్తుంది. అదే ఇప్పుడు రాష్ట్ర నాయకత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి.
ఎటువంటి సంకేతాలు లేక...
తిరుమల లడ్డూ వివాదంలోనూ బీజేపీ ముఖ్య నేతలు ఎవరూ పెద్దగా మాట్లాడకపోవడం ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. మరొకవైపు ప్రధాని నరేంద్ర మోదీ నాలుగైదు సార్లు ఈ రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో పర్యటించినప్పటికీ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయకపోవడాన్ని కూడా కొందరు ఉదహరిస్తున్నారు. ఇన్ని కళ్ల ముందు కనపడుతుంటే ఇక తాము ఎలా స్పందిస్తామని రాష్ట్ర బీజేపీ అగ్ర నేత ఒకరు ఆఫ్ ది రికార్డుగా చెప్పడం విశేషం. అలాగని కేంద్ర నాయకత్వం ఇప్పటి వరకూ తమకు ఎలాంటి సంకేతాలు కానీ ఆదేశాలు కానీ ఇవ్వలేదని కూడా చెబుతున్నారు. పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసుకోమని మాత్రమే చెబుతున్నారని, అంతకు మించి తమకు ఏం సందేశం కావాలని అంటున్నారు. మొత్తం మీద రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ఏపీ రాజకీయాల్లో కొంత అయోమయంలోనే ఉన్నారని వారి వైఖరిని బట్టి చెప్పకనే తెలుస్తుంది.