Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. ఎందుకో తెలుసా?
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువయింది. తిరుమలకు భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. గత కొన్ని నెలలుగా తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. దర్శనానికి గంటల సమయం పడుతుంది. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులయితే ఒక రోజు స్వామి వారిని దర్శించుకునేందుకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. తిరుమలలో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నప్పటికీ వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొనకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
అధిక సంఖ్యలో రావడంతో...
తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో రావడానికి అనేక కారణాలున్నాయంటున్నారు. ఆధ్యాత్మిక చింతన ఇటీవల కాలంలో పెరగడంతో పాటు ప్రయాణం కూడా సులువుగా మారడంతో పాటు తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిపై నమ్మకం పెరగడంతోనే భక్తుల సంఖ్య పెరుగుతుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. అందుకోసం తిరుమలలో నూతన వసతి గృహాలను కూడా నిర్మిస్తున్నారు. తమిళనాడు నుంచి కూడా ఈ నెలలో అధికంగా భక్తులు వస్తారని చెబుతున్నారు. అయితే ఎంత మంది వచ్చినా భక్తులకు సులువుగా దర్శనం చేసుకునే వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఇరవై గంటల సమయం...
ఈరోజు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. క్యూ లైన్ కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు నాలుగు గంటలకు పైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 74,468 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,878 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.86 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.