Andhra Politics : విజయం మత్తులో ఉంటే అలాగే అనిపిస్తుంది గురూ.. కానీ వాస్తవమిదీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్న మాటలు కూటమి వల్లే గెలిచామని

Update: 2026-03-11 08:03 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్న మాటలు కూటమి వల్లే గెలిచామని. అందులో కొంత వరకూ మాత్రమే నిజముంది. కూటమి వల్లనే విజయం పూర్తిగా లభించలేదన్నది వాస్తవం. 94 శాతం సీట్లు గెలిచామంటే తనపై, పవన్ కళ్యాణ్, మోదీపై ఉన్న విశ్వాసమేనంటూ చంద్ర బాబు నాయుడు ఇటీవల అసెంబ్లీలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. కానీ అందులో నలభై శాతం మాత్రమే నిజముంది. వాస్తవానికి గత ఎన్నికల్లో కూటమి అంత అద్భుతమైన విజయానికి గల కారణాలను టీడీపీకి చెందిన వారే తమ అభిప్రాయాలను భిన్నంగా చెబుతున్నారు. కేవలం కూటమి వల్లనే గత ఎన్నికల్లో అధికారంలోకి రాలేదని, ఎన్నో కారణాలున్నాయంటున్నారు.

ముగ్గురి మీద విశ్వాసంతోనైనా...
2024 ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పుని, అమోఘమైన గెలుపు మత్తులో సరిగా అర్ధం చేసుకోలేని కూడా కామెంట్స్ పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ముగ్గురి మీద విశ్వాసంతో గెలుపు రావాలంటే పాజిటివ్ ఓటు అనేది కీలకం. అప్పుడు బాగా అంటే బాగా యాభై శాతం మేర ఓట్లు, సుమారు 130-140 వరకూ సాధ్యమయ్యే అవకాశం ఉండేదంటున్నారు. కానీ 56 శాతం పైగా ఓట్లు సాధ్యమయ్యింది అంటే అది ఖచ్చితంగా ప్రత్యర్థి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద నెగటివ్ ఓటు కారణంగానే అన్ని సీట్లు వచ్చాయన్న అభిప్రాయాలను నెట్టింట వ్యక్తం చేస్తున్నారు. జగన్ పై వ్యతిరేకత కారణంగానే 164 స్థానాలు కూటమికి వచ్చాయంటున్నారు.
సానుకూలత కంటే...
కూటమిపై సానుకూలత కంటే గత ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా గత ఎన్నికల్లో పనిచేసిందన్నది చాలా మంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జగన్ ను అధికారంలోకి రానివ్వకూడదన్న కసితో ప్రజలు ఓటు వేయడం వల్లనే సాధ్యమయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. 1999, 2014 ఎన్నికలు చంద్రబాబుమీద, 2019 ఎన్నికలు వైఎస్ జగన్ మీద సానుకూలతతో ప్రజాతీర్పు వచ్చింది. 1994 ఎన్నికలలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద, 2024 ఎన్నికలలో జగన్ పాలన మీద తీవ్ర వ్యతిరేకతతో నెగటివ్ ఓటు ఫలితాలని ప్రభావితం చేసింది. అందుకే ఈరెండు ఎన్నికలలోనూ ఆయా పక్షాలకు కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి వచ్చిందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. అద్వితీయమైన గెలుపు పొందిన కూటమి పార్టీలకు చెందిన అగ్రనేతలు తాము కలిస్తేనే ఇంతటి గెలుపు సాధ్యమయిందని చెప్పుకోవడం ఆత్మవంచనే అవుతుందని, ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక రాకుండా పాలన సాగించాలని కూటమి పార్టీల అభిమానులు కోరుతున్నారు.


Tags:    

Similar News