Bhumana : భూమన మళ్లీ ఫోకస్ పెట్టారట... అందుకు ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా?
వైసీపీలో సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తిరిగి యాక్టివ్ అయ్యారు
వైసీపీలో సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తిరిగి యాక్టివ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీకి సిద్ధమవుతున్నట్లే కనపడుతుంది. గత ఎన్నికల్లో తన స్థానంలో భూమన అభినయ రెడ్డిని బరిలోకి దింపారు. అయితే మొన్నటి ఎన్నికల్లో కూటమి హవా ఎక్కువగా ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా బలమైన గాలులు వీయడంతో భూమన కూడా తిరుపతి నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. భూమన కరుణాకర్ రెడ్డి గతంలో తిరుపతి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012 ఉప ఎన్నికల్లోనూ, తర్వాత 2019 ఎన్నికల్లోనూ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి నియోజకవర్గం నుంచి గెలిచారు. అయితే ఆయనకు 2019 ఎన్నికల్లో మంత్రి పదవి వస్తుందని అనుకున్నా దక్కలేదు.
వచ్చే ఎన్నికల్లో...
భూమన కరుణాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని చెబుతున్నారు. వైఎస్ జగన్ కూడా ఈసారి ప్రయోగాలకు పోకుండా సీనియర్ నేతలకే టిక్కెట్లు ఇవ్వాలన్న యోచనలో ఉన్నారు. వారసులను పక్కన పెట్టి మీరే పోటీకి దిగాలంటూ పలువురు సీనియర్ నేతలకు ఇప్పటికే జగన్ సూచించినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికలు అత్యంత కీలకమని, యువకులను పోటీలోకి దించితే ఓట్లు పడతాయా? లేదా? అన్న అనుమానం కూడా ఉందని, అందుకే ఈసారి తండ్రులే పోటీ చేయాలని దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే సీనియర్ నేతలకు ఈ విషయాన్ని జగన్ సుస్పష్టంగా చెప్పినట్లుగా పార్టీలో ప్రచారం జరుగుతుంది.
ఓటమి పాలయిన నాటి నుంచి...
అందుకే భూమన కరుణాకర్ రెడ్డి గత ఎన్నికల్లో ఓటమి పాలయిన నాటి నుంచి తిరుపతి రాజకీయాల్లో యాక్టివ్ గా మారారంటున్నారు. ముఖ్యంగా తిరుమల లడ్డూకల్తీ పై దాదాపు ప్రతి రోజూ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, అధికార పార్టీతో పాటు, టీటీడీ పాలకమండలిపై కూడా విమర్శలు చేస్తుండటాన్ని ఇందుకు ఉదహరిస్తున్నారు. తన కుమారుడికి ఇంకా భవిష్యత్ ఉందని, ఇప్పుడే కాకుండా వచ్చే ఎన్నికలకు తాను మాత్రమే బరిలోకి దిగుతానని ఆయన సన్నిహితుల వద్ద కూడా అంటున్నారని చెబుతున్నారు. అందుకే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి రాజకీయాల్లో యాక్టివ్ గా మారడమే కాకుండా వైసీపీలో కీలకంగా మారారంటున్నారు.