Ys Jagan : ఆంక్షల మధ్య నేడు జగన్ రెంటపాళ్ల పర్యటన పై టెన్షన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే పోలీసులు ఆంక్షలు విధించారు. వందకు మించి జగన్ వెంట రావడానికి వీలు లేదని, మూడు నుంచి నాలుగు వాహనాలను మాత్రమే అనమతిస్తామని పోలీసులు తెలిపారు. అయితే వైసీపీ నేతలు మాత్రం జగన్ పర్యటనను అడ్డుకోలేరని ప్రకటించారు. జగన్ ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటిస్తారని, ఆయనను చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలి వస్తారని, వైఎస్ జగన్ కు అవసరమైన సెక్యూరిటీని ఏపీ పోలీసులు కల్పించాలని కోరారు. పోలీసులు ఒకవైపు ఆంక్షలు విధించగా, మరొక వైపు వైసీపీ నేతలు పట్టుబడుతుండటం టెన్షన్ కు దారి తీస్తుంది.
వెళ్లేది తధ్యమంటున్న వైసీపీ...
సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లకు జగన్ ఉదయం పది గంటలకు వెళ్లనున్నారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి పది గంటలకు రెంటపాళ్లకు జగన్ చేరుకుంటారు. ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. అక్కడ ఆయన విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా జగన్ జనాలను ఉద్దేశించి మాట్లాడే అవకాశముంది. గంట సేపు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం తిరిగి రెంటపాళ్ల నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి ఒంటిగంటకు తాడేపల్లి చేరుకోనున్నారు. ఈ మేరకు వైసీపీ అధికారికంగా జగన్ టూర్ షెడ్యూల్ ను విడుదల చేసింది.
చిన్న వీధి కావడంతో....
అయితే నాగమల్లేశ్వరరావు కుటుంబం నివాసముంటున్న ఇల్లు ఇరుకు సందుల్లో ఉందని, అందులోనూ ఆ గ్రామం తెలుగుదేశం పార్టీకి బలమైనదని, అక్కడ ఉద్రిక్త వాతావరణ నెలకొనే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు. అమరావతి మహిళలపై వ్యాఖ్యల నేపథ్యంలో తొలిసారి పల్నాడు పర్యటనకు జగన్ వస్తున్న నేపథ్యంలో ఘర్షణలు చోటు చేసుకునే ఛాన్స్ ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే మామూలుగా వచ్చి వందకు మించకుండా వస్తే తాము జగన్ కు తగిన బందోబస్తు కల్పించగలమని పల్నాడు ఎస్పీ తెలిపారు. పోలీసులకు వైసీపీ నేతలు సహకరించాలని, శాంతి భద్రతలు సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మాత్రమే ఆంక్షలు విధించామని, ఇరుకు వీధి కావడంతో తొక్కిసలాట జరుగుతుందని కూడా పోలీసులు చెబుతున్నారు. మొత్తం మీద నేటి జగన్ పల్నాడు పర్యటనలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.