Ys Sharmila :జాబ్ క్యాలెండర్ పై వైఎస్ షర్మిల సెటైర్లు

జాబ్ క్యాలెండర్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సెటైర్ వేశారు

Update: 2026-03-20 08:39 GMT

జాబ్ క్యాలెండర్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సెటైర్ వేశారు. ఖాళీలు బారెడు.. నోటిఫికేషన్లు చారెడు అని అన్నారు. కొండంత రాగం తీసి కూసంత పాట పాడినట్లుంది కూటమి ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ అని వైఎస్ షర్మిల అన్నారు. రెండేళ్లుగా ఊరించి ఉసూరుమనిపించారని, నిరుద్యోగ బిడ్డలను నమ్మించి నయవంచన చేశారని వైఎస్ షర్మిల అన్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో చంద్రబాబు చేసింది పచ్చి మోసం అని అన్నారు. ముష్టి 10 వేల పోస్టులకు షెడ్యూల్ ఇచ్చి, మాట నిలబెట్టుకున్నామని, జాబ్ ఫస్ట్ విధానమని గొప్పలు చెప్పడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు అని అన్నారు. ఉద్యోగాల భర్తీ భారీస్థాయి పేరుతో రెండేళ్లుగా ఊదరగొట్టారని అన్నారు. ఆయా శాఖల మంత్రులు వేల సంఖ్యలో నోటిఫికేషన్లని పూటకో మాట చెప్పారని, విద్యాశాఖలో బోధన, బోధనేతర ఖాళీలు 30 వేల ఉద్యోగాల సంగతేంటి ? అని ప్రశ్నించారు. పోలీస్ శాఖ లో వెంటనే భర్తీ అని చెప్పిన 19,999 ఉద్యోగాలు ఏమైనట్లు ? నిలదీశారు. ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులు ఎటుపోయినట్లు? అని ప్రశ్నించారు.

నిరుద్యోగుల సంఖ్యే ఎక్కువ...
పంచాయితీ రాజ్ డిపార్ట్ మెంట్ లో భర్తీ చేయాల్సిన 26 వేల నియామకాల ప్రస్తావన ఎక్కడ ? అంటూ - మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో లెక్కకు తీసిన 27 వేల ఖాళీల భర్తీ లేనట్లేనా? అని వైఎస్ షర్మిల నిలదీశారు. రెవిన్యూలో 13 వేలు, వైద్యశాఖలో 26 వేలు, వ్యవసాయ శాఖలో 3 వేల ఖాళీలను వెంటనే నింపుతామని ఇచ్చిన హామీలు బూడిద పాలేనా ? అని అన్నారు. రాష్ట్రంలో 153 విభాగాల పరిధిలో ఖాళీల సంఖ్య అక్షరాల 1.80 లక్షలు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల తర్వాత ఇచ్చిన జాబ్ క్యాలెండర్ పోస్టుల సంఖ్య కేవలం 10 వేలు అని అన్నారు. ఖాళీల్లో ఏటికేటా 20 శాతం చొప్పున భర్తీ చేసినా, రెండేళ్లకు కలిపి కనీసం 50 వేల ఉద్యోగాలనైనా భర్తీ చేయాలి కదా ? అన్న అన్న వైఎస్ షర్మిల - నిరుద్యోగుల సంఖ్యలో దేశంలోనే రాష్ట్రం ప్రథమస్థానమని, 50 లక్షల మంది నిరుద్యోగులుంటే ఇందులో ప్రభుత్వ ఉద్యోగాలకోసం.. పుస్తకాలతో పోటీ పడుతున్న వారి సంఖ్య దాదాపు 30 లక్షలని సెటైర్ వేశారు. కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని, పదో పరకో పేరుతో జాబ్ క్యాలెండర్ కాదు.. భారీ స్థాయిలో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల వయోపరిమితి 42 నుంచి 46 ఏళ్లకు పెంచుతామని ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని వైఎస్ షర్మిల కోరారు.















Tags:    

Similar News