YSRCP : జగన్ కు ఇక ఛాన్స్ లేనట్లేనా? రీజన్ అదేనా?

వైఎస్ జగన్ ఆశలు 2029 ఎన్నికల్లో కూడా నెరవేరేటట్లు కనిపించేటట్లు లేదు

Update: 2025-12-13 07:55 GMT

వైఎస్ జగన్ ఆశలు 2029 ఎన్నికల్లో కూడా నెరవేరేటట్లు కనిపించేటట్లు లేదు. ఇందుకు అనేక కారణాలున్నాయి. కూటమి ప్రభుత్వం అనేక తప్పిదాలు చేసినప్పటికీ వారు జనంలో ఉంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెబుతున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం ప్రజల్లోకి బాగా వెళ్లినట్లు కనిపిస్తుంది. కూటమి కలిసి ఉన్నంత కాలం జగన్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చని ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు కూడా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అదే సమయంలో కూటమి ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలను విస్మరించడం లేదు.

మూడు జిల్లాలు మినహా...
వైసీపీకి ప్రస్తుతం రాయలసీమలోని మూడు జిల్లాల్లో తప్పించి ఎక్కడా బలం పుంజుకోలేదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాయలసీమలోనూ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో మాత్రమే వైసీపీ ఈ రెండేళ్లలో కాస్త పుంజుకుందని, కానీ కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నది విశ్లేషకుల అంచనా. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని ప్రజల్లో అసంతృప్తికి గురి చేసినప్పటికీ అది వైసీపికి ప్లస్ అయ్యేంతగా లేవన్నది వాస్తవం. ఎందుకంటే కొద్డో గొప్పో.. బతిమాలి కేంద్రం నుంచి నిధులను తీసుకు రావడంలో చంద్రబాబు ఒకింత సక్సెస్ అవుతుండటంతో వైసీపీ వైపు చూసే అవకాశం లేదంటున్నారు.
కూటమి కలసి ఉన్నంత కాలం...
ముఖ్యంగా పవన్ కల్యాణ్ వంటి వారు కూటమిలో మిత్రులుగా ఉండటం కూడా కలసి వచ్చే అంశమే. జనసేనకు ఓటింగ్ లేకపోయినా సామాజికవర్గం, ఫ్యాన్స్ బలం పోలింగ్ కేంద్రాల వద్ద కూటమికి అండగా ఉంటుందన్న భావన వ్యక్తమవుతుంది. పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేశ్ లు నిత్యం జనంలో ఉండటంతో పాటు సమస్యల పరిష్కరానికి కొద్దో గొప్పో కృషి చేయడం కూడా కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు. కూటమికి, జగన్ ప్రభుత్వానికి మధ్య పోలిక పెట్టి చూస్తే పెద్దగా తేడా లేకపోవడం కూడా ఎన్డీఏ విజయానికి దోహదపడతాయంటున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండటంతో లెక్కలు మారే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పటి వరకూ అయితే జగన్ కు వచ్చే ఎన్నికల్లోనూ ఛాన్స్ లేనట్లేనని అంటున్నారు.


Tags:    

Similar News