టీడీపీ వర్సెస్ వైసీపీ.. పవన్ స్పందన ఇదే..!
తీవ్ర ఉద్రిక్తతల నడుమ చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన సాగిన
తీవ్ర ఉద్రిక్తతల నడుమ చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన సాగిన సంగతి తెలిసిందే. పుంగనూరులో చంద్రబాబుకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. పోలీసుల లాఠీచార్జి వంటి ఘటనలతో వాతావరణం వేడెక్కింది. ఈ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ ఘటనను ఖండిస్తున్నట్లు తెలిపారు.
"ప్రతిపక్షం గొంతు వినిపించకూడదనే నియంతృత్వం పెచ్చరిల్లుతోంది. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ వైఖరి ప్రతిపక్షం గొంతు నొక్కేలా ఉంది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వైసీపీ నాయకుల అరాచకాలతో ఇబ్బందులుపడుతున్నారు. ప్రజల తరఫున పోరాడటం ప్రతిపక్షాల బాధ్యత. ఈ రోజు పుంగనూరులో చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు వాంఛనీయం కాదు. ఆయన పర్యటనను అడ్డుకొనేందుకు వైసీపీ వ్యక్తులు రాళ్ళ దాడులకు పాల్పడటం, వాహనాలు ధ్వంసం చేయడం అధికార పార్టీ హింసా ప్రవృతిని తెలియచేస్తోంది. పుంగనూరులో చోటు చేసుకున్న పరిణామాలను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి."అని పవన్ కళ్యాణ్ అన్నారు.