Pawan Kalyan : పవన్ ఆలోచన లో ఇంతుందా?

జనసేన నేత పవన్ కల్యాణ్ తెలిసో.. తెలియక తీసుకున్న నిర్ణయం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టే అవకాశాలున్నాయి.

Update: 2026-01-02 09:13 GMT

జనసేన నేత పవన్ కల్యాణ్ తెలిసో.. తెలియక తీసుకున్న నిర్ణయం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టే అవకాశాలున్నాయి. పదిహేనేళ్ల పాటు కూటమి ప్రభుత్వం కలసి ఉంటుందని చెప్పడం, చంద్రబాబు నాయుడు అనుభవం వల్లనే ఆయన మరో పదిహేనేళ్లు సీఎంగా కొనసాగాలని పదే పదే చెప్పడం కూడా పవన్ కల్యాణ్ ముందుచూపుతో అన్నారా? లేక జగన్ ను అధికారంలోకి రానివ్వకూడదని భావించారో తెలియదు కానీ ప్రస్తుతమున్న ఏేపీ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవి ముళ్ల కిరీటాన్ని నెత్తిన పెట్టుకోవడమే. అందుకే పవన్ కల్యాణ్ పదిహేనేళ్లు ఆగిన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపడితే ఇబ్బందులుండవని భావిస్తుండి ఉండవచ్చు.

అనేక సవాళ్ల మధ్య...
అయితే ఆయన ఆ ఉద్దేశ్యంతో అన్నారో? లేదో తెలియదు కానీ పవన్ కల్యాణ్ నిర్ణయానికి మాత్రం ఒకరకంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మరో మూడు దఫాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టే వాళ్లు అనేక సవాళ్లు ఎదుర్కొనాల్సిందే. అలాగే ఉన్న పేరు ప్రతిష్టను కోల్పోవాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అసలు ఏపీ ఇప్పట్లో ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. పదిహేనేళ్ల తర్వాత ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలతో కొంత సానుకూలత రావచ్చు. అందుకే పవన్ కల్యాణ్ తొందరపడి అభిమానులు, సామాజికవర్గం వారు డిమాండ్ చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కాకపోవడమే ఒకరకంగా ఆయనకు మంచిదంటారు.
ఇమేజ్ చెక్కుచెదరకుండానే...
పవన్ కల్యాణ్ కు ఒక ఇమేజ్ ఉంది. అది చెక్కు చెదరకూడదు. అందుకే ఆయన గత రెండేళ్ల నుంచి తన శాఖకు మాత్రమే పరిమితమయ్యారు. ఢిల్లీకి పరుగులు పెట్టడం లేదు. రాష్ట్రం కోసం నిధులు ఇవ్వండంటూ బీజేపీ పెద్దల వద్ద చేయిచాచడం లేదు. ఇక్కడే తనకు అప్పగించిన శాఖల వరకే పరిమితమవుతున్నారు. తనకున్న ఆర్థిక స్థాయిలో కొన్ని హామీలు తాను ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ ప్రజల్లో తనకున్న పేరు చెదిరిపోకుండా చేసుకోగలుగుతున్నారు. అందుకే పవన్ కల్యాణ్ గురించి అభిమానులు అనవసరంగా ఆందోళన పడవద్దని, ఆయన ఒక రోడ్డు మ్యాప్ ను తయారు చేసుకుని రాజకీయాలు చేస్తున్నారంటున్నారు సన్నిహితులు. మొత్తం మీద పవన్ ఆలోచన లో ఇంతుందా? అన్నది మాత్రం తెలియకున్నా ఆయన నిర్ణయం మాత్రం కరెక్టేనని చెప్పక తప్పదు.


Tags:    

Similar News