TDP : యువతరం.. గాడి తప్పితే.. ఎలా? టీడీపీలో అంతర్మధనం
తెలుగుదేశం పార్టీకి యువరక్తం ఎక్కించాలని చూస్తుంటే పార్టీకి వారే ఎసరు పెట్టేటట్లు కనిపిస్తున్నారు
తెలుగుదేశం పార్టీకి యువరక్తం ఎక్కించాలని చూస్తుంటే పార్టీకి వారే ఎసరు పెట్టేటట్లు కనిపిస్తున్నారు. గత రెండేళ్ల నుంచి ఎన్ని వివాదాలు.. ఎన్ని ఆరోపణలు.. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ ఇన్ని ఆరోపణలను పార్టీ నేతలు ఎదుర్కొనలేదు. 2000 సంవత్సరంలో అనుకుంటా... అప్పట్లో మంత్రిగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డిపై స్టేషనరీ కొనుగోలులో అవకతవకలు చేశారని పత్రికల్లో వార్తలు వచ్చిన వెంటనే చంద్రబాబు వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించిన విషయాన్ని సీనియర్ నేతలు గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు.
మొన్నటి ఎన్నికల తర్వాత...
2024 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ పయనించే మార్లమే ఎక్కడో తేడా కొడుతోందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. పార్టీ లో జరుగుతున్న పరిస్థితులపై చంద్రబాబుకు కూడా కంట్రోల్ లేదని అంటున్నారు. కొత్తతరానికి నాయకత్వ బాధ్యతలను అప్పగించాలన్న ఆలోచనలో వాస్తవమున్నా కానీ నేతల బ్యాక్ గ్రౌండ్ ను గుర్తించడంలో నాయకత్వం విఫలమవుతుంది. చంద్రబాబుకు తప్పుడు ఫీడ్ బ్యాక్ ఇవ్వడం వల్లనే పార్టీ అభాసుపాలవుతుందన్న కామెంట్స్ సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. కొత్త తరం మాత్రం ఆ బాధ్యతను అర్థం చేసుకున్నట్టుగా కనిపించడం లేదు. మొన్నటి ఎన్నికల్లో మంచి మెజారిటీతో సునాయాసంగా గెలిచారు. అందుకే చాలా మందికి రాజకీయాలు చాలా ఈజీగా కనిపిస్తున్నాయి. కానీ రాజకీయాలు అంత ఈజీ కాదన్న విషయాన్ని యువ నేతలు మర్చిపోతున్నారు.
చంద్రబాబు సమావేశం...
మరొకవైపు పుట్టా మహేష్ ఉదంతంతో పార్టీ ప్రజాప్రతినిధులతో చంద్రబాబు సమావేశమవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై ఎలా వ్యవహరించాలన్న దానిపై చంద్రబాబు స్వయంగా క్లాస్ పీకేందుకు సిద్ధమయ్యారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వరసబెట్టి రెండేళ్ల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటుండటంతో ఇక ఉపేక్షిస్తే వచ్చే ఎన్నికల్లో భంగపాటు తప్పదని చంద్రబాబు గుర్తించారు. అసలే పనితీరు మెరుగుపర్చుకోని ఎమ్మెల్యేల గురించి టెన్షన్ పడుతుంటే వివాహేతర సంబంధాలు, డ్రగ్స్ ఆరోపణలు పార్టీని కుదిపేస్తున్నాయి. అయితే ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న యువనేతలు, కొత్తగా ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయిన వారిని చంద్రబాబు ఎలా కట్టడి చేస్తారన్నది చూడాలి.