Weather Report : చంపేస్తున్న చలి.. ఇంకా ఎన్నాళ్లు వణకాలంటే?

మరికొన్ని రోజుల పాటు ఈ చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు

Update: 2025-12-14 03:43 GMT

చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. నీళ్లు కూడా గడ్డకట్టిపోతున్నాయి. దక్షిణ భారత దేశం కూడా ఉత్తర భారతదేశాన్ని తలపిస్తుంది. గత పది రోజుల నుంచి చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. గత పదేళ్లలో ఇలాంటి చలితీవ్రతను ఎన్నడూ ఎదుర్కొనలేదని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాసులు చెబుతున్నారు. మరో రెండు, మూడు రోజుల పాటు ఈ చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలిగాలుల తీవ్రత తో పాటు దట్టమైన పొగమంచు కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యానికి గురవుతారని హెచ్చరిస్తున్నారు.

ఏపీలో వణుకు...
ఆంధ్రప్రదేశ్ లో చలిగాలుల తీవ్రత ఎక్కువగానే ఉంది. అతి తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. జి. మాడుగులలో ఐదు డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. ఉదయం, రాత్రి వేళ ఘాట్ రోడ్లలో ప్రయాణాలను మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పొగమంచు దట్టంగా ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంతటా ఇదే రకమైన వాతావరణం నెలకొని ఉంది. మరికొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే తమ వ్యాపారాలు కూడా దెబ్బతింటాయని చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణలో గజగజ...
తెలంగాణలో చలితీవ్రత ఎక్కువగా ఉంది. తెలంగాణలోని 27 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలికి చేతులు కూడా కొంకర్లు పోతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా అత్యల్పంగా నాలుగు నుంచి ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదయ్యాయి. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా వృద్దులు, దీర్ఘకాలిక రోగులు, చిన్నారులు సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత ఉదయం ఎనిమిది గంటలలోపు బయటకు రావద్దని కోరుతున్నారు.


Tags:    

Similar News